Share News

టైటాన్స్‌.. సులువుగా

ABN , Publish Date - Apr 13 , 2026 | 05:01 AM

మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఆట గాడిలో పడింది. వరుస పరాజయాలతో లీగ్‌ను పేలవంగా ఆరంభించిన ఆ జట్టు రెండు వరుస విజయాలతో కోలుకొంది.

టైటాన్స్‌.. సులువుగా

  • అదరగొట్టిన ప్రసిద్ధ్‌

  • 7 వికెట్లతో లఖ్‌నవూ ఓటమి

లఖ్‌నవూ: మాజీ చాంపియన్‌ గుజరాత్‌ టైటాన్స్‌ ఆట గాడిలో పడింది. వరుస పరాజయాలతో లీగ్‌ను పేలవంగా ఆరంభించిన ఆ జట్టు రెండు వరుస విజయాలతో కోలుకొంది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ ప్రసిద్ధ్‌ కృష్ణ (4/28) బెంబేలెత్తే బౌలింగ్‌కు బట్లర్‌ (37 బంతుల్లో 11 ఫోర్లతో 60), కెప్టెన్‌ గిల్‌ (40 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 56) హాఫ్‌ సెంచరీలు తోడ వడంతో గుజరాత్‌ అలవోకగా గెలిచింది. ఆదివారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో ఏడు వికెట్లతో లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌ని ఓడించింది. తొలుత లఖ్‌నవూ 20 ఓవర్లలో 164/8 స్కోరుకే పరిమితమైంది. మార్‌క్రమ్‌ (30) మినహా ఒక్కరు కూడా 20 పరుగులు చేయలేకపోయారు. పూరన్‌ (19), పంత్‌ (18) మోస్తరుగా ఆడారు. అశోక్‌ శర్మ 2 వికెట్లు తీశాడు. అనంతరం 18.4 ఓవర్లలో 165/3 స్కోరుతో గుజరాత్‌ ఛేదనను పూర్తి చేసింది.

ఆడుతూ పాడుతూ..: సాయి సుదర్శన్‌ (15), గిల్‌ తొలి వికెట్‌కు 45 పరుగులతో గుజరాత్‌కు శుభారంభాన్నిచ్చారు. ఆరో ఓవర్‌లో సుదర్శన్‌ పెవిలియన్‌ చేరినా..బట్లర్‌, గిల్‌ రెండో వికెట్‌కు 84 రన్స్‌ జోడించారు. 8వ ఓవర్‌లో పంత్‌ వదిలేసిన క్యాచ్‌ను సద్వినియోగం చేసుకున్న బట్లర్‌ ఎదురు దాడికి దిగాడు. ఈ క్రమంలో మొదట గిల్‌, తర్వాత బట్లర్‌ హాఫ్‌ సెంచరీలు పూరించారు. వీరిద్దరు అవుటయ్యే సమయానికి టైటాన్స్‌ గెలుపునకు 30 పరుగుల దూరంలో నిలిచింది. వాషింగ్టన్‌ సుందర్‌ (21 నాటౌట్‌), రాహుల్‌ తెవాటియా (10 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశారు.

నిలువరించిన ప్రసిద్ధ్‌: అంతకుముందు ప్రసిద్ధ్‌కృష్ణ ధాటికి లఖ్‌నవూ చేతులెత్తేసింది. గత మ్యాచ్‌లో జట్టును గెలిపించిన ముకుల్‌ చౌదురి (18) కూడా విఫలమయ్యాడు. ఇక ఆరంభం నుంచే షాట్లతో మార్‌క్రమ్‌ తన ఉద్దేశాన్ని చాటి చెప్పాడు. అయితే రబాడ బౌలింగ్‌లో భారీషాట్‌ ఆడబోయిన మార్ష్‌ (11).. గిల్‌కు క్యాచిచ్చాడు. పంత్‌ కూడా భారీషాట్‌ కొట్టే యత్నంలో సిరాజ్‌ బౌలింగ్‌లో నిష్క్రమించాడు. ఏడో ఓవర్లో మార్‌క్రమ్‌కు ప్రసిద్ధ్‌ చెక్‌ పెట్టాడు. ఆయుష్‌ బదోనీ (9) మళ్లీ నిరాశపరచగా..పూరన్‌, సమద్‌ (18) పరిస్థితిని చక్కదిద్దారు. అయితే పూరన్‌ను అవుట్‌ చేసి ప్రసిద్ధ్‌ లఖ్‌నవూకు ఇంకోసారి షాకివ్వగా, సమద్‌ను అశోక్‌ తిప్పిపంపాడు. ఇక..19వ ఓవర్‌లో ముకుల్‌ను పెవిలియన్‌ చేర్చి ప్రసిద్ధ్‌ గట్టి దెబ్బకొట్టాడు. ఆపై లిండే (16), షమి (12 నాటౌట్‌) కొద్దిసేపు నిలవడంతో లఖ్‌నవూ గౌరవప్రద స్కోరందుకుంది.

Updated Date - Apr 13 , 2026 | 05:01 AM