వైభవ్ వచ్చేశాడు
ABN , Publish Date - Jun 07 , 2026 | 05:31 AM
ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను ఉతికారేస్తూ.. క్రికెట్ మైదానంలో ప్రకంపనలు సృష్టిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన కెరీర్‌లో అతిపెద్ద ఘనత సాధించాడు.
తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ
సూర్యకు దక్కని చోటు
ఐర్లాండ్, ఇంగ్లండ్‌లతో సిరీస్‌లకు భారత జట్టు
శ్రేయాస్‌కే టీ20 పగ్గాలు
ఆసియా గేమ్స్ టీమ్‌లో బుమ్రా
ముంబై: ప్రపంచ అగ్రశ్రేణి బౌలర్లను ఉతికారేస్తూ.. క్రికెట్ మైదానంలో ప్రకంపనలు సృష్టిస్తున్న 15 ఏళ్ల చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీ తన కెరీర్‌లో అతిపెద్ద ఘనత సాధించాడు. పరుగుల వరద పారిస్తున్న ఈ చిన్నోడు ఏకంగా టీమిండియా జట్టుకే ఎంపికయ్యాడు. భారత టీ20 జట్టు ఈనెల 26 నుంచి జూలై 11 వరకు ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలో 7 మ్యాచ్‌లు ఆడనుంది. దీంతోపాటు సెప్టెంబరులో జరిగే ఆసియా క్రీడల్లోనూ జట్టు తలపడనుంది. ఈనేపథ్యంలో శనివారం అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటీ టీ20 జట్లను ప్రకటించింది. అందరి అంచనాలకు తగ్గట్టుగానే శ్రేయాస్ అయ్యర్‌కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇక ఆటగాడినూ రాణించలేకపోతున్న సూర్యకుమార్‌కు జట్టులో కూడా చోటు లేకుండా పోయింది. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఈ హైదరాబాద్ ఆటగాడు ఏకంగా కెప్టెన్సీ రేసులో నిలిచినా, సెలెక్టర్లు శ్రేయాస్‌వైపే మొగ్గు చూపారు. 23 ఏళ్ల తిలక్ ఇప్పటికే ఇండియా-ఎ సారథిగా ఉన్నాడు. మరో తెలుగు ఆటగాడు నితీశ్ కుమార్ జట్టులో చోటు నిలబెట్టుకున్నాడు.
‘అతడు గేమ్ ఛేంజర్’: ఈ ఐపీఎల్‌లో 776 పరుగులు బాదిన వైభవ్‌ను జాతీయ జట్టుకు ఎంపిక చేయాలనే డిమాండ్ సర్వత్రా వినిపించింది. ఇప్పటికే అతను భారత్ ‘ఎ’ తరఫున శ్రీలంక టూర్‌లో ఉన్నాడు. ‘వైభవ్ గేమ్ ఛేంజర్. అతడి సత్తా ఏంటో ఐపీఎల్ ప్లేఆ్‌ఫ్సలో చూశాం. రాజస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. ఎంతో ఒత్తిడి ఉండే ఐపీఎల్‌లో ఎలాంటి బెరుకు లేకుండా భారీఇన్నింగ్స్‌లతో రాణించాడు. అతనిపై చాలా ఆశలే ఉన్నాయి’ అని అగార్కర్ అన్నాడు. ఇక టీ20 వరల్డ్‌కప్ జట్టులో సభ్యుడిగా ఉన్న స్పిన్నర్ కుల్దీప్పై వేటు పడింది. అతడి స్థానంలో రవి బిష్ణోయ్‌ను ఎంపిక చేశారు. గాయంతో ఐపీఎల్‌కు దూరమైన పేసర్ హర్షిత్ రాణాను రెండు జట్లలోకి తీసుకున్నారు. ఐపీఎల్‌లో లఖ్‌నవూ పేసర్ ప్రిన్స్ యాదవ్ ఐర్లాండ్, ఇంగ్లండ్ టూర్లకు వెళ్లనున్నాడు. ఇక, చెన్నై తరఫున ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిన శివమ్ దూబేను రెండు జట్లకు ఎంపిక చేయడం గమనార్హం. ఐర్లాండ్, ఇంగ్లండ్ సిరీస్‌లకు బుమ్రాకు విశ్రాంతినివ్వగా, ఆసియాక్‌పనకు ఎంపిక చేశారు. ఇందులో సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా, ప్రిన్స్‌ను పరిగణనలోకి తీసుకోలేదు.

శ్రే‘యెస్’ అనిపిస్తాడా?
భారత టీ20 జట్టులో ఇక శ్రేయాస్ శకం ఆరంభం కానుంది. రోహిత్ శర్మ ఆధ్వర్యంలో టీ20 వరల్డ్‌కప్ సాధించాక.. జట్టు పగ్గాలు సూర్యకుమార్ అందుకున్నాడు. తన సారథ్యంలో టీమిండి యాకు మరో కప్ అందించాక సూర్య కూడా వైదొలగాల్సి వచ్చింది. రోహిత్ రిటైర్ కాగా.. సూర్యపై మాత్రం పేలవ ఫామ్‌తో వేటు పడింది. ఇలాంటి స్థితిలో జట్టు పగ్గాలు చేపట్టిన శ్రేయాస్‌పై అందరి చూపు నెలకొంది. ఐపీఎల్‌లో ఢిల్లీ, కోల్‌కతా, పంజాబ్‌లను విజయవంతంగా ముందుకు నడిపించిన శ్రేయాస్ భారత్ తరఫున రెగ్యులర్ టీ20 ప్లేయర్ కాదు. 2023, డిసెంబరులో అతను చివరి టీ20 ఆడాడు. 2024లో సెంట్రల్ కాంట్రాక్ట్ కూడా కోల్పోయాడు. ఆ తర్వాత 2024, 2026 టీ20 వరల్డ్‌కప్, గతేడాది ఆసియాక్‌పలోనూ అతనికి చోటు దక్కలేదు. అయినా, అతనెప్పుడూ అసంతృప్తిని వ్యక్తం చేయలేదు. తన బ్యాటింగ్‌పై, గాయాల నుంచి కోలుకోవడంపైనే దృష్టి సారించాడు. ఐపీఎల్‌లో గతేడాది పంజాబ్ తరఫున 498, ఈసారి 604 పరుగులతో అదరగొట్టాడు. ఫలితంగా 30 నెలల తర్వాత పునరాగమనంలో ఏకంగా జట్టు కెప్టెన్సీనే శ్రేయాస్ వరించింది. కానీ, గతంలో కోచ్ గంభీర్‌తో విభేదాలు న్నాయన్న వార్తల నేపథ్యంలో అతనితో సమన్వయం చేసుకుంటూ రాబోయే కఠిన సిరీస్‌లకు జట్టును ఏమేరకు ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.
చిన్నోడు చరిత్ర తిరగరాశాడు
ఇప్పటిదాకా భారత్ తరఫున పిన్నవయస్సులో అరంగేట్రం చేసిన రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1989లో సచిన్ 16 ఏళ్ల వయస్సులో పాక్‌పై అరంగేట్రం చేశాడు. భవిష్యత్‌లో ఈ రికార్డును అధిగమించడం అసాధ్యమేనని అంతా భావించారు. కానీ 37 ఏళ్ల తర్వాత 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ టీమిండియాకు ఎంపికై చరిత్రను తిరగరాశాడు. ఏడాదిగా వైభవ్ ఆట అంచనాలకు మించి ప్రపంచ క్రికెట్‌ను సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తున్న విషయం తెలిసిందే.