Share News

అప్పుడలా.. ఇప్పుడిలా..!

ABN , Publish Date - Jun 10 , 2026 | 04:01 AM

‘1994, 2026’కి ఎంత తేడా! అమెరికా తొలిసారి 1994లో ఫిఫా వరల్డ్‌క్‌పనకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మెక్సికో, కెనడాతో కలసి మరోసారి నిర్వహిస్తోంది...

అప్పుడలా..  ఇప్పుడిలా..!

రేపటి నుంచే ఫిఫా ప్రపంచకప్‌

‘1994, 2026’కి ఎంత తేడా! అమెరికా తొలిసారి 1994లో ఫిఫా వరల్డ్‌క్‌పనకు ఆతిథ్యం ఇచ్చింది. ఇప్పుడు మెక్సికో, కెనడాతో కలసి మరోసారి నిర్వహిస్తోంది. టోర్నమెంట్‌, సౌకర్యాల పరంగా గతంతో పోల్చితే ఎన్నో మార్పులొచ్చాయి. ఎక్కువ జట్లు బరిలోకి దిగుతున్న టోర్నీగా తాజా వరల్డ్‌కప్‌ చరిత్రకెక్కనుంది. ఈ నేపథ్యంలో అప్పటికి.. ఇప్పటికి కొన్ని తేడాలపై ఓ లుక్కేద్దామా..

వాటర్‌ బ్రేక్‌..

1994: వాతావరణం ఎంత వేడిగా ఉన్నా ఎక్కడా బ్రేక్‌ లేకుండా మ్యాచ్‌ను కొనసాగించారు.

2026: ఈసారి మాత్రం ప్రతి అర్ధ భాగంలో మూడు నిమిషాలు వాటర్‌ బ్రేక్‌ ఇవ్వనున్నారు. ఇది ఒకరకంగా కోచ్‌లకు స్ట్రాటజిక్‌ బ్రేక్‌గా కూడా ఉపయోగపడనుంది.

టిక్కెట్‌ ధరలు

1994: తొలి రౌండ్‌ టిక్కెట్‌ ధరలు 25 నుంచి 75 డాలర్లుగా ఉన్నాయి. కాలిఫోర్నియాలోని రోజ్‌బౌల్‌లో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌ రేట్లు 180 నుంచి 475 డాలర్లు.

2026: తొలి రౌండ్‌ టిక్కెట్‌ ధరలు 140 నుంచి 2,735 డాలర్లుగా నిర్ణయించగా.. ఫైనల్‌ మ్యాచ్‌ రేట్లు 4,185 నుంచి 8,680 డాలర్లు. మొదటిసారి డైనమిక్‌ ప్రైసింగ్‌ను ప్రవేశపెట్టడంతో.. డిమాండ్‌ను బట్టి ఏప్రిల్‌లో ఫైనల్‌ మ్యాచ్‌ టిక్కెట్‌ ధరల్ని అత్యధికంగా 10,990 డాలర్లకు ఫిఫా పెంచేసింది.

భారీగా పెరిగిన జట్ల సంఖ్య..

1994: ఈ టోర్నీలో 24 జట్లు పాల్గొనగా.. 1998 కప్‌లో 32కు పెంచారు.

2026: ఫిఫా చరిత్రలోనే అత్యధిక జట్లు పాల్గొంటున్న టోర్నీ కావడం విశేషం. టీమ్‌ల సంఖ్యను 32 నుంచి 48కి పెంచారు.


భారీగా ప్రేక్షకులు..

1994: టోర్నీకి రికార్డు స్థాయిలో 35.90 లక్షల మంది హాజరయ్యారు. 52 మ్యాచ్‌లను సరాసరిగా 68,991 మంది ప్రత్యక్షంగా వీక్షించారు.

2026: ఈసారి టోర్నీకి 60 నుంచి 70 లక్షల మంది హాజరయ్యే చాన్సుందని అంచనా.

నిర్వాహకులు ఎవరు?

1994: స్థానిక కమిటీలకు టోర్నీ నిర్వహణ బాధ్యతలు అప్పగించేవారు. 2022 వరకు ఇలాగే నడిచింది.

2026: టోర్నీ పూర్తి పర్యవేక్షణ, నిర్వహణ బాధ్యతలు ఫిఫా చేతిలోనే ఉన్నాయి.

పిచ్‌ల వైశాల్యం

1994: పిచ్‌ వైశాల్యాన్ని 68-105 (74-115 గజాలు) మీటర్లుగా ఫిఫా నిర్ధారించింది. కానీ, ఈ ప్రమాణాలను అమలు చేయలేదు.

2026: ఫిఫా నిర్ధారించిన ప్రమాణాలను కచ్చితంగా పాటించేలా స్టేడియాలకు మరమ్మతులు చేశారు.

సబ్‌స్టిట్యూట్‌లు

1994: ఇద్దరిని మాత్రమే సబ్‌స్టిట్యూట్‌ చేసే అవకాశం ఉంది. 1998లో ఆ సంఖ్యను మూడుకు పెంచగా.. 2018లో నాలుగుకు చేరింది.

2026: సబ్‌స్టిట్యూట్‌ల సంఖ్య 2022 నుంచి ఐదుకు పెరిగింది. ఎక్స్‌ట్రా టైమ్‌లో ఆరో ఆటగాడిని సబ్‌స్టిట్యూట్‌ చేసే అవకాశం ఉంది. ఎవరైనా ఆటగాడు కంకషన్‌నకు గురైతే ఎప్పుడైనా సబ్‌స్టిట్యూట్‌ చేసే చాన్సుంది.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవి కూడా చదవండి:

ట్రై సిరీస్: రుతురాజ్ సెంచరీ.. శ్రీలంక ఎ టార్గెట్ ఎంతంటే?

ప్రియాంశ్ ఆర్య వింత రనౌట్.. అంపైర్ నిర్ణయంపై చర్చ!

Updated Date - Jun 10 , 2026 | 04:01 AM