Share News

యువకెరటాలు

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:41 AM

ఉరిమే ఉత్సాహం.. మెరుపు వేగం.. అద్భుత విన్యాసాలతో అలరించేందుకు యువ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. మైదానంలో పాదరసంలా కదిలే ఈ కుర్రాళ్లకు తమ ప్రతిభాపాటవాలను...

యువకెరటాలు

6 రోజుల్లో

ఉరిమే ఉత్సాహం.. మెరుపు వేగం.. అద్భుత విన్యాసాలతో అలరించేందుకు యువ ఆటగాళ్లు సిద్ధమయ్యారు. మైదానంలో పాదరసంలా కదిలే ఈ కుర్రాళ్లకు తమ ప్రతిభాపాటవాలను ప్రదర్శించేందుకు వరల్డ్‌కప్‌ను మించిన వేదిక మరొకటి ఏముంటుంది. తాజా మెగా ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ను మైమరపించగల కొందరు చిచ్చరపిడుగులు.. ఇదిగో...వీరే

లామిన్‌ యమల్‌

దేశం: స్పెయిన్‌

స్పెయిన్‌కు చెందిన 18 ఏళ్ల ఫార్వర్డ్‌ యమల్‌ ఈ తరంలోనే అత్యంత ప్రతిభగల ఆటగాడిగా ప్రశంసలు అందుకొంటున్నాడు. టెక్నిక్‌తోపాటు ఎంతో తెలివైన ఆటగాడిగా కూడా పేరందుకున్నాడు. సృజనాత్మక షాట్లతో కలకలకం రేపుతాడు. ప్రథమ డిఫెండర్‌ను దాటాడా.. అతడి ముందు ఎన్నో అవకాశాలుంటాయి. వేగంగా కదులుతూ నేరుగా ప్రత్యర్థి గోల్‌ పోస్టుపై దాడి చేయగలడు.. లేదా డిఫెండర్లను ఏమార్చి చాకచక్యంగా బంతిని పాస్‌ చేసే సామర్థ్యం ఇతని సొంతం. ఇక, తన ట్రేడ్‌ మార్క్‌ డయాగ్నల్‌ పాస్‌తో ఒక్కసారిగా ప్రత్యర్థి శిబిరంలో అలజడి సృష్టించే సత్తా ఉన్న ప్లేయర్‌. ఎంత వేగంగా దూసుకెళ్తున్నా బంతిపై ఏమాత్రం నియంత్రణ కోల్పోకపోవడం యమల్‌ ప్రత్యేకత.

లెన్నార్ట్‌ కర్ల్‌

దేశం : జర్మనీ

జర్మనీకి చెందిన 18 ఏళ్ల కర్ల్‌.. మెరుపువేగంతో బంతిని తీసుకొని దూసుకెళ్లగలడు. చక్కని పాస్‌లతోపాటు స్పష్టమైన ఆలోచనతో ముందుకు సాగుతాడు. ప్రత్యర్థుల మార్కింగ్‌ను తప్పించుకొంటూ.. ఎంతో చాకచక్యంగా బంతిని పాస్‌ చేయగల దిట్ట. అటాకింగ్‌ స్ట్రయికరే అయినా.. టాకిలింగ్‌ చేయడంలో ఇతడికి కొన్ని బలహీనతలున్నాయి.

పౌ కుబార్సీ

దేశం: స్పెయిన్‌

స్పెయిన్‌ జట్టులో కీలక ఆటగాడు 19 ఏళ్ల కుబార్సీ. డిఫెన్స్‌లో జట్టుకు అండగా ఉంటాడు. పాస్‌లతోపాటు చక్కని సమన్వయంతో ముందుకు కదలగలడు. అయితే, ఆటలో అంతగా వేగం లేక పోవడం ఇతడికి మైనస్‌.

నికో ఓరిల్లీ

దేశం: ఇంగ్లండ్‌

ఇంగ్లండ్‌కు చెందిన 21 ఏళ్ల ఓరిల్లీ.. ప్రతిభావంతుడైన మిడ్‌ఫీల్డర్‌. ప్రీమియర్‌ లీగ్‌ యంగ్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద సీజన్‌ అవార్డును సొంతం చేసుకొన్నాడు. గోల్‌ పోస్టు వద్ద చక్కగా ఫినిషింగ్‌ చేయగల చాతుర్యం ఇతడి సొంతం. ప్రత్యర్థి ఆటగాళ్లకు అందకుండా బంతిని చేజిక్కించుకోవడంతోపాటు వేగంగా కదులుతూ చక్కని పాస్‌లు అందించగలడు. డిఫెన్స్‌లోనూ మంచి ప్రావీణ్యం ఉంది.


000-Sports.jpg

ఆర్డా గులెర్‌

దేశం : టర్కీ

21 ఏళ్ల గులెర్‌.. టర్కీ తురుపుముక్క. లిప్తపాటులో మ్యాచ్‌ను మలుపుతిప్పగల అటాకింగ్‌ ప్లేయర్‌. అద్భుతమైన మిడ్‌ఫీల్డర్‌. ఎడమ కాలి కిక్‌లతో గోల్‌ కీపర్లకు పరీక్ష పెట్టగలడు. సాంకేతికంగా ఎంతో బలమైన గులెర్‌.. బంతిని చక్కగా నియంత్రించగల సత్తా ఉన్నవాడు. ప్రత్యర్థి ఆటగాడు పసిగట్టేలోపే తనపని పూర్తి చేస్తాడు. డ్రిబ్లింగ్‌లో దిట్ట కావడంతో.. అతడి నుంచి బంతిని లాక్కోవడం ప్రత్యర్థులకు పెద్ద పరీక్ష.

నికో పాజ్‌

దేశం: అర్జెంటీనా

అర్జెంటీనా భవిష్యత్‌ ఆశాకిరణం 21 ఏళ్ల నికో. పెద్దగా ఖాళీ లేకపోయినా.. ఎడమ కాలితో సృజనాత్మక కిక్‌లు కొట్టగలడు. పాసింగ్‌ సమయంలో ఒక్క ఉదుటున అందుకొనే వేగంతో.. ప్రత్యర్థి డిఫెండర్లు తడబడే అవకాశం ఉంది. గోల్‌ పోస్టుపై గురి తప్పని షాట్లు కొట్టడం పాజ్‌ ప్రత్యేకత. సహచరులకు కచ్చితమైన పాస్‌లు అందించగలడు. సాంకేతికంగా బలమైన ఆటగాడు కావడంతోపాటు డైనమిక్‌ ప్లేయర్‌.

ఇవి కూడా చదవండి:

టెస్ట్ క్రికెట్‌ కోసం ఐపీఎల్ తరహా ప్రణాళికను అందించిన లలిత్ మోదీ

సూర్యకుమార్‌కు బిగ్ షాక్‌.. టీమిండియాకు కొత్త కెప్టెన్‌!

Updated Date - Jun 05 , 2026 | 04:41 AM