Share News

అంచనాలను మించి..

ABN , Publish Date - Oct 24 , 2026 | 02:34 AM

పారా ఆసియాడ్‌లో భారత అథ్లెట్లు అసమాన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు..మొత్తం 114 (30-35-49) పతకాలతో రికార్డు సృష్టించారు.. మొదటి రోజు మొదలు చివరి వరకు పతకాల మోత మోగించారు..

అంచనాలను మించి..
India Asian Para Games medals

  • 114 పతకాలతో రికార్డు ప్రదర్శన

  • షూటర్‌ మోనా వరల్డ్‌ రికార్డ్‌

  • అథ్లెటిక్స్‌లో మరో రెండు ప్రపంచ రికార్డులు

  • పారా ఆసియా క్రీడలు

పారా ఆసియాడ్‌లో భారత అథ్లెట్లు అసమాన ప్రతిభా పాటవాలు ప్రదర్శించారు..మొత్తం 114 (30-35-49) పతకాలతో రికార్డు సృష్టించారు.. మొదటి రోజు మొదలు చివరి వరకు పతకాల మోత మోగించారు.. శుక్రవారం నాడూ 26 (9-9-8) పతకాలతో దుమ్ము రేపారు..గత హాంగ్జౌ క్రీడల కంటే సగం మంది బృందంతోనే బరిలో దిగినా, పతక సాధనలో అప్పటి అథ్లెట్లను (108 పతకాలు) మించిపోయారు..మొత్తంగా నగోయ పారా ఆసియా క్రీడల్లో మనోళ్ల ఆట అద్భుతమనే చెప్పాలి.

నగోయ (జపాన్‌): పాల్గొనేవారి కోటా నిబంధనలను కఠినతరం చేయడం, అందుబాటులో ఉన్న ఈవెంట్లలో మార్పులు చేపట్టడం వల్ల ఈసారి పారా ఆసియాడ్‌లో భారత అథ్లెట్ల సంఖ్య తగ్గింది. అయినా, ఇవేవీ మనోళ్ల ప్రదర్శనపై ఎలాంటి ప్రభావం చూపలేదు. 168 మంది బృందంతో రికార్డు పతకాలు సాధించి దేశం గర్వించేలా చేశారు. ఏకంగా 30 స్వర్ణాలతో మురిపించారు. ఇక..క్రీడలకు ఐదోరోజు శుక్రవారం 26 పతకాలు సొంతం చేసుకున్నారు. మొత్తం 114 పతకాలతో భారత్‌ నాలుగో స్థానంలో కొనసాగుతున్నది.


ఒకేరోజు తొమ్మిది స్వర్ణాలు: శుక్రవారం భారత్‌ మొత్తం 9 పసిడి పతకాలను ఖాతాలో వేసుకుంది. ఈసారి క్రీడల ఒకరోజు పోటీలలో స్వర్ణాల సంఖ్య రీత్యా ఇదే మనోళ్ల అత్యుత్తమ ప్రదర్శన. ఆర్చరీ, షూటింగ్‌, బ్యాడ్మింటన్‌, అథ్లెటిక్స్‌లో పసిడి పతకాలు లభించాయి. మహిళల 50 మీ. రైఫిల్‌ త్రీ పొజిషన్స్‌ ఎస్‌హెచ్‌1 విభాగం ఫైనల్లో మోనా అగర్వాల్‌ (357.5) ప్రపంచ రికార్డుతో స్వర్ణం చేజిక్కించుకుంది. అవనీ లేఖారా (249.6) రజత పతకంతో సరిపెట్టుకుంది. ఈ ఆసియాడ్‌లో మోనాకిది రెండో పసిడి పతకం.


