Share News

మ్యాచ్ జరుగుతుండగా పడిన పిడుగు.. ప్లేయర్ మృతి

ABN , Publish Date - Aug 06 , 2026 | 12:57 PM

ద‌క్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గోలోక్ ఎఫ్ఏ క‌ప్-2026 సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా మైదానంలో పిడుగు ప‌డింది.

మ్యాచ్ జరుగుతుండగా పడిన పిడుగు.. ప్లేయర్ మృతి

స్పోర్ట్స్ డెస్క్: ద‌క్షిణ థాయ్‌లాండ్‌లో ఫుట్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. గోలోక్ ఎఫ్ఏ క‌ప్-2026 సెమీఫైన‌ల్ మ్యాచ్ జ‌రుగుతుండ‌గా, హ‌ఠాత్తుగా మైదానంలో పిడుగు ప‌డింది. ఈ విషాద‌క‌ర ఘ‌ట‌న‌లో సోఫ్వాన్(24) అనే ఫుట్‌బాల్ ప్లేయర్ మృతి చెంద‌గా, మ‌రో 12 మంది ఆట‌గాళ్లు తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. పిడుగుప‌డిన దృశ్యాలు కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


పిడుగుపాటుకు మైదానంలోనే కుప్పకూలిన సోఫ్వాన్‌కు వైద్య బృందం సీపీఆర్ చేసేందుకు ప్రయ‌త్నించారు. కానీ అప్పటికే అత‌డు మ‌ర‌ణించిన‌ట్లు తేలింది. ఇక పిడుగు పాటుకు గాయ‌ప‌డ్డవారిని ఆస్పత్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ద‌క్షిణ థాయ్‌లాండ్ స‌రిహ‌ద్దులో జ‌రిగే ఫుట్‌బాల్ టోర్నమెంట్లలో ఇదే అతిపెద్ద టోర్నీ. ఇందులో థాయ్‌లాండ్ స‌హా మ‌లేషియా ఆట‌గాళ్లు కూడా త‌ల‌ప‌డుతుంటారు. అయితే మ్యాచ్‌కు ముందు భారీ వ‌ర్షం కురిసిందని స్థానికులు చెబుతున్నారు. వ‌ర్షం ఆగిపోవ‌డంతో మ్యాచ్ నిర్వహించామ‌ని, ఇలా హ‌ఠాత్తుగా పిడుగు గ్రౌండ్‌ లో ప‌డుతుంద‌ని ఊహించ‌లేక‌పోయామ‌ని, తమ సహాచరుడైన సోఫ్వాన్‌ను కోల్పోవ‌డం బాధాక‌ర‌మ‌ని గోలోక్ క్లబ్ నిర్వాహ‌కులు ఆవేద‌న వ్యక్తం చేశారు.

Updated Date - Aug 06 , 2026 | 01:11 PM