Share News

విల్లు వీరుడు సాధించాడు

ABN , Publish Date - Jun 15 , 2026 | 06:02 AM

మన విల్లు వీరుడు సాధించాడు.. తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్‌ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తుదిపోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేతను...

విల్లు వీరుడు సాధించాడు

తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌కు వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణం

మిక్స్‌డ్‌లోనూ పసిడితో ‘గోల్డెన్‌ డబుల్‌’ కైవసం

ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3

మన విల్లు వీరుడు సాధించాడు.. తెలుగు కుర్రాడు ధీరజ్‌ బొమ్మదేవర ఆర్చరీ ప్రపంచకప్‌ రికర్వ్‌ వ్యక్తిగత విభాగంలో తొలి స్వర్ణాన్ని కైవసం చేసుకున్నాడు. తుదిపోరులో పారిస్‌ ఒలింపిక్స్‌ కాంస్య పతక విజేతను చిత్తు చేసి చాంపియన్‌గా నిలిచాడు. అంతేకాదు.. భారత క్రీడాకారిణి కుంకుమ్‌తో కలిసి మిక్స్‌డ్‌ ఈవెంట్‌లోనూ టైటిల్‌ నెగ్గిన ధీరజ్‌.. ఒకే టోర్నీలో రెండు పసిడి పతకాలతో ‘గోల్డెన్‌ డబుల్‌’ అందుకున్నాడు.

అంటాల్య (టర్కీ): ఎన్నాళ్లుగానో ఊరిస్తున్న ప్రపంచకప్‌ వ్యక్తిగత స్వర్ణాన్ని తెలుగు ఆర్చర్‌ ధీరజ్‌ బొమ్మదేవర ఎట్టకేలకు అందుకున్నాడు. ఆదివారం జరిగిన ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-3 పోటీల్లో పురుషుల రికర్వ్‌ వ్యక్తిగత విభాగం ఫైనల్లో ధీరజ్‌ 7-3తో దక్షిణ కొరియా స్టార్‌, పారిస్‌ విశ్వక్రీడల కాంస్య పతక విజేత లీ వూ సియోక్‌కు షాకిచ్చాడు. విజయవాడకు చెందిన 24 ఏళ్ల ధీరజ్‌కు ప్రపంచకప్‌ వ్యక్తిగత విభాగంలో ఇదే తొలి పసిడి పతకం. గతంలో ఈ విభాగం నుంచి అత్యుత్తమంగా మూడు కాంస్యాలు (2023, 24, 25) గెలిచాడు. ఇక, వ్యక్తిగత విభాగం ఫైనల్‌ చేరే క్రమంలో ధీరజ్‌ సెమీఫైనల్లో 6-4తో జర్మనీ ఆర్చర్‌ మోర్టిజ్‌ వీజర్‌ను ఓడించాడు. అంతకుముందు జరిగిన రికర్వ్‌ మిక్స్‌డ్‌ ఈవెంట్‌లో మహారాష్ట్ర అమ్మాయి కుంకుమ్‌ మొహద్‌ జతగా ధీరజ్‌ స్వర్ణం నెగ్గాడు. టైటిల్‌ పోరులో ధీరజ్‌/కుంకుమ్‌ ద్వయం 5-1తో కొరియా జంట కిమ్‌ జే డియోక్‌/ఓ యే జిన్‌ను కంగుతినిపించింది. 17 ఏళ్ల కుంకుమ్‌కు ఇది రెండో వరల్డ్‌కప్‌ స్వర్ణం. ఇటీవల షాంఘైలో రికర్వ్‌ టీమ్‌ ఈవెంట్‌లో విజేతగా నిలిచింది. ఇక, ఆర్మీ ఆటగాడైన ధీరజ్‌ ఇప్పుడు ఓవరాల్‌గా 12 ప్రపంచకప్‌ పతకాలను ఖాతాలో వేసుకున్నాడు. ఓవరాల్‌గా మూడో స్వర్ణం. నిరుడు టీమ్‌ ఈవెంట్‌లో పసిడి నెగ్గాడు.


అమ్మ తాళిబొట్టు తాకట్టుపెట్టి..

ప్రపంచ ఆర్చరీలో దక్షిణ కొరియా ఆధిపత్యానికి ఎదురొడ్డి కొన్నేళ్లుగా విశ్వవేదికలపై భారత జెండాను రెపరెపలాడిస్తున్న తెలుగు తేజం బొమ్మదేవర ధీరజ్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి అబ్బురపర్చాడు. ధీరజ్‌ ప్రస్తుతం ఆర్మీలో సుబేదార్‌ ర్యాంక్‌లో పని చేస్తున్నాడు. పుణెలోని ఆర్మీ స్పోర్ట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌లో సాధన చేస్తున్న ధీరజ్‌, విజయవాడలోని ఓల్గా అకాడమీలో కోచ్‌ చెరుకూరి లెనిన్‌ దగ్గర ఓనమాలు నేర్చుకున్నాడు. 2006లో ఆర్చరీలో అడుగు పెట్టిన ధీరజ్‌ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ధీరజ్‌ తండ్రితో కలిసి రోజూ విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియానికి వెళ్లేవాడు. అయితే అక్కడ ఆర్చరీ ప్రాక్టీస్‌ చేస్తున్న వారి దగ్గర ధీరజ్‌ గంటలతరబడి అలానే చూస్తూ ఉండిపోయేవాడు. అది గమనించిన శ్రవణ్‌, అతడికి ఆర్చరీలో శిక్షణ ఇప్పించడం ప్రారంభించారు. తొలుత టీచర్‌గా పని చేసిన శ్రవణ్‌, ధీరజ్‌ ఆర్చరీలో రాణిస్తుండడంతో అతడి కోసం ఆర్చరీ అఫీషియల్‌గా మారిపోయారు. ఒక దశలో ధీరజ్‌కు ఆర్చరీ పరికరాలను కొనేందుకు డబ్బులేని పరిస్థితుల్లో తల్లి రేవతి తన మంగళసూత్రాలను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. కాగా ధీరజ్‌ ప్రపంచ చాంపియన్‌గా నిలవడంపై తల్లిదండ్రులు శ్రవణ్‌, రేవతి సంతోషం వ్యక్తం చేశారు.

(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)

ఇవి కూడా చదవండి:

ఫిఫా ప్రపంచ కప్: చరిత్ర సృష్టించిన భారత సంతతి ఆటగాడు

పాక్‌తో హ్యాండ్‌షేక్ వివాదం.. హర్మన్‌ప్రీత్ రియాక్షన్ ఇదే

Updated Date - Jun 15 , 2026 | 06:02 AM