ఊపేశారు
ABN , Publish Date - Apr 14 , 2026 | 03:57 AM
ఎట్టకేలకు సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఈ ఐపీఎల్‌లో ఓటమి లేకుండా దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు ముకుతాడు వేసింది.
సన్‌రైజర్స్ ఆల్‌రౌండ్ షో
ఇషాన్ భారీ ఇన్నింగ్స్
సకీబ్, ప్రఫుల్‌కు చెరో నాలుగు వికెట్లు
హైదరాబాద్: ఎట్టకేలకు సొంత వేదికపై సన్‌రైజర్స్ హైదరాబాద్ అదరగొట్టింది. ఈ ఐపీఎల్‌లో ఓటమి లేకుండా దూసుకెళుతున్న రాజస్థాన్ రాయల్స్‌కు ముకుతాడు వేసింది. ఇషాన్ కిషన్ (44 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 91) జోరుతో బ్యాటింగ్‌లో భారీ స్కోరు చేసిన రైజర్స్.. తొలిసారి బౌలింగ్‌లోనూ వహ్వా అనిపించింది. సీనియర్లను పక్కనబెట్టి యువ పేసర్లు ప్రఫుల్ హింగే, సకీబ్ హుస్సేన్‌లకు తొలిసారి అవకాశమివ్వగా.. ఆ ఇద్దరు నాలుగేసి వికెట్లతో చెలరేగడం విశేషం. దీంతో సోమవారం జరిగిన ఈ మ్యాచ్‌లో రైజర్స్ 57 పరుగులతో ఏకపక్ష విజయాన్ని అందుకుంది. ముందుగా సన్‌రైజర్స్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 216 పరుగులు చేసింది. క్లాసెన్ (26 బంతుల్లో 1 ఫోర్, 3 సిక్సర్లతో 40), నితీశ్ (13 బంతుల్లో 4 సిక్సర్లతో 28), సలీల్ అరోరా (13 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24 నాటౌట్) రాణించారు. ఆర్చర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో రాజస్థాన్ 19 ఓవర్లలో 159 రన్స్‌కు ఆలౌటైంది. ఫెరీరా (44 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 69), జడేజా (32 బంతుల్లో 5 ఫోర్లతో 45), తుషార్ దేశ్‌పాండే (11 బంతుల్లో 3 సిక్సర్లతో 25) మాత్రమే రెండంకెల స్కోర్లు చేశారు. మలింగ 2 వికెట్లు తీశాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా ప్రఫుల్ నిలిచాడు.
9 పరుగులు.. 5 వికెట్లు: 1, 0, 0, 0, 4.. భారీ ఛేదన బరిలోకి దిగిన రాజస్థాన్ టాప్-5 ఆటగాళ్ల స్కోర్లివి. తొలి 3 ఓవర్లలోనే ఏకంగా 5 వికెట్లు కోల్పోవడంతో ఇదంతా కలా? నిజమా? అనే భ్రాంతిలో ఉండిపోయింది. ఐపీఎల్ అరంగేట్ర పేసర్ ప్రఫుల్ హింగే సృష్టించిన మాయాజాలమిది. బుమ్రా, హాజెల్‌వుడ్ వల్ల కాలేకపోయిన వైభవ్ సూర్యవంశీ (0) జోరును అతడు ఒక్క బంతికే నిలువరించాడు. ప్రఫుల్ షార్ట్ డెలివరీని ఆడలేకపోయిన వైభవ్ కీపర్ సలీల్‌కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో రైజర్స్ ఆటగాళ్లతో పాటు స్టేడియంలో ఫుల్ జోష్ కనిపించింది. ఆ ఆనందాన్ని రెట్టింపు చేస్తూ జురెల్, ప్రిటోరియస్‌లను కూడా డకౌట్ చేయడంతో మొదటి ఓవర్‌లోనే మూడు వికెట్లతో ప్రఫుల్ లీగ్‌లో సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఇక రెండో ఓవర్‌లో జైస్వాల్ (1)ను మరో అరంగేట్ర పేసర్ సకీబ్ హుస్సేన్ అవుట్ చేశాడు. ఆ తర్వాత కెప్టెన్ పరాగ్ (4)ను ప్రఫుల్ తన నాలుగో వికెట్‌గా అవుట్ చేయడంతో రాజస్థాన్ 9/5 స్కోరుతో పీకల్లోతు కష్టాల్లో పడిపోయింది. అప్పటికి మూడు ఓవర్లే ముగియడం గమనార్హం. ఈ స్థితిలో 50 రన్స్ కూడా కష్టమే అనిపించినా.. జడేజా, ఫెరీరా రైజర్స్ వికెట్ల వేటను అడ్డుకున్నారు. 12 ఓవర్లపాటు నిలకడగా ఆడిన ఈ జోడీ ఆరో వికెట్‌కు 118 రన్స్ జోడించి జట్టు పరువు కాపాడింది. ఈ క్రమంలో ఫెరీరా అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. అప్పటికే గెలుపు అసాధ్యంగా కనిపించగా.. 15వ ఓవర్‌లో ఫెరీరాను సకీబ్ బౌల్డ్ చేశాడు. తర్వాతి ఓవర్‌లోనే జడేజా కూడా వెనుదిరగగా, ఆఖర్లో తుషార్ వేగంగా ఆడినా ఫలితం లేకపోయింది.
