బర్త్‌డే ఆనందం ఆవిరి
ABN , Publish Date - Jun 01 , 2026 | 03:24 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస సంచలనాలు చోటుచేసుకొంటున్నాయి. మొన్న జొకోవిచ్, నిన్న డిఫెండింగ్ చాంపియన్ గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే, నేడు ఇగా స్వియటెక్ వంతైంది....
నాలుగో రౌండ్‌లో స్వియటెక్ అవుట్
షాకిచ్చిన కోస్ట్యుక్
క్వార్టర్స్‌కు జ్వెరెవ్
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో వరుస సంచలనాలు చోటుచేసుకొంటున్నాయి. మొన్న జొకోవిచ్, నిన్న డిఫెండింగ్ చాంపియన్ గాఫ్ టోర్నీ నుంచి నిష్క్రమిస్తే, నేడు ఇగా స్వియటెక్ వంతైంది. రోలాండ్ గారో్‌సలో ఏకంగా నాలుగుసార్లు విజేతగా నిలిచిన పోలెండ్ భామ స్వియటెక్‌కు పుట్టిన రోజున ఉక్రెయిన్ క్రీడాకారిణి మార్టా కోస్ట్యుక్ షాకిచ్చింది. ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో 23 ఏళ్ల కోస్ట్యుక్ 7-5, 6-1తో వరుస సెట్లలో మూడో సీడ్ ఇగాపై విజయం సాధించి కెరీర్‌లో తొలిసారి గ్రాండ్‌స్లామ్ క్వార్టర్‌ఫైనల్లో అడుగుపెట్టింది. ఈ సీజన్‌లో క్లేకోర్టులపై ఓటమనేదే లేకుండా సాగుతున్న కోస్ట్యుక్‌కిది వరుసగా 16వ విజయం కావడం విశేషం. స్వియటెక్ పరాజయం నేపథ్యంలో ఈసారి ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్‌లో కొత్త చాంపియన్ ఆవిర్భవించనుంది. మహిళల డ్రాలో ప్రస్తుతం కొనసాగుతున్న ప్లేయర్లలో ఎవరూ ఇప్పటివరకు ఇక్కడ విజేతగా నిలవకపోవడం గమనార్హం. అలాగే పురుషుల సింగిల్స్‌లోనూ ఇదే పరిస్థితి. సిన్నర్, జొకోవిచ్ ఓడిపోగా, కార్లోస్ అల్కారజ్ గాయంతో ఈసారి బరిలో దిగలేదు. దాంతో పోటీలో ఉన్న ఆటగాళ్లలో ఎవరూ ఇక్కడ గతంలో సింగిల్స్ టైటిల్ నెగ్గలేదు. ఇతర ప్రీక్వార్టర్‌ఫైనల్స్‌లో ఏడో సీడ్ ఎలెనా స్విటోలినా 4-6, 6-4, 6-0తో 11వ సీడ్ బెన్సిక్‌ని, ఎనిమిదో సీడ్ మిర్రా ఆండ్రీవా 6-3, 6-2తో టీక్‌మన్‌ని, సిర్‌స్టియా (రొమేనియా) 6-3, 7-6 (4)తో వాగ్ జియుని (చైనా) ఓడించారు. ఇక టైటిల్ ఫేవరెట్, రెండో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ ముందంజ వేశాడు. నాలుగో రౌండ్‌లో జ్వెరెవ్ 7-6 (3), 6-4, 6-1తో జాస్పెర్ జోంగ్ (హాలెండ్)పై నెగ్గి క్వార్టర్‌ఫైనల్‌కు చేరాడు. మరో ప్రీక్వార్టర్స్ మ్యాచ్‌లో కెనడాకు చెందిన నాలుగో సీడ్ ఫెలిక్స్ అలియాసిమే 5-7, 6-1, 7-6 (4), 7-6 (1)తో బ్రండన్ నకాషిమాపై నెగ్గాడు.
ఇవి కూడా చదవండి:
ఇషాన్ కిషన్‌ను దాటి అత్యధిక ధర పలికిన ఎంఐ ప్లేయర్
ఐపీఎల్ ఫైనల్: కోహ్లీ గత రికార్డులు ఎలా ఉన్నాయంటే..