ఒకే ఒక్కడు.. 18 గోల్స్‌తో మెస్సీ ప్రపంచ రికార్డ్..
ABN , Publish Date - Jun 23 , 2026 | 05:35 AM
ఈ మ్యాచ్‌కు ముందు అందరి నోటా ఒక్కటే మాట.. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రపంచ రికార్డు గోల్ సాధిస్తాడా? కానీ, ఆస్ట్రియాతో ఆట మొదలైన పదో నిమిషంలోనే స్పాట్ కిక్ రూపంలో ఆ చాన్స్ వచ్చింది....
రికార్డు బద్దలు కొట్టిన లియోనెల్
ఆస్ట్రియాపై రెండు గోల్స్‌తో విజృంభణ
నాకౌట్‌కు అర్జెంటీనా
ఈ మ్యాచ్‌కు ముందు అందరి నోటా ఒక్కటే మాట.. అర్జెంటీనా దిగ్గజం లియోనెల్ మెస్సీ ప్రపంచ రికార్డు గోల్ సాధిస్తాడా? కానీ, ఆస్ట్రియాతో ఆట మొదలైన పదో నిమిషంలోనే స్పాట్ కిక్ రూపంలో ఆ చాన్స్ వచ్చింది. అయితే, మెస్సీ బయటకు కొట్టడంతో.. ఒక్కసారిగా నిరాశ. కానీ, లియోనెల్ మరోసారి ప్రత్యర్థి రక్షణ పంక్తిని ఛేదిస్తూ.. తన ట్రేడ్ మార్క్ షాట్‌తో గోల్ చేశాడు. ఒక్క సారిగా స్టేడియం మొత్తాన్ని ఆనందడోలికల్లో ఓలలాడించాడు. అనంతరం మరో గోల్ సాధించిన మెస్సీ.. మెగా టోర్నీలో అత్యధికంగా 18 గోల్స్‌తో ఆల్‌టైమ్ గ్రేట్‌గా సరికొత్త చరిత్ర సృష్టించాడు.
డాలస్: దిగ్గజం లియోనెల్ మెస్సీ రికార్డు గోల్‌తో అదరగొట్టడంతో.. డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనా నాకౌట్‌కు దూసుకెళ్లింది. సోమవారం గ్రూప్-జెలో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 2-0తో ఆస్ట్రియాపై గెలిచింది. మెస్సీ (38వ, 90+5వ) డబుల్ ధమాకా సృష్టించాడు. రెండు వరుస విజయాలతో మొత్తం ఆరు పాయింట్లు సాధించిన అర్జెంటీనా రౌండ్-32 బెర్త్‌ను సొంతం చేసుకొంది. ఫస్టాఫ్ ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన అర్జెంటీనా.. ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ క్రమంలో లాటరో మార్టినెజ్‌ను పెనాల్టీ ఏరియాలో అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో అర్జెంటీనాకు రెఫరీ స్పాట్ కిక్ ఇచ్చాడు.
అయితే, 10వ నిమిషంలో కిక్ తీసుకొన్న మెస్సీ.. బయటకు కొట్టాడు. ఇక్కడి నుంచి దూకుడు పెంచిన ఆస్ట్రియా.. ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడులు చేస్తూ ఒత్తిడి పెంచినా ఫలితం సాధించలేక పోయింది. అయితే, 33వ నిమిషంలో ఆస్ట్రియా గోల్ పోస్టు వద్ద మెస్సీ కిక్‌ను డిఫెండర్ అలబా అడ్డుకోవడంతో గోల్ చేసే అవకాశం చేజారింది. కానీ, 38వ నిమిషంలో ఆస్ట్రియా డిఫెన్స్‌ను ఛేదించిన మెస్సీ.. ఎడమవైపు మూలగా బంతిని గోల్‌లోకి పంపి.. అర్జెంటీనాను 1-0 ఆధిక్యంలో నిలిపాడు. ఈ క్రమంలో మెగా టోర్నీలో అత్యధిక గోల్స్ చేసిన ఏకైక ఆటగాడిగా రికార్డులను తిరగరాశాడు. ఆ తర్వాత ఆస్ట్రియా ఎదురుదాడి చేసినా.. ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించలేక పోయింది. ఇక, సెకండా్‌ఫలో ఇరు జట్లూ అవకాశాలను సృష్టించుకొన్నా.. వాటిని గోల్‌గా మలచలేక పోయాయి. అయితే, స్టాపేజ్ టైమ్‌లో మెస్సీ మరో గోల్‌తో అర్జెంటీనా ఆధిక్యాన్ని మరింతగా పెంచాడు.
