Share News

గుల్వీర్‌ చరిత్ర

ABN , Publish Date - Jul 30 , 2026 | 04:14 AM

జోరున వాన.. తడిగా మారిన ట్రాక్‌! అయినా సడలని సంకల్పం.. సవాళ్లకు తలవంచని తెగువ.. శక్తినంతా కూడదీసుకొని.. మారథాన్‌ పవర్‌హౌస్‌ అథ్లెట్లను వెనక్కునెట్టి..

గుల్వీర్‌ చరిత్ర

  • 10,000 మీ. రేస్‌లో రజతం

  • లిఫ్టర్‌ హర్జీందర్‌కు వెండి పతకం

  • మరో ఆరుగురు బాక్సర్లకు పతకాలు ఖరారు

గ్లాస్గో: జోరున వాన.. తడిగా మారిన ట్రాక్‌! అయినా సడలని సంకల్పం.. సవాళ్లకు తలవంచని తెగువ.. శక్తినంతా కూడదీసుకొని.. మారథాన్‌ పవర్‌హౌస్‌ అథ్లెట్లను వెనక్కునెట్టి.. కామన్వెల్త్‌ క్రీడల్లో భారత్‌కు చారిత్రక పతకం అందించాడు ఆర్మీ సుబేదార్‌ గుల్వీర్‌ సింగ్‌. మహిళల వెయిట్‌ లిఫ్టింగ్‌లో హర్జీందర్‌ కౌర్‌ రజతంతో మెరిసింది. బాక్సర్లు తమ విభాగాల్లో సెమీస్‌ చేరి మరో ఆరు పతకాలను ఖరారు చేశారు. బుధవారం జరిగిన పురుషుల 10,000 మీటర్ల రేస్‌లో గుల్వీర్‌ 27 నిమిషాల 49.78 సెకన్ల టైమింగ్‌తో రెండోస్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకొన్నాడు. ఈ క్రమంలో కామన్వెల్త్‌ క్రీడల 10 వేల మీటర్ల ఈవెంట్‌లో భారత్‌కు తొలిసారి పతకం అందించిన అథ్లెట్‌గా 28 ఏళ్ల గుల్వీర్‌ చరిత్ర సృష్టించాడు. వర్షం కారణంగా పరిగెత్తడానికి కష్టంగా మారినా కూడా ఆసియాడ్‌ కాంస్య పతక విజేత గుల్వీర్‌ తుది వరకూ పతకం కోసం పోరాడాడు. ఆఖరి ల్యాప్‌లో ఒక్కసారిగా జోరు పెంచి రెండో స్థానంలో నిలిచాడు. ఆస్ట్రేలియా రన్నర్‌ కై రాబిన్సన్‌ 27 నిమిషాల 48.93 సెకన్లతో స్వర్ణం సాధించగా.. ఐజల్‌ ఆఫ్‌ మ్యాన్‌ అథ్లెట్‌ డేవిడ్‌ ముల్లర్‌కీ 27 నిమిషాల 50.28 సెకన్లతో కాంస్యం దక్కించుకొన్నాడు. అయితే, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్లకు కేరాఫ్‌ అడ్రస్‌గా ఉన్న ఆఫ్రికా దేశాల నుంచి ఒక్కరు కూడా ఈ రేసులో పోడియం ఫినిష్‌ చేయలేకపోవడం గమనార్హం. ఇలా జరగడం 1986 తర్వాత ఇదే మొదటిసారి.

హర్జీందర్‌కు రజతం: వెయిట్‌ లిఫ్టర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకొంటున్నారు. నిరుపమ, సంజన తప్ప బరిలోకి దిగిన ప్రతి అథ్లెట్‌ దేశానికి పతకం అందించడం విశేషం. ఆఖరుగా మహిళల 69 కిలోల విభాగంలో హర్జీందర్‌ కౌర్‌ రజతం సాధించడంతో.. ఈ విభాగంలో భారత్‌ స్వర్ణం సహా 7 పతకాలను సొంతం చేసుకొంది. హర్జీందర్‌.. మొత్తం 227 (101+126) కిలోల బరువు ఎత్తి రజతం సాధించింది. కెనడా లిఫ్టర్‌ చార్లెట్‌ 240 (108+132) కిలోలు ఎత్తి గేమ్స్‌ రికార్డుతో స్వర్ణం నెగ్గగా, ఆస్ట్రేలియా లిఫ్టర్‌ ఫిబి హైమన్‌ 218 (97+121) కిలోలతో కాంస్యం అందుకొంది. 77 కిలోల విభాగంలో సంజన స్నాచ్‌ మూడు ప్రయత్నాల్లోనూ 94 కిలోలు ఎత్తలేక నిష్క్రమించింది.

