Share News

ఇంగ్లండ్‌ను నిలువరించి.. రెండో రౌండ్‌ చేరి..

ABN , Publish Date - Aug 21 , 2026 | 05:25 AM

హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు చేరుకొంది. ముందంజ వేయడానికి మనోళ్లకు కనీసం డ్రా చాలు. ఈ నేపథ్యంలో గురువారం గ్రూప్‌-డిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో...

ఇంగ్లండ్‌ను నిలువరించి.. రెండో రౌండ్‌ చేరి..

భారత మహిళల ముందంజ

హాకీ వరల్డ్‌కప్‌

ఆమ్‌స్టెల్‌వీన్‌ (నెదర్లాండ్‌): హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు రెండో రౌండ్‌కు చేరుకొంది. ముందంజ వేయడానికి మనోళ్లకు కనీసం డ్రా చాలు. ఈ నేపథ్యంలో గురువారం గ్రూప్‌-డిలో జరిగిన ఆఖరి మ్యాచ్‌లో ఇంగ్లండ్‌తో భారత్‌ 0-0తో డ్రాగా ముగించింది. మొత్తం 5 పాయింట్లు సాధించిన భారత్‌ తమ గ్రూప్‌లో రెండో స్థానంలో నిలిచింది. తొలి మ్యాచ్‌లో చైనాపై 2-2తో సమం చేసిన భారత్‌.. రెండో మ్యాచ్‌లో 6-1తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. కాగా, రెండు మ్యాచ్‌లు గెలిచిన చైనా మొత్తం ఆరు పాయింట్లతో గ్రూప్‌ టాపర్‌గా తర్వాతి రౌండ్‌కు చేరుకొంది. చివరి లీగ్‌ మ్యాచ్‌లో చైనా 5-1తో సౌతాఫ్రికాను మట్టికరిపించింది. నాలుగు పాయింట్లు సాధించిన ఇంగ్లండ్‌ మూడో స్థానంలో నిలిచి టోర్నీ నుంచి వెనుదిరిగింది.

పీసీలు లభించినా..

సౌతాఫ్రికాపై చెలరేగిన భారత్‌.. ఇంగ్లండ్‌పై కూడా గోల్స్‌ వర్షం కురిపిస్తుందనుకుంటే అంతా తారుమారైంది. ఆరు పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో సలీమా టెటే సేన ఘోరంగా విఫలమైంది. మరోవైపు మ్యాచ్‌ సాగే కొద్దీ ఇంగ్లండ్‌ ఆధిపత్యం ప్రదర్శించడంతో.. మనోళ్లు ఎక్కువగా డిఫెన్స్‌కే పరిమితమయ్యారు. ఇంగ్లిష్‌ టీమ్‌ డజను పెనాల్టీ కార్నర్‌లు సాధించినా.. భారత రక్షణ పంక్తి సమర్థంగా అడ్డుకోవడమే ఈ మ్యాచ్‌లో చెప్పుకోవాల్సిన విషయం. చివరి నిమిషంలో పీసీని ఇంగ్లండ్‌ గోల్‌ చేసినంత పని చేసినా.. కీపర్‌ బిచ్చుదేవి అడ్డుకోవడంతో.. త్రుటిలో పరాభవం తప్పింది. తొలి క్వార్టర్‌లో భారత జట్టు ఆధిపత్యం ప్రదర్శించింది. నాలుగో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను నవ్‌నీత్‌ కౌర్‌ గోల్‌లోకి పంపినా.. బంతి మరో భారత ప్లేయర్‌ ఇషికకు తగలడంతో అంపైర్‌ గోల్‌ ఇవ్వలేదు. అనంతరం మరో రెండు పీసీలు సాధించిన భారత్‌ వాటిని గోల్స్‌గా మలచడంలో తడబడింది. రెండో క్వార్టర్‌లో ఇంగ్లండ్‌ అటాకింగ్‌ ప్లేతో ప్రత్యర్థికి ఝలక్‌ ఇచ్చినా.. గోల్‌ సాధించలేకపోయింది. మూడో క్వార్టర్‌లో కూడా ఇరుజట్లూ నువ్వా నేనా? అన్నట్టుగా తలపడినా నిష్ఫలమే అయ్యింది. ఇక, ఆఖరి క్వార్టర్‌లో ఇంగ్లండ్‌ ఉధృతంగా దాడులు చేసింది. అయితే భారత డిఫెండర్లు వారి ప్రయత్నాల్ని చాకచక్యంగా అడ్డుకున్నారు.

ఇవి కూడా చదవండి:

పుట్టిన తేదీ మార్పుపై ఆరోపణలు.. చిక్కుల్లో పడిన బీసీసీఐ చీఫ్ మిథున్ మన్హాస్

బౌలింగ్‌లో జడేజా ప్రభావం తగ్గిపోయింది.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు

Updated Date - Aug 21 , 2026 | 05:25 AM