Share News

IND VS NZ 3rd ODI: టీమిండియాపై డారిల్ మిచెల్ సెంచరీల మోత..

ABN , Publish Date - Jan 18 , 2026 | 05:30 PM

టీమిండియాపై ఒకప్పుడు.. సనత్ జయసూర్య, రికీ పాటింగ్, సంగ్కకర, డివిలియర్స్ వంటి ప్లేయర్లు ఆధిపత్యం చెలాయించే వారు. ప్రస్తుత తరంలో స్టీవ్ స్మిత్, కేన్ విలియమ్సన్, క్వింటన్ డికాక్... ఇలా ఆయా దేశాల తరఫున కొందరు ఆటగాళ్లు భారత జట్టుపై రెచ్చిపోయి ఆడుతుంటారు. తాజాగా అదే బాటలో నడుస్తున్నాడు న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్.

IND VS NZ 3rd ODI: టీమిండియాపై డారిల్ మిచెల్ సెంచరీల మోత..
Daryl Mitchell

స్పోర్ట్స్ డెస్క్: కొందరు క్రికెటర్లు వివిధ దేశాలపై ప్రత్యేకంగా ఆధిపత్యం చెలాయిస్తుంటారు. ఆయా దేశాలతో మ్యాచ్‌లు జరిగినప్పుడు చెలరేగి ఆడుతుంటారు. అలానే భారత్ జట్టుపై కూడా కొందరు చెలరేగి ఆడుతుంటారు. సనత్ జయసూర్య, రికీ పాటింగ్, సంగ్కకర, ఏబీ డివిలియర్స్ వంటి ప్లేయర్లు ఒకప్పుడు టీమిండియాపై ఆధిపత్యం చెలాయించే వారు. తాజాగా వారి బాటలో న్యూజిలాండ్ స్టార్ ప్లేయర్ డారిల్ మిచెల్ అడుగులు వేస్తున్నాడు.


ఐసీసీ టోర్నీలు, సాధారణ సిరీస్‌లు అనే తేడా లేకుండా ఈ మిడిలార్డర్ బ్యాటర్ ప్రస్తుతం.. టీమిండియాపై తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. దాదాపు ప్రతీ మ్యాచ్‌లోనూ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇక.. అతడి ప్రత్యర్థి భారత్ అయితే చాలు.. పూనకం వచ్చినట్లుగా చెలరేగిపోతున్నాడు. భారత్‌తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌లో మిచెల్ పరుగుల వరద పారిస్తున్నాడు. తొలి వ‌న్డేలో 84 ప‌రుగుల‌తో కీల‌క ఇన్నింగ్స్ ఆడిన మిచెల్‌.. ఆ త‌ర్వాత రాజ్‌కోట్‌లో అద్భుత సెంచరీ చేశాడు. మ‌ళ్లీ ఇప్పుడు ఇండోర్(India Vs New Zealand) వేదికగా జరుగుతున్న సిరీస్ డిసైడ‌ర్ మూడో వ‌న్డేలోనూ శ‌త‌క్కొట్టాడు(137, 131 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్స్‌లు). మిచెల్ భార‌త్‌లో తాను ఆడిన చివ‌రి ఐదు ఇన్నింగ్స్‌ల్లో ఏకంగా నాలుగు సెంచరీలు బాదాడు. టీమిండియాపై వ‌న్డేల్లో అత‌డి స‌గ‌టు సుమారు 70 వరకు ఉంది.


ఈ మ్యాచ్‌లో మరో బ్యాటర్ గ్లెన్ ఫిలిప్స్ కూడా చక్కటి సెంచరీ (88 బంతుల్లో 106) సాధించాడు. వీరిద్దరూ 219 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇండోర్ మ్యాచ్ లో శతకం బాదడంతో భారత్‌పై వన్డేల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా మిచెల్‌ నిలిచాడు. మిచెల్‌ ఇప్పటివరకు 4 సెంచరీలు సాధించాడు. ఈ సెంచరీలు మొత్తం భారత్‌ గడ్డపైనే రావడం గమనార్హం. ఈ అరుదైన ఫీట్‌ సాధించిన జాబితాలో నాథన్ ఆస్టిల్(5) అగ్రస్ధానంలో ఉన్నాడు. మరో సెంచరీ చేస్తే ఆస్టిల్‌ను మిచెల్‌ అధిగమిస్తాడు.

Updated Date - Jan 18 , 2026 | 05:56 PM