ఇంగ్లండ్‌తో రెండో టీ20.. ముగిసిన భారత్ ఇన్నింగ్స్.. స్కోరు ఎంతంటే..
ABN , Publish Date - Jul 04 , 2026 | 09:00 PM
ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది.
ఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో ఓల్డ్ ట్రాఫర్డ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. చిచ్చరపిడుగు వైభవ్ సూర్యవంశీకి ఇది తొలి అంతర్జాతీయ మ్యాచ్ కావడంతో ఈ మ్యాచ్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొన్న విషయం తెలిసిందే. ఓపెనర్లుగా బరిలోకి దిగిన వైభవ్, అభిషేక్ శర్మ ఆది నుంచీ దూకుడుగా ఆడారు. 5 ఓవర్లు ముగిసేసరికే స్కోరును 50 పరుగులకు చేర్చారు. ఆ తరువాత వైభవ్ (14) స్టంప్ ఔట్ కావడం అభిమానులను నిరాశ పరిచింది. అభిషేక్ శర్మ మాత్రం దూకుడును కొనసాగించాడు. అయితే, మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మను (43) సామ్ కుర్రన్ పెవిలియన్ బాట పట్టించడంతో టీమిండియా దూకుడు కాస్త తగ్గింది.
మిడిల్ ఓవర్స్‌లో మాత్రం శ్రేయస్ అయ్యర్, ఇషాన్ కిషాన్ నిలదొక్కుకునే ప్రయత్నం చేశారు. దీంతో, 10 ఓవర్లు ముగిసేసరికి భారత్ స్కోరు 2 వికెట్ల నష్టానికి 96కు చేరింది. కీలక భాగస్వాయం ఏర్పడుతున్న సమయంలో లియమ్ డాసన్ శ్రేయస్‌ను (37) పెవిలియన్ బాట పట్టించాడు. అనంతరం ఇంగ్లండ్ పేసర్లు కట్టుదిట్టంగా బంతులు వేయడంతో భారత్ స్కోరు బోర్డు నెమ్మదించింది. ఈ క్రమంలో సామ్ కుర్రన్ రెండో వికెట్‌ను పడగొట్టాడు. శివమ్ దూబేను (5) వెనక్కు పంపించాడు. అర్ధ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఉన్న ఇషాన్ కిషన్ (49) కూడా సామ్ కుర్రన్ బౌలింగ్‌లో వికెట్ చేజార్చుకున్నాడు. అక్షర్ పటేల్ (2) రనౌట్ అయ్యాడు. చివరి ఓవర్లలో తిలక్ వర్మ దూకుడుగా ఆడటంతో భారత స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో సామ్ కుర్రన్ మూడు వికెట్లు తీయగా, జోఫ్రా ఆర్చర్, లియమ్ డాసన్, విల్ జాక్స్ చెరోక వికెట్ తీశారు.
ఈ వార్తలనూ చదవండి:
అలా అయితే ఇప్పుడే ఆడించలేమని వైభవ్‌కు చెప్పండి: పార్థివ్ పటేల్
భారత క్రికెట్ మేనేజ్‌మెంట్‌కు సూర్యకుమార్ యాదవ్ ఫన్నీ కౌంటర్!