ఇషాన్ ఎదురుదాడి: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్ ఇన్నింగ్స్‌లో ఇషాన్ కిషన్ ఆటే హైలైట్. మధ్య ఓవర్లలో అతడికి క్లాసెన్ సహకరించాడు. చివర్లో నితీశ్, సలీల్ భారీషాట్లతో ఆకట్టుకుని స్కోరును 200 దాటించారు. అయితే మొదటి బంతికే ఓపెనర్ అభిషేక్‌ను పేసర్ ఆర్చర్ గోల్డెన్ డకౌట్ చేయడంతో స్టేడియంలో నిశ్శబ్దం ఆవరించింది. అటు మరో ఓపెనర్ హెడ్ (18) పెద్దగా టచ్‌లో ఉన్నట్టు కనిపించలేదు. కానీ రెండో బంతికే క్రీజులో అడుగుపెట్టిన ఇషాన్ ఎదురుదాడికి దిగాడు. దీంతో పవర్‌ప్లేలో జట్టు 51/1 స్కోరుతో ఫర్వాలేదనిపించింది. ఆ వెంటనే పరాగ్ ఓవర్‌లో హెడ్ వెనుదిరగడంతో రెండో వికెట్‌కు 55 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో ఇషాన్-క్లాసెన్ జోడీ ఆదుకుంది. 30 బంతుల్లో ఫిఫ్టీ సాధించిన ఇషాన్ 11వ ఓవర్‌లో 4,6,4తో 21 రన్స్ రాబట్టాడు. ఆర్చర్ ఓవర్‌లోనూ హ్యాట్రిక్ ఫోర్లతో చెలరేగి 91 పరుగులకు చేరాడు. సెంచరీ ఖాయమనుకున్న వేళ ఇషాన్‌కు సందీప్ రిటర్న్ క్యాచ్‌తో షాకిచ్చాడు. మూడో వికెట్‌కు క్లాసెన్‌తో కలిసి అతను 39 బంతుల్లోనే 88 రన్స్ అందించాడు. కాసేపటికే క్లాసెన్ వెనుదిరిగినా.. క్రీజులో ఉన్నంత సేపు నితీశ్ వేగం కనబర్చాడు. 18వ ఓవర్‌లో 3 సిక్సర్లతో 24 రన్స్ అందించాడు. చివరి 5 ఓవర్లలో రైజర్స్ 62 రన్స్ సాధించింది.
అరంగేట్రంతోనే అరుదైన రికార్డు
ఈ మ్యాచ్‌తోనే ఐపీఎల్‌లో అడుగుపెట్టిన 24 ఏళ్ల ప్రఫుల్ హింగె అరుదైన రికార్డు సృష్టించాడు. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు తీసి మెగా లీగ్‌లో ఈ ఫీట్ సాధించిన మొదటి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. ఐపీఎల్ ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు వికెట్లు పడగొట్టిన సందర్భాలు 32 ఉన్నా..ఇలా మూడు వికెట్లు తీసిన ఘనత ప్రఫుల్‌కే దక్కింది. విదర్భకు చెందిన కుడిచేతి వాటం పేసరైన ప్రఫుల్‌ను ఐపీఎల్ వేలంలో రూ. 30 లక్షలకే సన్‌రైజర్స్ కొనుగోలు చేసింది. అతను ఇప్పటిదాకా పది ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లాడి 27 వికెట్లు తీశాడు. ఇక, ఇదే పోరులో 4 వికెట్లు తీసి సంచలనం సృష్టించిన 21 ఏళ్ల సకీబ్ హుస్సేన్‌కు కూడా ఇదే తొలి ఐపీఎల్ మ్యాచ్ కావడం విశేషం. బిహార్‌కు చెందిన ఈ పేసర్‌ను కూడా వేలంలో రూ. 30 లక్షలకు సన్‌రైజర్స్ తీసుకుంది.