Share News

ఎండల్లో..హాయ్‌ హాయ్‌!

ABN , Publish Date - Mar 28 , 2026 | 04:14 AM

ప్రతీ ఏడాదిలాగే అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే 19వ సీజన్‌ మే 31 వరకు జరుగనుంది.

ఎండల్లో..హాయ్‌ హాయ్‌!

  • వేసవిలో క్రికెట్‌ వినోదం

  • ఆరంభ పోరులో బెంగళూరుతో సన్‌రైజర్స్‌ ఢీ

  • ఇటీవలి టీ20 వరల్డ్‌క్‌పలో భారత జట్టు విజయ ప్రస్థానం అభిమానుల మదిలో ఇంకా మెదలుతూనే ఉంది. అంతలోనే మరో ధనాధన్‌ పోరు ఉర్రూతలూగించేందుకు వచ్చేసింది. ఒకటా.. రెండా 18 ఏళ్లుగా ప్రపంచ క్రికెట్‌ ప్రేమికులను అలరిస్తూ.. ఆకాశమే హద్దుగా ఎదిగిన ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) తాజా సీజన్‌ నేడే మొదలవనుంది. ఇప్పటిదాకా కలిసికట్టుగా ఆడి విశ్వవిజేతలుగా నిలిచిన భారత క్రికెటర్లు ఇప్పుడు ప్రత్యర్థులుగా తలపడుతుంటే.. ఆడేది మనవాడైనా, విదేశీ ఆటగాడైనా తమకు మాత్రం అందరూ ఒక్కటేనంటూ ధనాధన్‌ ఆటను వీక్షించేందుకు అభిమాన గణం సిద్ధమైంది. మరింకేం.. ఈ మండు వేసవిలో రెండు నెలల పాటు సిక్సర్లు, ఫోర్ల జడివానను ఆస్వాదిస్తూ ఎండల్లో హాయ్‌ హాయ్‌ అంటూ తేలిపోండి.

బెంగళూరు: ప్రతీ ఏడాదిలాగే అభిమానులంతా ఆతృతగా ఎదురుచూస్తున్న ఐపీఎల్‌కు రంగం సిద్ధమైంది. శనివారం ఆరంభమయ్యే 19వ సీజన్‌ మే 31 వరకు జరుగనుంది. మొత్తంగా 10 జట్లు లీగ్‌లో తలపడనుండగా, 74 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఇందులో 4 ప్లేఆఫ్స్‌ ఉంటాయి. చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్‌ చాంపియన్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ తలపడనున్నాయి. ఈసారి కూడా ఆయా జట్లు పలువురు కొత్త ఆటగాళ్లతో బరిలోకి దిగబోతున్నాయి. గతేడాది జరిగిన మినీ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఏకంగా రూ.25.20 కోట్ల ధరతో కామెరూన్‌ గ్రీన్‌ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా అత్యంత ఖరీదైన భారత ఆటగాళ్లలో అన్‌క్యా్‌పడ్‌ ప్రశాంత్‌ వీర్‌, కార్తీక్‌ శర్మలు నిలవడం హైలైట్‌గా నిలిచింది. ఈ ఇద్దరు యువ ఆటగాళ్లను చెన్నై సూపర్‌ కింగ్స్‌ రూ.14.20 కోట్లకు తీసుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీంతో ఐపీఎల్‌లో వీరిపై అందరి దృష్టి నెలకొననుంది. అంతేకాకుండా లీగ్‌ షెడ్యూల్‌ను విడతలవారీగా రెండుసార్లు విడుదల చేయాల్సి వచ్చింది. వచ్చే నెలలో పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్నాయి. దీంతో గతంలోనే మొదటి దశ షెడ్యూల్‌లో 20 మ్యాచ్‌ల తేదీలను ప్రకటించారు. అనంతరం ఎన్నికల షెడ్యూల్‌ వెలువడ్డాక గత గురువారమే మిగతా 50 మ్యాచ్‌ల వివరాలను బోర్డు వెల్లడించింది. ఫైనల్‌ బెంగళూరులో జరుగుతుంది. అయితే క్వాలిఫయర్స్‌ 1, 2లతో పాటు ఎలిమినేటర్‌ల వేదికలను మాత్రం ఇంకా ప్రకటించలేదు.