ఈజిప్ట్ కొత్త చరిత్ర
వాంకోవర్: ఈజిప్ట్ చరిత్ర సృష్టించింది. వరల్డ్‌క్‌పలో తొలిసారి విజయాన్ని నమోదు చేసింది. స్టార్ ప్లేయర్ మో సలా గోల్ చేయడంతో గ్రూప్-జి మ్యాచ్‌లో ఈజిప్ట్ 3-1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. ఈజిప్ట్ తరఫున మొస్తాఫా జికో (58వ నిమిషం), మో సలా (67వ), ట్రెజీ గ్యుయెట్ (82వ) గోల్స్ చేశారు. 15వ నిమిషంలో కివీస్ ఆటగాడు ఫిన్ సుర్మాన్ అద్భుతమైన హెడర్‌తో ఏకైక గోల్ సాధించాడు. మెగా ఈవెంట్‌లో తొలి విజయం కావడంతో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈజిప్ట్ ఆటగాళ్లు మైదానంలో కలియదిరుగుతూ సంబరాలు చేసుకొన్నారు.

కేప్ వెర్డె సంచలనం
మయామి గార్డెన్స్ (ఫ్లోరిడా): పసికూన కేప్ వెర్డె సంచలనాల మీద సంచలనాలు సృష్టిస్తోంది. గ్రూప్-హెచ్‌లో తొలి మ్యాచ్‌లో స్పెయిన్‌ను నిలువరించిన వెర్డె.. ఉరుగ్వేతో జరిగిన రెండో మ్యాచ్‌లో వెనుకబడినా బలంగా పుంజుకొని 2-2తో డ్రా చేసుకొంది. 21వ నిమిషంలో కెవిన్ పినా ఫ్రీకిక్‌ను గోల్‌గా మలచడంతో.. వరల్డ్‌కప్ చరిత్రలో కేప్ వెర్డెకు తొలి గోల్ నమోదుచేసుకుంది. ఆ తర్వాత ఉక్రెయిన్ ప్లేయర్లు మ్యాక్సీ అరజో (44వ నిమిషం), అగస్టిన్ కన్నోబిబో (45వ) చెరో గోల్‌తో ఉరుగ్వేను 2-1తో ఆధిక్యంలో నిలిపారు. కానీ, 61వ నిమిషంలో హీలియో వరేలా గోల్‌తో కేప్ వెర్డె సమం చేసింది. కాగా, స్పెయిన్‌తో మ్యాచ్ అద్భుత కీపింగ్‌తో అందరి దృష్టినీ ఆకర్షించిన వెర్డె కీపర్ వజిన్హా ఆటను అతడి తల్లి ప్రత్యక్షంగా వీక్షించింది. వజిన్హా కోరిక మేరకు ఆమెకు హుటాహుటిన అమెరికా వీసా ఏర్పాటు చేశారు.
గోడకట్టిన అలీరెజా..
ఇంగ్లివుడ్ (కాలిఫోర్నియా): ఇరాన్ కీపర్ అలీరెజా బీరెన్‌వాండ్ గోల్ పోస్టుకు అడ్డుగోడలా నిలవడంతోపాటు ఏడు గోల్స్ ప్రయత్నాలను వమ్ముచేశాడు. దీంతో గ్రూప్-జీలో బెల్జియం-ఇరాన్ మ్యాచ్ 0-0తో గోల్ లెస్‌గా ముగిసింది. టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటైన రెడ్ లయన్స్ బంతిపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించినా.. అలీరెజాను మాత్రం ఏమార్చలేక పోయింది. ఎన్నిసార్లు పెనాల్టీ ఏరియాలోకి చొచ్చకెళ్లినా ఇరాన్ కీపర్ వారి ప్రయత్నాలను వమ్ముచేయడంతో.. బెల్జియం తీవ్ర అసహనానికి గురైంది. మరోవైపు ఇరాన్ చేసిన రెండు, మూడు ప్రయత్నాలను కూడా బెల్జియం కీపర్ సేవ్ చేశాడు.
టాప్ గోల్ స్కోరర్లు
లియోనెల్ మెస్సీ - 18
మిరోస్లావ్ క్లోజ్ - 16
రొనాల్డో నజారియో -15
కిలియన్ ఎంబప్పే -14
గెర్డ్ ముల్లర్ - 14
ఫిఫా కప్ మ్యాచ్‌లు..
నార్వే X సెనెగల్ - (ఉదయం 5.30 గం.)
జోర్డాన్ X అల్జీరియా - (ఉ. 8.30 గం.)
పోర్చుగల్ X ఉజ్బెకిస్థాన్ - (రాత్రి 10.30 గం.)
ఇంగ్లండ్ X ఘనా - (అర్ధరాత్రి 1.30 గం.)
క్రొయేషియా X పనామా - (బుధవారం తెల్లవారుజాము 4.30 గం.)
ఈ వార్తలనూ చదవండి:
లఖ్‌నవూ అగ్నిప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి..
లఖ్‌నవూలోని కోచింగ్ సెంటర్‌లో భారీ అగ్నిప్రమాదం..