Share News

చరిత్రవైపు సింధు చూపు

ABN , Publish Date - Aug 17 , 2026 | 05:50 AM

బ్యాడ్మింటన్‌ పండుగకు వేళైంది. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిస్తోంది. సోమవారంనుంచి...

చరిత్రవైపు సింధు చూపు

ఉ. 9 నుంచి స్టార్‌ నెట్‌వర్క్‌లో

నేటి నుంచే ప్రపంచ చాంపియన్‌షి్‌ప

17 ఏళ్ల తర్వాత భారత్‌లో బ్యాడ్మింటన్‌ మెగా టోర్నీ

న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌ పండుగకు వేళైంది. 17 సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత భారత్‌ ప్రతిష్ఠాత్మక ప్రపంచ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పనకు ఆతిథ్యమిస్తోంది. సోమవారంనుంచి ఈనెల 23 వరకు ఇక్కడి ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో జరిగే ఈ మెగా టోర్నీలో టాప్‌ షట్లర్లు బరిలో దిగుతున్నారు. రెండుసార్లు ఒలింపిక్‌ పతక విజేత పీవీ సింధు, స్టార్‌ డబుల్స్‌ జోడీ సాత్విక్‌/చిరాగ్‌ భారత్‌ నుంచి ఫేవరెట్లుగా పోటీపడుతున్నారు. ఇప్పటికే ఐదు ప్రపంచ చాంపియన్‌షి్‌ప పతకాలు ఖాతాలో వేసుకున్న సింధు..ఆరో పతకంతో చరిత్ర సృష్టించడానికి సిద్ధమైంది. ఆమె ఇప్పటికే ఓ స్వర్ణం, రెండు రజత, రెండు కాంస్యాలు సాధించింది. ఈసారి కనుక సెమీఫైనల్‌ చేరితే కనీసం కాంస్యం ఖాయమవు తుంది. తద్వారా సింధు ఆరు పతకాలతో అరుదైన రికార్డు అందుకొంటుంది. తొమ్మిదో సీడ్‌ సింధుకి టోర్నీ డ్రా కూడా అనుకూలంగానే ఉండడం కలిసొచ్చే అంశం కానుంది. తొలి రౌండ్‌లో 141 ర్యాంకర్‌సోఫియా నోబుల్‌ (ఐర్లాండ్‌)ను సింధు ఢీకొననుంది. ప్రీక్వార్టర్స్‌లో మూడో సీడ్‌ వాంగ్‌ఝీ యీ (చైనా)ని ఓడిస్తే, క్వార్టర్స్‌లో పుత్రి కుసుమ వర్దని (ఇండోనేసియా)ని ఎదుర్కొనే చాన్సుంది. అన్ని రౌండ్లను దాటితే సింధుకు ఫైనల్లో ఒలింపిక్‌ చాంపియన్‌ అన్‌ సె యంగ్‌ (కొరియా) ఎదురుపడొచ్చు. మహిళల డిఫెండింగ్‌ చాంప్‌ యమగూచి (జపాన్‌), నాలుగో సీడ్‌ చెన్‌ యుఫీ (చైనా) టైటిల్‌ వేటలో గట్టిపోటీదార్లుగా ఉన్నారు. మరో భారత అమ్మాయి ఉన్నతి హుడా తన పోరును తెట్‌ తార్‌ తుజార్‌ (మయాన్మార్‌)తో ఆరంభించనుంది.


మరో పతకం.. సాత్విక్‌ జోడీ లక్ష్యం

భారత పురుషుల డబుల్స్‌ స్టార్‌ జోడీ, ఐదో సీడ్‌ సాత్విక్‌ సాయిరాజ్‌/చిరాగ్‌ శెట్టి మరోసారి పోడియంపై నిలవడమే ధ్యేయంగా నిర్దేశించుకుంది. ఈ టోర్నీలో ఆ జంట ఇప్పటికే రెండు కాంస్య పతకాలు కైవసం చేసుకుంది. ఈసారి తొలి రౌండ్‌లో సాత్విక్‌ ద్వయానికి బై లభించింది. క్వార్టర్స్‌లో లియాంగ్‌ వీకెంగ్‌/వాంగ్‌ చాంగ్‌ (చైనా) జంటతో సాత్విక్‌ జంట తలపడే చాన్సుంది. పురుషుల డబుల్స్‌ బరిలో ఉన్న మరో భారత జంట అర్జున్‌/హరిహరన్‌ టోర్నీలో తమదైన ముద్ర వేయాలని భావిస్తోంది. పురుషుల సింగిల్స్‌లో భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టికి మొదటి రౌండ్‌లోనే డిఫెండింగ్‌ చాంపియన్‌, వరల్డ్‌ నెం.1 షి యు కి(చైనా) రూపంలో కఠిన సవాల్‌ ఎదురవ నుంది. రెండో పతక వేటలోనున్న మాజీ కాంస్య పతక విజేత, 14వ సీడ్‌ లక్ష్యసేన్‌ తొలిరౌండ్లో కోలిన్స్‌ వాలెన్‌టైన్‌తో ఆడనున్నాడు. మహిళల డబుల్స్‌లో భారత స్టార్‌ ద్వయం గాయత్రీ గోపీచంద్‌/ట్రీసా తొలి పతకంపై గురిపెట్టగా, మరో జోడీ సిమ్రాన్‌/కవిప్రియ జంట మెరుగైన ప్రదర్శనే లక్ష్యంగా పోటీలో ఉంది. మిక్స్‌డ్‌ డబుల్స్‌లో భారత జోడీ ధ్రువ్‌ కపిల/తనీషాకు తొలి రౌండ్‌లో బై లభించింది. వీళ్లతో పాటు మిక్స్‌డ్‌లో రుత్వికా శివానీ/రోహన్‌ కపూర్‌ జంట కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది.

ఇవి కూడా చదవండి:

ఆస్ట్రేలియాపై గెలుపు .. స్పందించిన బంగ్లా కెప్టెన్ నజ్ముల్

సిన్సినాటి ఓపెన్‌లో జకోవిచ్‌కు షాక్‌

Updated Date - Aug 17 , 2026 | 05:50 AM