Share News

మనోళ్లు తేలిపోయారు

ABN , Publish Date - Oct 07 , 2026 | 03:01 AM

అంతర్జాతీయ జట్లతో పోల్చితే భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ ఎన్నో రెట్లు మెరుగుపడాలనే విషయం మరోసారి రుజువైంది. మంగళవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో...

మనోళ్లు తేలిపోయారు

1-6తో ఉరుగ్వే చేతిలో ఓటమి

కోల్‌కతా: అంతర్జాతీయ జట్లతో పోల్చితే భారత ఫుట్‌బాల్‌ టీమ్‌ ఎన్నో రెట్లు మెరుగుపడాలనే విషయం మరోసారి రుజువైంది. మంగళవారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో భారత్‌ 1-6తో ఉరుగ్వే చేతిలో చిత్తుగా ఓడింది. అనిరుధ్‌ థాపా (22వ నిమిషం) ఏకైక గోల్‌ చేశాడు. ఉరుగ్వే తరఫున మ్యాక్సీ అరౌజో (28వ, 59వ) రెండు గోల్స్‌ నమోదు చేయగా.. డార్విన్‌ నూనెజ్‌ (12వ), రోడ్రిగో జలాజార్‌ (53వ), జువాన్‌ మాన్యువల్‌ సనబ్రియా (71వ), రోడ్రిగో అగుర్రీ (86వ) తలో గోల్‌ సాధించారు. మ్యాచ్‌ ఆరంభంలో భారత్‌ ఫుల్‌జో్‌షతో ఆడినా.. సెకండాఫ్‌లో పూర్తిగా తేలిపోయింది. 12వ నిమిషంలో పెనాల్టీ కిక్‌ను నూజెజ్‌ గోల్‌గా మలచగా.. 22వ నిమిషంలో థాపా గోల్‌ చేసి సమం చేశాడు. ఆ తర్వాత అరౌజో గోల్‌తో ఉరుగ్వే 2-1తో పైచేయి సాధించింది. అయితే, ఆట మొదలైన అరగంట తర్వాత ఉరుములు, మెరుపుల కారణంగా కొంతసేపు మ్యాచ్‌ను నిలిపివేశారు. కానీ, తిరిగి ప్రారంభమైన తర్వాత ఉరుగ్వే స్ట్రయికర్ల జోరు ముందు భారత డిఫెన్స్‌ వెలవెలబోయింది. మొత్తంగా జరిగిన మూడు ఫిఫా ఫ్రెండ్లీ మ్యాచ్‌ల్లో భారత్‌ తొలుత పనామాతో 1-1తో డ్రా చేసుకొన్నా, రెండో మ్యాచ్‌లో బ్రెజిల్‌ చేతిలో 0-4తో ఓటమిపాలైంది.

Updated Date - Oct 07 , 2026 | 03:01 AM