Share News

జొకోకు ఝలక్‌

ABN , Publish Date - Sep 01 , 2026 | 05:13 AM

యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. నాలుగో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (39)కు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో జొకో...

జొకోకు ఝలక్‌

తొలి రౌండ్‌లోనే ఇంటిముఖం

అర్జెంటీనా యువ ఆటగాడి చేతిలో ఓటమి జూయూఎస్‌ ఓపెన్‌

న్యూయార్క్‌: యూఎస్‌ ఓపెన్‌లో పెను సంచలనం నమోదైంది. నాలుగో సీడ్‌ నొవాక్‌ జొకోవిచ్‌ (39)కు తొలి రౌండ్‌లోనే షాక్‌ తగిలింది. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ మొదటి రౌండ్‌లో జొకో 6-7(5), 7-5, 6-4, 2-6, 1-6తో మరీనో నవోన్‌ (అర్జెంటీనా) చేతిలో ఐదుసెట్లపాటు పోరాడి ఓడాడు. 4 గంటల 36 నిమిషాలపాటు సాగిన మారథాన్‌ మ్యాచ్‌లో జొకో కండరాల నొప్పులతో తీవ్రంగా ఇబ్బందులు పడ్డాడు. అంతేకాకుండా మ్యాచ్‌ ముగిసిన తర్వాత కన్నీటి పర్యంతమయ్యాడు. యూఎస్‌ ఓపెన్‌లో నొవాక్‌ తొలిరౌండ్‌లోనే వెనుదిరగడం అతడి కెరీర్‌లో ఇదే మొదటిసారి. మరోవైపు 25 ఏళ్ల నవోన్‌ కెరీర్‌లో ఈ ఏడాదే తొలి ఏటీపీ టైటిల్‌ నెగ్గాడు. ఇతర మ్యాచ్‌ల్లో 15వ సీడ్‌ అలెగ్జాండర్‌ బబ్లిక్‌ (కజకిస్థాన్‌) 6-4 6-2, 3-6, 6-1తో జె ఉల్ఫ్‌ (అమెరికా)పై, జైమ్‌ ఫరియా 6-3, 7-6(4), 4-6, 1-6, 6-2తో జాన్సన్‌ బ్రూక్స్‌బైపై గెలిచారు. మహిళల సింగిల్స్‌లో 9వ సీడ్‌ ఎలెనా స్విటోలినా 6-1, 6-2తో సోలాన్‌ సియర్రా (అర్జెంటీనా)ను, కరోలినా ప్లిస్కోవా (చెక్‌) 2-6, 7-5, 6-3తో హన్నే వాండవింకిల్‌ను, 18వ సీడ్‌ ఎకటరీనా అలెగ్జాండ్రొవా 6-2, 6-2తో మెకార్తీ కెస్లర్‌ను ఓడించారు. కాగా, వీనస్‌ విలియమ్స్‌ 2-6, 6-7(6) సోఫియా కెనిన్‌ చేతిలో పరాజయం పాలైంది.

ఇవి కూడా చదవండి

ఎడ్యుకేషన్ హబ్‌గా హుస్నాబాద్: మంత్రి పొన్నం ప్రభాకర్

రామ మందిరానికి రూ.4 కోట్ల విరాళం.. అకౌంట్లో మాత్రం రూ.3!

Updated Date - Sep 01 , 2026 | 05:13 AM