బ్యాడ్మింటన్‌లో ట్రిపుల్‌: మూడు పసిడి పతకాలతో షట్లర్లు ట్రిపుల్‌ ధమాకా మోగించారు. ఎస్‌ఎల్‌3 ఫైనల్లో నితీశ్‌ 21-18, 21-16తో ప్రమోద్‌ భగత్‌ని ఓడించి స్వర్ణం దక్కించుకున్నాడు. నవీన్‌ శివకుమార్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌ఎల్‌4 తుదిపోరులో 21-9, 21-17తో సెతియవాన్‌ (ఇండోనేసియా)పై గెలిచి పసిడి నెగ్గింది. మహిళల డబుల్స్‌ ఎస్‌ఎల్‌3-ఎస్‌యూ5 ఫైనల్లో మానసీ జోషీ/తులసీమతి ద్వయం 21-16, 21-13తో యాంగ్‌/షియావో (చైనా)జంటపై నెగ్గి పసిడి సాధించారు. మిక్స్‌డ్‌ డబుల్స్‌ ఎస్‌ఎల్‌3-ఎస్‌యూ5 టైటిల్‌ ఫైట్‌లో నితీశ్‌ కుమార్‌/తులసీమతి జోడీ 21-11, 19-21, 19-21తో లెనాయ్‌ రాత్రి/హికమత్‌ (ఇండోనేసియా) ద్వయం చేతిలో ఓడి రజతానికి పరిమితమయ్యారు. సింగిల్స్‌ ఎస్‌యూ5 ఫైనల్లో తులసీమతి.. యాంగ్‌ (చైనా) చేతిలో ఓటమిపాలై రజతంతో సరిపెట్టుకుంది.


అథ్లెటిక్స్‌లో రెండు ప్రపంచ రికార్డులు: పురుషుల 400 మీటర్ల టీ64 పరుగులో సందీప్‌ 52.28సె. కొత్త ప్రపంచ రికార్డు సమయంతో పసిడి పతకం ఖాతాలో వేసుకున్నాడు. భారత్‌కే చెందిన అజయ్‌ కుమార్‌ (53.61సె.) పారా ఆసియాడ్‌ రికార్డుతో కాంస్యం చేజిక్కించుకున్నాడు. జావెలిన్‌ త్రో ఎఫ్‌ 37/38 విభాగంలో హానే 60.49 మీటర్ల దూరం విసిరి సరికొత్త వరల్డ్‌ రికార్డుతో బంగారు పతకం కొల్లగొట్టాడు. పురుషుల ఎఫ్‌ 42-44/61-61 జావెలిన్‌ త్రోలో మూడు పతకాలనూ మన అథ్లెట్లే దక్కించుకున్నారు. సుమిత్‌ అంటిల్‌ (72.46మీ) స్వర్ణం, గుర్జార్‌ (59.03 మీ.) రజతం, సందీప్‌ సాగర్‌ (64.48మీ.) కాంస్యం గెలుపొందారు.


పురుషుల క్లబ్‌ త్రోలో ప్రణవ్‌ సూర్మ 32.87మీ. పారా ఆసియా క్రీడల రికార్డు దూరంతో పసిడి పతకం నెగ్గాడు. మహిళల లాంగ్‌జంప్‌ టీ47 విభాగంలో నిమిష, పురుషుల 1500 మీటర్ల పరుగులో ప్రమోద్‌ రజతాలు నెగ్గారు. రికర్వ్‌ ఆర్చరీ పురుషుల డబుల్స్‌లో హర్విందర్‌ సింగ్‌/విజయ్‌ 5-1తో చైనా జోడీని ఓడించి పసిడి పతకంతో చరిత్ర సృష్టించింది. మహిళల డబుల్స్‌లో భావనా చౌధరి/పూజ ఫైనల్లో ఓడి రజతంతో సంతృప్తి చెందాల్సి వచ్చింది.

నేడు ముగింపోత్సవం: క్రీడలకు శనివారమే ఆఖరి రోజు. ఈరోజు జరిగే ముగింపు వేడుకల్లో షూటర్‌ మోనా, హైజంపర్‌ నిషాద్‌ కుమార్‌ భారత్‌ పతాకధారులుగా వ్యవహరిస్తారు.


వి కూడా చదవండి:

ప్రతీకా ప్రతాపం

ఆ విషయంలో కోహ్లీ మాట తప్పాడు.. అమిత్ మిశ్రా సంచలన వ్యాఖ్యలు

Updated Date - Oct 24 , 2026 | 02:34 AM