షాట్‌ పుట్‌ ఫైనల్‌కు తూర్‌, గిల్‌: పురుషుల షాట్‌ పుట్‌లో భారత ఆటగాళ్లు తజిందర్‌పాల్‌ సింగ్‌ తూర్‌, సమర్‌దీప్‌ సింగ్‌ గిల్‌ ఫైనల్‌కు చేరుకొన్నారు. గ్రూప్‌-ఎలో రెండో ప్రయత్నంలో 20.14 మీటర్ల దూరం విసిరిన తూర్‌.. 20 మీటర్ల ఆటోమేటిక్‌ క్వాలిఫికేషన్‌ మార్క్‌ను అందుకొన్నాడు. కాగా, గ్రూప్‌-బిలో గిల్‌ 19.95 మీటర్లతో బెస్ట్‌ త్రో చేశాడు. దీంతో రెండు గ్రూపుల నుంచి మెరుగైన ప్రదర్శన చేసిన టాప్‌-12 అథ్లెట్‌గా నిలిచిన గిల్‌ తుది పోరుకు అర్హత సాధించాడు. గురువారం ఫైనల్స్‌ జరగనున్నాయి.


200 మీటర్ల రేసులో సెమీ్‌సకు అనిమేష్‌

జాతీయ రికార్డు హోల్డర్‌ అనిమేష్‌ కుజుర్‌ పురుషుల 200 మీటర్ల సెమీ్‌సకు అర్హత సాధించాడు. హీట్‌4లో అనిమేష్‌ 20.46 సెకన్ల టైమింగ్‌తో టాప్‌లో నిలవగా.. ఓవరాల్‌గా ఏడోస్థానం దక్కించుకొని సెమీస్‌ చేరాడు.

స్విమ్మింగ్‌లో సజన్‌, శ్రీహరి విఫలం

స్విమ్మింగ్‌లో భారత్‌కు నిరాశే ఎదురైంది. 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో ఫైనల్‌ చేరడంలో స్విమ్మర్‌ సజన్‌ ప్రకాశ్‌ విఫలమయ్యాడు. హీట్‌లో సజన్‌ 5వ స్థానానికి పరిమితమయ్యాడు. శ్రీహరి నటరాజ్‌ 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్‌కు అర్హత సాధించలేక పోయాడు.

పూజకు నిరాశ

మహిళల హైజం్‌పలో ఆసియా చాంపియన్‌ పూజా సింగ్‌ నిరాశపర్చింది. మూడోసారి కూడా 1.82 మీటర్లు దూకడంలో విఫలమైన పూజ.. పోటీ నుంచి నిష్క్రమించింది.

నీరజ్‌ వేట నేటి నుంచే

అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా ఈవెంట్‌కు సమయం ఆసన్నమైంది. గురువారం జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ ఈవెంట్‌ జరగనుంది. 2018లో స్వర్ణం సాధించిన చోప్రా.. గాయం కారణంగా 2022 క్రీడలకు దూరమయ్యాడు. పాకిస్థా న్‌కు చెందిన ఒలింపిక్‌ చాంప్‌ అర్హద్‌ నదీమ్‌, శ్రీలంక అథ్లెట్‌ రుమేష్‌ తరంగ నుంచి నీరజ్‌కు ఈసారి సవాల్‌ ఎదురుకానుంది. భారత్‌ నుంచి రోహిత్‌, యశ్‌వీర్‌ కూడా బరిలో ఉన్నారు.

నేటి భారత షెడ్యూల్‌

అథ్లెటిక్స్‌: పురుషుల డెకాథ్లాన్‌- తేజస్విన్‌ శంకర్‌ (మ. 2.40); జావెలిన్‌ త్రో క్వాలిఫికేషన్‌ రౌండ్‌- నీరజ్‌ చోప్రా, రోహిత్‌, యశ్‌వీర్‌ (మ.2.55); షాట్‌పుట్‌ ఫైనల్‌- తజిందర్‌, గిల్‌ (రా. 11.30); మహిళల డిస్కస్‌ త్రో ఫైనల్‌- నిధి, సీమ (రా. 1.10); మహిళల 5000 మీ. ఫైనల్‌ -పారుల్‌ (రా. 1.48); లాన్‌బౌల్స్‌: నవ్‌నీత్‌, దినేష్‌, నయన్‌ (రా. 7.30); వెయిట్‌ లిఫ్టింగ్‌: మహిళల 86+ కిలోల ఫైనల్‌- మార్టినా దేవి (సా. 6.30); పురుషుల 110+కిలోల ఫైనల్‌ -లవ్‌ప్రీత్‌ (రా. 11).

ఇవి కూడా చదవండి

విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ.. లోక్‌సభ ఆమోదంతో పేపర్ లీక్‌లకు చెక్: కేంద్ర మంత్రి అమిత్ షా

Updated Date - Jul 30 , 2026 | 04:14 AM