ఆసక్తికర మార్పులు

ఈ సీజన్‌లో అభిమానులు తమకిష్టమైన జట్లలో కొత్త ఆటగాళ్లను చూడబోతున్నారు. ముఖ్యంగా తన ఐపీఎల్‌ కెరీర్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌కు మాత్రమే ఆడిన సంజూ శాంసన్‌ ఇక యెల్లో జెర్సీలో కనిపించనున్నాడు. చెన్నై జట్టు అతడిని ట్రేడింగ్‌ ద్వారా తీసుకోగా.. సీఎ్‌సకే విజయాల్లో భాగమైన ఆల్‌రౌండర్‌ రవీంద్ర జడేజా తన పాత జట్టు రాజస్థాన్‌కు తరలివెళ్లాడు. అలాగే చెన్నై పేసర్‌ పథిరన కోల్‌కతాకు, వెంకటేశ్‌ అయ్యర్‌ ఆర్‌సీబీకి మారారు. రియాన్‌ పరాగ్‌ పూర్తి స్థాయి కెప్టెన్‌గా రాజస్థాన్‌ను నడిపించనున్నాడు. అలాగే ఆరంభ మ్యాచ్‌లకు సన్‌రైజర్స్‌కు ఇషాన్‌ కిషన్‌ సారథిగా ఉండబోతున్నాడు. దీంతో తొలిసారిగా లీగ్‌లోని మొత్తం పది జట్లకు భారత ఆటగాళ్లనే కెప్టెన్‌గా చూడబోతుండడం విశేషం.

ప్రారంభ వేడుకలు రద్దు

ఐపీఎల్‌లో ఎంతో అట్టహాసంగా జరిగే ఆరంభ వేడుకలను ఈసారి నిర్వహించడం లేదు. గతేడాది ఆర్‌సీబీ విజేతగా నిలిచాక చిన్నస్వామి స్టేడియం బయట తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో 11 మంది మృతి చెందారు. శనివారం అదే స్టేడియంలో లీగ్‌ ప్రారంభ మ్యాచ్‌ జరుగబోతోంది. అందుకే మృతులకు నివాళిగా మ్యాచ్‌కు ముందు జరిగే ఆరంభ వేడుకలను రద్దు చేస్తున్నట్టుగా నిర్వాహకులు ప్రకటించారు. అలాగే చిన్నస్వామి స్టేడియంలో మున్ముందు జరిగే మ్యాచ్‌ల్లో 11 సీట్లను ఖాళీగా ఉంచనున్నారు.


4.jpg

ఆ ముగ్గురు ఆకర్షణగా..

ధోనీ.. రోహిత్‌.. కోహ్లీ. ఐపీఎల్‌ ఆరంభం నుంచి ఈ త్రయం అభిమానులను ఆకర్షిస్తూనే ఉంది. ఈసారి కూడా అందరి చూపు వీరిపైనే ఉండననుంది. అయితే కొన్నేళ్లుగా లీగ్‌ ఆరంభమైనప్పుడల్లా చెన్నై మూలస్తంభం ధోనీకిదే ఆఖరు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కానీ అతను బరిలోకి దిగుతూ ఫ్యాన్స్‌ను మురిపిస్తూనే ఉన్నాడు. అయితే, 44 ఏళ్ల ధోనీకి నిజంగానే ఇది చివరి సీజన్‌గా విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ తర్వాత అతను మెంటార్‌గా కొనసాగే చాన్సుంది. ఇక.. 2024 వరల్డ్‌కప్‌ విజయం తర్వాత టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్‌, విరాట్‌లను ఈ ఫార్మాట్‌లో చూడడం ఐపీఎల్‌లోనే సాధ్యమవుతోంది. గతేడాది తన అద్భుత ఆటతీరుతో 657 రన్స్‌ సాధించిన కోహ్లీ.. బెంగళూరును తొలిసారి విజేతగా నిలిపాడు. ముంబై తరఫున రోహిత్‌ కూడా నిలకడను చూపుతూ 410 పరుగులతో ఫర్వాలేదనిపించాడు.

5.jpg

300 చూస్తామా..?

ఐపీఎల్‌లో ఓ జట్టు అత్యధిక స్కోరు 287. రెండేళ్ల క్రితం బెంగళూరు జట్టుపై సన్‌రైజర్స్‌ ఈ స్కోరు చేసింది. నిరుడు కూడా సన్‌రైజర్స్‌ భారీ స్కోరు (286) సాధించినా, తమ రికార్డు స్కోరుకు పరుగు దూరంలో ఆగిపోయింది. ఇప్పటిదాకా లీగ్‌లో 260కి పైగా స్కోర్లు పదిసార్లు నమోదైతే.. అందులో తొలి నాలుగు స్థానాల్లో సన్‌రైజర్స్‌ జట్టే ఉండడం విశేషం. మరి.. బ్యాటర్లకు పండగలాంటి టోర్నీ అయిన ఐపీఎల్‌లో ఈసారి ఏ జట్టు అయినా 300 కొడుతుందేమో చూడాలి.

Updated Date - Mar 28 , 2026 | 04:14 AM