Share News

ఫైనల్‌కు ట్రంప్‌

ABN , Publish Date - Jul 18 , 2026 | 05:31 AM

ప్రపంచకప్‌ ఫైనల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ శుక్రవారం ధ్రువీకరించారు....

ఫైనల్‌కు ట్రంప్‌

స్పెయిన్‌ పీఎం కూడా

న్యూజెర్సీ: ప్రపంచకప్‌ ఫైనల్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ హాజరుకానున్నారు. ఈ విషయాన్ని వైట్‌హౌస్‌ ప్రెస్‌ సెక్రటరీ కరోలిన్‌ లీవిట్‌ శుక్రవారం ధ్రువీకరించారు. అంతేకాదు.. ఫైనల్‌కు ముందు ట్రంప్‌ టవర్‌ వేదికగా జరిగే ఫిఫా రిసెప్షన్‌కు కూడా ట్రంప్‌ హాజరయ్యే అవకాశముంది. ఇక, స్పెయిన్‌ ప్రధానమంత్రి పెడ్రో సాంచెజ్‌ కూడా ఫైనల్‌ మ్యాచ్‌కు హాజరై తమ జట్టును ఉత్సాహపరచనున్నారు.

అర్జెంటీనా అధ్యక్షుడు

అందుకే.. రావడం లేదు

అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్‌ మిలే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌కు హాజరు కావడంలేదు. ఆదివారం జరిగే తుదిపోరులో డిఫెండింగ్‌ చాంపియన్‌ అర్జెంటీనా-స్పెయిన్‌తో తలపడుతున్న విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఫిఫా చీఫ్‌ గియానీ ఇన్‌ఫాంటినితో కలిసి మ్యాచ్‌ వీక్షించేందుకు మిలేకు ఆహ్వానం కూడా అందినా ఆయన వెళ్లడంలేదు. ఆయనే కాదు అర్జెంటీనా అధ్యక్షుడిగా ఎవరున్నా తమ జట్టు ఆడే మ్యాచ్‌లు చూడ్డానికి వెళ్లరట. ఓ సెంటిమెంటే దానికి కారణం. 1990లో ఓసారి ఆ దేశాధ్యక్షుడు కార్లోస్‌ మెనెమ్‌ ఓ మ్యాచ్‌కు వెళ్లడంతో అర్జెంటీనా జట్టు ఓడిపోయిందట. అప్పటినుంచి ఆ దేశాధ్యక్షులు మ్యాచ్‌ల్ని టీవీలో చూడడమే తప్ప స్టేడియాలకు మాత్రం వెళ్లరట. అదీ కథ!

వామ్మో.. అతనా రెఫరీ!

ప్రపంచ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌కు తనను రెఫరీగా ఎంపిక చేశారన్న విషయం తెలియగానే స్లొవేనియాకు చెందిన స్లావ్కో విన్సిచ్‌ ఆనందంతో ఏడ్చేశాడు. మరోవైపు ఫైనల్‌ ఆడుతున్న అర్జెంటీనా జట్టు మాత్రం..వామ్మో అతనా...అంటూ ఆందోళన చెందుతోంది. 2022 వరల్డ్‌క్‌పలో సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో తాము ఓటమిపాలైన మ్యాచ్‌కి విన్సిచ్‌ రెఫరీగా వ్యవహరించాడన్న విషయం వారిలో గుబులు రేకెత్తిస్తోంది. 46 ఏళ్ల స్లావ్కో 2020 నుంచి ఫిఫా రెఫరీగా వ్యవహరిస్తున్నాడు.

మోహన్‌లాల్‌..అర్జెంటీనా వీరాభిమాని

మళయాళ సూపర్‌ స్టార్‌ మోహన్‌లాల్‌ అర్జెంటీనా జట్టుకు వీరాభిమాని. 2014, 2022 ప్రపంచ కప్‌ ఫైనల్స్‌ చూసేందుకు వెళ్లారు. అర్జెంటీనా నెగ్గినప్పుడు మోహన్‌లాల్‌ ఆనందం అంతా ఇంతాకాదు. ఈసారి మెగా టోర్నీలో ఇంగ్లండ్‌తో అర్జెంటీనా ఆడిన సెమీఫైనల్‌కు సహ నటుడు ఫహద్‌ ఫాజిల్‌తో కలిసి అట్లాంటా స్టేడియంలో మోహన్‌ లాల్‌ సందడి చేశారు. అర్జెంటీనా నీలిరంగు జెర్సీనే ఆయన వేసుకోవడం విశేషం.

ఇవి కూడా చదవండి:

లార్డ్స్‌కు రోహిత్ శర్మ తల్లిదండ్రులు.. రిటైర్‌మెంట్ వార్తల వేళ కీలక పరిణామం!

Updated Date - Jul 18 , 2026 | 05:31 AM