Share News

కూరగాయలు అమ్మి.. రిక్షా తొక్కి..

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:53 AM

బిహార్‌కు చెందిన 28 ఏళ్ల ఝండూ కుమార్‌ పేద కుటుంబంలో జన్మించాడు. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకడంతో రెండు కాళ్లు పడిపోయాయి. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులు కూరగాయలు...

కూరగాయలు అమ్మి.. రిక్షా తొక్కి..

బిహార్‌కు చెందిన 28 ఏళ్ల ఝండూ కుమార్‌ పేద కుటుంబంలో జన్మించాడు. ఐదేళ్ల వయసులోనే పోలియో సోకడంతో రెండు కాళ్లు పడిపోయాయి. కుటుంబ పోషణ కోసం తల్లిదండ్రులు కూరగాయలు అమ్మేవారు. కుమార్‌ కూడా పదేళ్ల వయసు నుంచే వారికి చేదోడువాదోడుగా ఉండేవాడు. కానీ క్రీడలను ఎప్పుడూ కెరీర్‌గా ఎంచుకోవాలనుకోలేదు. అయితే, ‘దబాంగ్‌’ సినిమాలో సల్మాన్‌ ఖాన్‌ను చూసి స్ఫూర్తిపొందిన కుమార్‌.. అతడిలా కండలు పెంచాలనుకొన్నాడు. నడుము కిందిభాగం పనిచేయక పోయినా.. పైభాగాన్ని మాత్రం సల్మాన్‌ తరహాలో బలంగా మార్చాలని నిర్ణయించుకొన్నాడు. దగ్గరలోని జిమ్‌కు మూడు చక్రాల సైకిల్‌పై వెళ్లి ప్రాక్టీస్‌ మొదలుపెట్టాడు. పోలియో కారణంగా చిన్నప్పటి నుంచి చేతులపైనే ఎక్కువగా ఆధారపడుతున్నా, తన శరీర బరువు కంటే రెట్టింపు బరువులు ఎత్తుతూ అందరినీ ఆశ్చర్యపర్చేవాడు. కూరగాయల దుకాణంలో కూర్చొని ఆ బాధ్యతలు చూసుకొంటూనే.. పారా లిఫ్టింగ్‌పై దృష్టి సారించాడు. ఇక, ఆరంభంలో సాధారణ క్రీడాకారులతో కలిసి పోటీపడిన ఝండూ.. 2019లో బెంచ్‌ప్రెస్‌లో అంతర్‌ జిల్లా క్రీడల్లో స్వర్ణం సాధించాడు. ఆ తర్వాత జంషెడ్‌పూర్‌లో జరిగిన జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. అక్కడ పతకాలు నెగ్గకపోయినా.. పారా స్పోర్ట్స్‌ సమాఖ్య దృష్టిని ఆకర్షించాడు. కానీ, ఆర్ధిక ఇబ్బందులు ఎక్కువవడంతో కూరగాయల దుకాణాన్ని ఖాళీ చేయాల్సి వచ్చింది. దీంతో అప్పు చేసి ఈ-రిక్షాను కొనుగోలు చేసి.. జీవితాన్ని కొనసాగించాడు. ఇక 2023 జాతీయ చాంపియన్‌షి్‌పకు సిద్ధమయ్యే క్రమంలో.. డైట్‌ కోసం తన ఈ-రిక్షాను కూడా అమ్మేశాడు. ఆ పోటీల్లో విఫలమైనా..ఝండు ప్రతిభను గుర్తించిన జాతీయ కోచ్‌లు గుజరాత్‌లోని సాయ్‌ సెంటర్‌లో చేర్పించారు. అక్కడ వెటరన్‌ కోచ్‌ రాజీందర్‌ రాహేలు శిక్షణలో రాటుదేలిన కుమార్‌ వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2025లో 205 కిలోల బరువునెత్తి జాతీయ రికార్డు నెలకొల్పిన కుమార్‌.. ఖేలో ఇండియా క్రీడల్లో 206 కిలోలు ఎత్తి తన రికార్డును తానే అధిగమించాడు. బీజింగ్‌లో జరిగిన వరల్డ్‌ పారా పవర్‌లిఫ్టింగ్‌లో కాంస్యంతో మెరిశాడు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 26 , 2026 | 03:54 AM