డెంబెలె హ్యాట్రిక్
ABN , Publish Date - Jun 28 , 2026 | 02:46 AM
ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె రికార్డు హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో.. మాజీ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా మూడో విజయంతో గ్రూప్-ఐ టాపర్‌గా నిలిచింది.
గ్రూప్ టాపర్‌గా ఫ్రాన్స్
ఫాక్స్‌బరో (యూఎస్): ఫార్వర్డ్ ఉస్మాన్ డెంబెలె రికార్డు హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగడంతో.. మాజీ చాంపియన్ ఫ్రాన్స్ వరుసగా మూడో విజయంతో గ్రూప్-ఐ టాపర్‌గా నిలిచింది. ఫిఫా ప్రపంచకప్‌లో భాగంగా శనివారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో ఫ్రాన్స్ 4-1తో నార్వేను చిత్తు చేసింది. డెంబెలె (7వ, 20వ, 32వ నిమిషం) ప్రథమార్ధంలోనే మూడు గోల్స్ చేయగా.. డిజైర్ డొ (90+4వ) ఓ గోల్‌ను అందించాడు. నార్వే తరఫున థీలో అస్గార్డ్ (44వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు. కాగా, నార్వే రెండో స్థానంతో ఇదివరకే రౌండ్-32 బెర్త్‌ను ఖరారు చేసుకోగా.. ఇదే గ్రూప్ నుంచి మెరుగైన ప్రదర్శన చేసిన మూడో జట్టుగా సెనెగల్ నాకౌట్ బెర్త్‌ను పట్టేసింది. తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌లో సెనెగల్ 5-0తో ఇరాక్‌ను చిత్తు చేసింది. గ్రూప్‌లో నాలుగో స్థానంలో నిలిచిన ఇరాక్ టోర్నీ నుంచి నిష్క్రమించింది.
ఉరుగ్వే అవుట్
వదులహారుహ్ (మెక్సికో): తమ జట్టు గోల్ కీపర్ ఫెర్నాండో ముస్లెరా తప్పిదంతో.. రెండుసార్లు చాంపియన్ ఉరుగ్వే భారీ మూల్యం చెల్లించింది. గ్రూప్-హెచ్‌లో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో ఉరుగ్వే 0-1తో స్పెయిన్ చేతిలో ఓడింది. ఈ క్రమంలో టోర్నీ నుంచి అవుటైన టాప్ ర్యాంక్ జట్టుగా 19వ స్థానంలోని ఉరుగ్వే నిలిచింది. 42వ నిమిషంలో స్పెయిన్ ఆటగాడు అలెక్స్ బేనా కిక్‌ను ముస్లెరా సమర్థంగా అడ్డుకోలేక పోయాడు. బంతి అతడి చేతికి తగిలి గోల్‌లోకి పోయింది. ఈ టోర్నీలో అతడు ఇలాంటి తప్పిదం చేయడం మూడోసారి. దీంతో ద్వితీయార్ధంలో తనను మరొకరితో సబ్‌స్టిట్యూట్ చేయాలని ముస్లెరా స్వయంగా కోరడంతో.. కోచ్ మరో కీపర్‌ను బరిలోకి దించాడు. కాగా, ఈ విజయంతో స్పెయిన్ మొత్తం 7 పాయింట్లతో గ్రూప్ టాపర్‌గా నిలిచింది. రెండో స్థానం దక్కించుకొన్న కేప్ వెర్డె రౌండ్-32కు చేరుకోగా.. చెరో రెండు పాయింట్లతో మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన ఉరుగ్వే, సౌదీ అరేబియాలు టోర్నీ నుంచి అవుటయ్యాయి.

బెల్జియం ముందుకు..
వాంకోవర్ (కెనడా): నెమ్మదిగా పుంజుకొన్న బెల్జియం.. గ్రూప్-జి టాపర్‌గా నాకౌట్ బెర్త్‌ను పట్టేసింది. రెండు వరుస డ్రాలతో డీలాపడ్డ బెల్జియం.. ఆఖరి లీగ్ మ్యాచ్‌లో 5-1తో న్యూజిలాండ్‌ను ఓడించింది. రెడ్ లయన్స్ తరఫున లియాండ్రో ట్రోసార్డ్ (28వ, 50వ నిమిషం) రెండు గోల్స్ చేయగా.. కెవిన్ డిబ్రుయన్ (66వ), రొమేలు లుకాకు (86వ), అలెక్సిస్ సెయిల్‌మేకర్ (90+4వ) తలో గోల్ సాధించారు. 84వ నిమిషంలో ఎలిజా జస్ట్ కివీస్‌కు ఏకైక గోల్ అందించాడు. కాగా, ఇదే గ్రూప్‌లో ఈజిప్ట్-ఇరాన్ మధ్య మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. గ్రూప్‌లో టాప్-2లో నిలిచిన బెల్జియం, ఈజిప్ట్ రౌండ్-32 బెర్త్‌లు దక్కించుకోగా.. ఇరాన్, కివీస్ ఎలిమినేట్ అయ్యాయి.
2 ఫిఫా వరల్డ్‌కప్ చరిత్రలో వేగంగా హ్యాట్రిక్ గోల్స్ చేసిన రెండో ఆటగాడిగా ఉస్మాన్ డెంబెలె నిలిచాడు. ఫస్టాఫ్‌లో 32 నిమిషాల్లోనే ఉస్మాన్ వరుసగా మూడు గోల్స్ చేశాడు. 1954 టోర్నీలో చెకొస్లోవేకియాతో మ్యాచ్‌లో ఆస్ట్రియా ఆటగాడు ఎరిచ్ ప్రోబ్స్‌ట్ 24 నిమిషాల్లోనే హ్యాట్రిక్ నమోదు చేశాడు.
జోర్డాన్‌తో పోరుకు మెస్సీ దూరం?
గ్రూప్-జెలో ఆదివారం జోర్డాన్‌తో జరిగే తమ ఆఖరి లీగ్ మ్యాచ్‌కు అర్జెంటీనా స్టార్ లియెనెల్ మెస్సీ దూరమయ్యే అవకాశాలున్నాయి. నాకౌట్ మ్యాచ్‌లకు ముందు అతడికి విశ్రాంతి ఇవ్వాలని అర్జెంటీనా కోచ్ స్కలోని భావిస్తున్నట్టు సమాచారం. స్టార్టింగ్ లైనప్‌లో మెస్సీ ఉండే అవకాశాలు లేవని తెలుస్తోంది. మరి సబ్‌స్టిట్యూట్‌గా అయినా మెస్సీని కోచ్‌బరిలోకి దించుతాడో.. లేదో? చూడాలి.