Share News

16 ఏళ్ల తర్వాత..

ABN , Publish Date - Jul 08 , 2026 | 02:31 AM

స్టాపేజ్‌ టైమ్‌లో మైకేల్‌ మెరీనో గోల్‌తో.. స్పెయిన్‌ ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌ పోరులో...

16 ఏళ్ల తర్వాత..

స్పెయిన్‌కు క్వార్టర్స్‌ బెర్త్‌

మైకేల్‌ లేటు గోల్‌

అర్లింగ్టన్‌ (యూఎస్‌): స్టాపేజ్‌ టైమ్‌లో మైకేల్‌ మెరీనో గోల్‌తో.. స్పెయిన్‌ ఫిఫా ప్రపంచకప్‌ క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన ప్రీక్వార్టర్స్‌ పోరులో స్పెయిన్‌ 1-0తో పోర్చుగల్‌పై గెలిచింది. స్ట్రయికర్‌ మెరీనో (90+1వ నిమిషం) లేటు గోల్‌తో స్పానిష్‌ జట్టుకు అనూహ్య విజయాన్ని అందించాడు. 2010లోవిజేతగా నిలిచిన స్పెయిన్‌.. ఆ తర్వాత క్వార్టర్స్‌ చేరడం ఇదే మొదటిసారి కావడం విశేషం. సెమీస్‌లో చోటు కోసం బెల్జియంతో స్పెయిన్‌ అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, ఈ ఓటమితో పోర్చుగల్‌ సూపర్‌ స్టార్‌ క్రిస్టియానో రొనాల్డో వరల్డ్‌కప్‌ కెరీర్‌ ముగిసింది.

హోరాహోరీ: ఇరుజట్లూ సమవుజ్జీలు కావడంతో మ్యాచ్‌ నువ్వానేనా? అన్నట్టుగా సాగింది. బంతిపై ఆధిపత్యం కోసం రెండు జట్లూ దీటుగానే పోరాడాయి. ఈ క్రమంలో పలు అవకాశాలు సృష్టించుకొన్నా ఫినిషింగ్‌ లోపాలతో గోల్స్‌గా మలచలేక పోయాయి. కాగా, 37వ నిమిషంలో రొనాల్డోకు గోల్‌ చేసే అవకాశం లభించింది. ఫెలిక్స్‌ హెడర్‌.. స్పెయిన్‌ కీపర్‌ సైమన్‌కు తగిలి బౌన్స్‌ కాగా దాన్ని అందుకొన్న రొనాల్డో గోల్‌ పోస్ట్‌లోకి లాఘవంగా ఫ్లిక్‌ చేశాడు. అయితే, వెంటనే అప్రమత్తమైన సైమన్‌.. ఒక్క ఉదుటన దూకి బంతిని పట్టేశాడు. దీంతో పోర్చుగల్‌ ఆధిక్యం సాధించే అవకాశం త్రుటిలో చేజారింది. దీంతో ప్రథమార్ధం గోల్‌ రహితంగా ముగిసింది. ఇక, ద్వితీయార్ధంలో 76వ నిమిషంలో ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై పోర్చుగల్‌ దాడి చేసినా గోల్‌ చేయలేక పోయింది. ఈ క్రమంలో నిర్ణీత సమయం ముగియడంతో మ్యాచ్‌ ఎక్స్‌ట్రా టైమ్‌కు మళ్లేలా కనిపించింది. కానీ, ఇంజ్యూరీ టైమ్‌లో చిన్నపాటి అశ్రద్ధ మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసింది. టోరెస్‌ నుంచి పాస్‌ అందుకొన్న సబ్‌స్టిట్యూట్‌ ఆటగాడు మెరీనో.. ప్రత్యర్థి డిఫెండర్లను తప్పిస్తూ నేరుగా కొట్టిన కిక్‌.. దొర్లుకొంటూ వెళ్లి గోల్‌పోస్ట్‌లో పడింది. దీంతో స్పెయిన్‌ 1-0 ఆధిక్యంలోకెళ్లింది. ఆ తర్వాత పోర్చుగల్‌ సమం చేసేందుకు శక్తివంచన లేకుండా పోరాడినా ఫలితం లేకపోయింది.

ఇవి కూడా చదవండి:

45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!

తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!

Updated Date - Jul 08 , 2026 | 02:31 AM