పతకం ఖాయం
ABN , Publish Date - May 02 , 2026 | 01:59 AM
ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మాజీ విజేత భారత పురుషుల జట్టు అదరగొట్టింది. పటిష్ట చైనీస్ తైపీని చిత్తుచేసిన మన బృందం సెమీఫైనల్‌కు...
థామస్ కప్ సెమీ్‌సకు భారత్
క్వార్టర్స్‌లో తైపీ చిత్తు
హార్సెన్స్ (డెన్మార్క్): ప్రతిష్టాత్మక థామస్ కప్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో మాజీ విజేత భారత పురుషుల జట్టు అదరగొట్టింది. పటిష్ట చైనీస్ తైపీని చిత్తుచేసిన మన బృందం సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాన్ని ఖరారు చేసుకొంది. శుక్రవారం జరిగిన క్వార్టర్‌ఫైనల్లో లక్ష్యసేన్ సారథ్యంలోని భారత బృందం 3-0తో తైపీపై విజయం సాధించింది. తొలుత హోరాహోరీగా సాగిన సింగిల్స్‌లో లక్ష్యసేన్ 18-21, 22-20, 21-17తో ప్రపంచ ఆరో ర్యాంకర్ చౌ తిన్ చెన్‌ను ఓడించాడు. గంటా 28 నిమిషాల పోరులో తొలి గేమ్ ఓడిన లక్ష్య.. రెండుసార్లు మ్యాచ్ పాయింట్‌ను కాచుకొని పైచేయి సాధించాడు. అనంతరం జరిగిన డబుల్స్‌లో ప్రపంచ నాలుగో ర్యాంక్ జోడీ సాత్విక్ సాయిరాజ్/చిరాగ్ శెట్టి 23-21, 19-21, 21-12తో చియు సియాంగ్ చి/వాంగ్ చి లిన్ ద్వయంపై నెగ్గి భారత్ ఆధిక్యాన్ని 2-0కు పెంచింది. తర్వాత రెండో సింగిల్స్‌లో యువ సంచలనం ఆయుష్ శెట్టి 21-16, 21-17తో ప్రపంచ 8వ ర్యాంకర్, ఆలింగ్లండ్ ఓపెన్ చాంపియన్ లిన్ చున్ యిని అలవోకగా చిత్తు చేయడంతో భారత్ 3-0తో తైపీపై స్పష్టమైన ఆధిక్యం అందుకుంది. సెమీఫైనల్లో ఫ్రాన్స్ లేదా జపాన్‌తో భారత్ తలపడనుంది. సెమీ్‌సలో ఓడినా కనీసం కాంస్య పతకం భారత్ సొంతమవుతుంది. ఈ టోర్నీలో తొలిసారిగా 2022లో స్వర్ణం నెగ్గిన భారత్.. అంతకుముందు 1952, 1955, 1979లో కాంస్య పతకాలు దక్కించుకుంది.
ఇవి కూడా చదవండి:
శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్