బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ మృతి.. బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ సంతాపం
ABN , Publish Date - Mar 31 , 2026 | 07:33 PM
బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ జాన్ విలియమ్ లాంగ్‌ఫోర్డ్ మృతిపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తాజాగా సంతాపాన్ని తెలియజేశాయి.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ కోసం భారత్‌కు వచ్చిన బ్రిటిష్ బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్ జాన్ విలియమ్ లాంగ్‌ఫోర్డ్ ఆకస్మిక మరణంపై బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మంగళవారం తమ సంతాపాన్ని తెలియజేశాయి. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబసభ్యులకు అండగా ఉంటామని తెలిపాయి. సోమవారం దక్షిణ ముంబైలోని తన హోటల్‌లో స్పృహ తప్పి కనిపించిన విలియమ్ లాంగ్‌ఫోర్డ్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆయన మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు. లాంగ్‌ఫోర్డ్ పోస్టుమార్టం నివేదికలో అనుమానాస్పద విషయాలు ఏవీ లేవని మెరైన్ డ్రైవ్ పోలీస్ స్టేషన్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఐపీఎల్ మ్యాచ్‌లకు బ్రాడ్‌కాస్ట్ ఇంజినీర్‌గా లాంగ్‌ఫోర్డ్ భారత్‌కు వచ్చారని ఐపీఎల్ అధికారి ఒకరు తెలిపారు.
ఈ ఘటనపై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ తాజాగా స్పందించింది. లాంగ్‌ఫోర్డ్ మృతిపై తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేసింది. తమ బ్రాడ్‌కాస్టింగ్ వ్యవహారాల్లో లాంగ్‌ఫోర్డ్ కీలకంగా వ్యవహరించారని పేర్కొంది. ఈ క్లిష్ట సమయంలో లాంగ్‌ఫోర్డ్ కుటుంబానికి అండగా ఉంటామని, అన్ని సహాయ సహకారాలు అందిస్తామని వెల్లడించింది. ఐపీఎల్ టోర్నీతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి ఆరోగ్యం, భద్రతకు తాము అమిత ప్రాధాన్యం ఇస్తామని పేర్కొంది.
ఈ వార్తలూ చదవండి:
వైభవ్ సూర్యవంశీని వెంటనే భారత జట్టులోకి తీసుకోవాలి: మైఖేల్ వాన్
దూబె ఔట్ అయినప్పుడు గన్ సెలబ్రేషన్స్.. జడ్డూ ఏమన్నాడంటే?