కొండంత స్కోరు కరిగించేశారు
ABN , Publish Date - Apr 26 , 2026 | 03:50 AM
నాటకీయ మలుపులు తిరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో.. పంజాబ్ కింగ్స్ టీ20 ఫార్మాట్‌లోనే రికార్డు స్థాయిలో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది.
265 లక్ష్యం.. 18.5 ఓవర్లలో ఖతం
అదరగొట్టిన శ్రేయాస్, ప్రభ్‌సిమ్రన్
రాహుల్ శతకం వృథా
చూస్తోంది ఐపీఎలా, గల్లీ క్రికెటా అని విస్తుపోయేలా.. హైలైట్లు చూస్తున్నామా అని ఆశ్చర్యపోయేలా.. సిక్సర్లు, ఫోర్ల వేటలో బ్యాటర్లు పరుగుల వరద సృష్టించారు. తొలుత ఢిల్లీ శతక వీరుడు కేఎల్ రాహుల్, నితీశ్ రాణా ఆకాశమే హద్దుగా చెలరేగి 264/2 స్కోరుతో కొండంత లక్ష్యాన్ని ప్రత్యర్థి ముందుంచగా.. తామేమీ తక్కువ తినలేదంటూ పంజాబ్ బ్యాటర్లు ప్రభ్‌సిమ్రన్, శ్రేయాస్, ప్రియాన్ష్, నేహల్ పరుగుల సునామీతో విరుచుకుపడి 18.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఉఫ్‌మంటూ ఊదేశారు. అంతే.. రెండేళ్ల క్రితం ఐపీఎల్‌లో తమపేరిటే ఉన్న అత్యధిక ఛేదన రికార్డును సవరించిన పంజాబ్.. ఈ లీగ్‌లోనే గాకుండా ఓవరాల్‌గా టీ20 ఫార్మాట్‌లోనే ఛేజింగ్‌లో సరికొత్త రికార్డును తన పేరిట లిఖించుకొని సరికొత్త చరిత్ర సృష్టించింది.
న్యూఢిల్లీ: నాటకీయ మలుపులు తిరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో.. పంజాబ్ కింగ్స్ టీ20 ఫార్మాట్‌లోనే రికార్డు స్థాయిలో 265 పరుగుల భారీ లక్ష్యాన్ని చేధించింది. ప్రభ్‌సిమ్రన్ సింగ్ (26 బంతుల్లో 9 ఫోర్లు, 5 సిక్స్‌లతో 76), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (36 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లతో 71 నాటౌట్) విరుచుకుపడడంతో.. ఐపీఎల్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 6 వికెట్లతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఝలకిచ్చింది. కీలక సమయంలో శ్రేయాస్‌కు కరుణ్ నాయర్ రెండుసార్లు లైఫ్‌లు ఇవ్వడం ఒకరకంగా మ్యాచ్‌ను ఢిల్లీకి దూరం చేసింది. దీంతో ఈ సీజన్‌లో ఓటమి లేకుండా సాగుతున్న పంజాబ్.. ఆరో విజయంతో పట్టికలో తన అగ్రస్థానాన్ని మరింత పటిష్టం చేసుకొంది. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ కేఎల్ రాహుల్ (67 బంతుల్లో 16 ఫోర్లు, 9 సిక్స్‌లతో 152 నాటౌట్) అజేయ శతకానికి తోడు టాపార్డర్ బ్యాటర్ నితీశ్ రాణా (44 బంతుల్లో 11 ఫోర్లు, 4 సిక్స్‌లతో 91) అదరగొట్టడంతో.. తొలుత ఢిల్లీ 20 ఓవర్లలో 264/2తో భారీ స్కోరు చేసింది. కుల్దీప్ 2 వికెట్లు పడగొట్టాడు.భారీ ఛేదనలో పంజాబ్ 18.5 ఓవర్లలో 265/4 స్కోరు చేసి గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొన్న ఢిల్లీకి మూడో ఓవర్లోనే ఓపెనర్ నిస్సాంక (11)ను అర్ష్‌దీప్ అవుట్‌చేసి షాకిచ్చాడు. కానీ, మరో ఓపెనర్ రాహుల్, నితీశ్ రెండో వికెట్‌కు 220 పరుగుల భాగస్వామ్యం జతచేసి జట్టు భారీస్కోరుకు దోహదం చేశారు. సెంచరీకి చేరువలో నితీశ్‌ను బ్రాట్‌లెట్ క్యాచవుట్ చేశాడు.

ప్రభ్, ఆర్య ఊచకోత: కొండంత లక్ష్యం కోసం బరిలోకి దిగిన పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (17 బంతుల్లో 2 ఫోర్లు, 5 సిక్స్‌లతో 43), ప్రభ్‌సిమ్రన్ అదిరే ఆరంభాన్నిచ్చారు. వీరి ధాటికి పంజాబ్ 6.5 ఓవర్లలోనే 126 రన్స్‌తో గెలుపు దిశగా దూసుకెళ్లింది. ఏడో ఓవర్లో ప్రియాన్ష్‌ను అక్షర్ క్యాచవుట్ చేసి జట్టుకు బ్రేక్ ఇచ్చాడు. అయితే, మధ్య ఓవర్లలో ఢిల్లీ స్పిన్నర్లు కుల్దీప్, అక్షర్ కట్టుదిట్టంగా బంతులేస్తూ పంజాబ్ జోరుకు బ్రేకులేశారు. ఈ క్రమంలో ప్రభ్‌సిమ్రన్, కూపర్ (17)ను కుల్దీప్ అవుట్ చేయడంతో.. ఢిల్లీ మ్యాచ్‌లోకి వచ్చినట్టనిపించింది. ఈ దశలో శ్రేయాస్, నేహల్ వధేరా (15 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్స్ తో 25) నాలుగో వికెట్‌కు 56 రన్స్‌తో పోరాటాన్ని కొనసాగించారు. అయితే, సాధించాల్సిన రన్‌రేట్ పెరుగుతుండడంతో పంజాబ్ ఒత్తిడికి లోనైంది.
నాయర్ చేజేతులా..: 15వ ఓవర్‌లో విప్రజ్ బౌలింగ్‌లో కరుణ్ నాయర్ అందుకున్న అద్భుత క్యాచ్‌తో వధేరా.. వెనుదిరిగాడు. కానీ, 16వ ఓవర్‌లో అదే నాయర్ వరుసగా రెండుసార్లు శ్రేయాస్ ఇచ్చిన క్యాచ్‌ను చేజార్చడంతో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకొన్న శ్రేయాస్ ఎడాపెడా సిక్స్‌లతో విరుచుకుపడడంతో.. పంజాబ్ 7 బంతులు మిగిలుండగానే విజయాన్ని అందుకొంది.