ఎంబాపెపై జాతి వివక్ష వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:16 AM
ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపెపై పరాగ్వే సెనేటర్ సెలెస్టి అమరిల్లా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తనపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఎంబాపె...
పరాగ్వే సెనేటర్ అమరిల్లా చవాకులు
న్యూయార్క్: ఫ్రాన్స్ స్టార్ కిలియన్ ఎంబాపెపై పరాగ్వే సెనేటర్ సెలెస్టి అమరిల్లా చేసిన జాత్యహంకార వ్యాఖ్యలు పెను దుమారం రేపుతున్నాయి. తనపై ఆమె చేసిన వ్యాఖ్యలను ఎంబాపె మంగళవారం ఖండించాడు. గత ఆదివారం ఫ్రాన్స్ 1-0తో పరాగ్వేను ఓడించడంతో ఆ జట్టు ఇంటిబాట పట్టిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌లో పెనాల్టీ కిక్‌ను ఎంబాపె గోల్‌గా చేసి ఫ్రాన్స్‌ను విజయ పథాన నిలిపాడు. తమ జట్టు నిష్క్రమణను జీర్ణించుకోలేని పరాగ్వే లిబరల్ రాడికల్ పార్టీ సెనేటర్ అమరిల్లా..ఎంబాపై నోరు పారేసుకున్నారు. ఎంబాపె కామెరూన్ మూలాలను, అతడి పెంపకాన్ని, విద్యను ఆమె ఎగతాళి చేశారు. ‘ఫ్రెంచ్ వ్యక్తిగా కనిపించేందుకు తహతహలాడుతున్న కామెరూన్ మూలాలున్న ఎంబాపె’ అని ఎక్స్‌లో జాతివివక్ష వ్యాఖ్యలు చేశారు. 61 ఏళ్ల అమరిల్లా వ్యాఖ్యలకు ఎంబాపె తీవ్రంగా స్పందించాడు. ‘పరాగ్వే కాంగ్రె్‌సలో సేవలు అందించడానికి ఆమె అనర్హురాలు’ అని కౌంటర్ ఇచ్చాడు. ‘మీ పనికి మాలిన వ్యాఖ్యల వల్ల ఈ టోర్నీలో మీ ఆటగాళ్లు సాగించిన అద్భుత ప్రయాణాన్ని, చారిత్రక కృషిని యావత్ ప్రపంచం మరిచిపోయింది’ అని ఎంబాపె ఘాటుగా బదులిచ్చాడు.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!