ఫిఫా కప్ హక్కుల్ని భారత్‌లో కొనేవాళ్లేరి?
ABN , Publish Date - May 02 , 2026 | 02:05 AM
ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్ జూన్ 11న ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే భాగ్యం భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు లేనట్టేనా..? ఇందుకు కారణంగా..
న్యూఢిల్లీ: ప్రతిష్ఠాత్మక ఫిఫా ప్రపంచ కప్ జూన్ 11న ప్రారంభం కానుంది. అయితే ఈ మెగా ఈవెంట్‌ను ప్రత్యక్ష ప్రసారం ద్వారా తిలకించే భాగ్యం భారత ఫుట్‌బాల్ ప్రేమికులకు లేనట్టేనా..? ఇందుకు కారణంగా..భారత్‌లో వరల్డ్ కప్ ప్రసార హక్కులకోసం ఏ ఒక్క సంస్థా ముందుకు రాకపోవడమే. జూన్ 11 నుంచి జూలై 19 వరకు జరిగే ప్రపంచ కప్‌నకు అమెరికా, కెనడా, మెక్సికో సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న విషయం విదితమే. 48 జట్లు పాల్గొంటున్న టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇక..భారత్‌లో ప్రత్యక్ష ప్రసారం లేకపోవడానికి కారణాలు ఏమిటంటే..
1. భారీ మొత్తం వల్లే..: భారత్‌లో ప్రపంచ కప్ మ్యాచ్‌ల ప్రసార హక్కుల ధరను ఫిఫా తొలుత రూ. 948 కోట్లుగా ఖరారు చేసింది. అయితే ఏ సంస్థా ముందుకు రాలేదు. దీంతో ఫిఫా ఆ మొత్తాన్ని రూ. 332 కోట్లకు తగ్గించింది. అయినా ఎవరూ ఆసక్తి చూపలేదు.
2. మ్యాచ్‌ల సమయమూ..: ప్రసార హక్కులకోసం ఏ సంస్థా ముందుకు రాకపోవడానికి ప్రధాన కారణం మ్యాచ్‌ల సమయమే. మెగా టోర్నీలో మొత్తం 104 మ్యాచ్‌లు జరుగుతుండగా..అందులో 14 మాత్రమే భారత కాలమానం ప్రకారం రాత్రి 12 గంటల కంటే ముందు జరుగుతున్నాయి. ఫైనల్ సహా మిగతా మ్యాచ్‌లన్నీ రాత్రి 12 తర్వాతే మొదలవవుతాయి. దాంతో..అర్ధరాత్రి తర్వాత జరిగే మ్యాచ్‌లను భారత్‌లో ఎవరూ చూడరని బ్రాడ్‌కాస్టింగ్ సంస్థలు భావిస్తున్నాయి. చైనా, శ్రీలంక, మలేసియా, ఽథాయ్‌లాండ్ దేశాలలో కూడా ఇదే పరిస్థితి.
3. పోటీ తగ్గడం..: 2022 ఫిఫా ప్రపంచ కప్ ప్రసార హక్కుల కోసం వయాకామ్ రూ. 450 నుంచి రూ. 550 కోట్లు చెల్లించింది. కానీ 2014, 2018 వరల్డ్ కప్‌ల ప్రసార హక్కులను సోనీ నెట్‌వర్క్ రూ. 600 కోట్ల మొత్తానికే దక్కించుకుంది. ప్రస్తుతం వయాకామ్, హాట్‌స్టార్ సంస్థలు విలీనమయ్యాయి. దాంతో హక్కుల కోసం పోటీ తగ్గింది.
4. ఐపీఎల్ సైతం: ఐపీఎల్ పూర్తయిన రెండు వారాలకే ఫిఫా ప్రపంచ కప్ మొదలవనుండడం కూడా బ్రాడ్‌కాస్ట్ సంస్థలు ఆసక్తి చూపకపోవడానికి ఇంకో కారణం. భారత్‌లోని కంపెనీలన్నీ తమ మార్కెటింగ్ బడ్జెట్ మొత్తాన్ని ఐపీఎల్‌కే కేటాయిస్తాయి. ఒక అంచనా ప్రకారం భారత్ క్రీడా మార్కెట్‌లో 89 శాతం డబ్బును క్రికెట్‌పైనే వెచ్చిస్తున్నాయి. మిగిలిన అన్ని క్రీడలపై కలిపి 11 శాతమే ఖర్చు చేస్తుండడం గమనార్హం.
ఎవరూ ముందుకు రాకపోతే..
ప్రసార హక్కుల మొత్తాన్ని ఫిఫా మరింత తగ్గించే వరకు వేచిచూడాలని జియో స్టార్ భావిస్తోందట. ఒకవేళ ఫిఫా అందుకు సిద్ధంగా లేకపోతే..ఫిపా యాప్‌లోనే వరల్డ్ కప్‌ను స్ట్రీమింగ్ చేయాల్సి ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
శతక సిక్సర్ల జాబితాలోకి.. కీలక మైలురాయికి అడుగు దూరంలో వైభవ్ సూర్యవంశీ
అంపైర్లు మరింత నిశితంగా గమనించాల్సింది.. క్యాచ్ ఔట్ వివాదంపై భువీ రియాక్షన్