చెన్నై చమక్
ABN , Publish Date - May 03 , 2026 | 03:57 AM
రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (40 బంతుల్లో ......
రుతురాజ్, కార్తీక్ హాఫ్ సెంచరీలు
రాణించిన బౌలర్లు
ముంబైకి ఏడో ఓటమి
చెన్నై: రుతురాజ్ గైక్వాడ్ (48 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 67 నాటౌట్) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగగా.. యువ బ్యాటర్ కార్తీక్ శర్మ (40 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 నాటౌట్) కెరీర్‌లో తొలి హాఫ్ సెంచరీతో మురిపించాడు. దీంతో సొంత వేదికపై ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 8 వికెట్లతో ఘనవిజయం సాధించింది. ఈ సీజన్‌లో ముంబైపై సీఎ్‌సకేకిది రెండో విజయం. అటు హార్దిక్ సేన ఆడిన తొమ్మిది మ్యాచుల్లో ఏడో ఓటమితో ప్లేఆఫ్స్ అవకాశాలను మరింత క్లిష్టం చేసుకుంది. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా ముంబై 20 ఓవర్లలో 7 వికెట్లకు 159 పరుగులు చేసింది. నమన్ ధిర్ (37 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 57), రికెల్టన్ (24 బంతుల్లో 5 సిక్సర్లతో 37) రాణించారు. అన్షుల్‌కు 3, నూర్‌కు 2 వికెట్లు దక్కాయి. ఛేదనలో చెన్నై 18.1 ఓవర్లలో 2 వికెట్లకు 160 పరుగులు చేసి గెలిచింది. ఉర్విల్ (12 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 24) ఫర్వాలేదనిపించాడు. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా రుతురాజ్ నిలిచాడు.
రుతురాజ్-కార్తీక్ సమన్వయం: స్వల్ప ఛేదనలో రుతురాజ్, యువ బ్యాటర్ కార్తీక్ శర్మ చక్కటి అర్ధసెంచరీలతో చెన్నైని గెలుపు దిశగా నడిపించారు. ఫామ్‌లో ఉన్న సంజూ శాంసన్ (11) రెండో ఓవర్‌లోనే బుమ్రాకు చిక్కాడు. అయితే బౌల్ట్ ఓవర్‌లో రుతురాజ్ 4,4,6తో 17 రన్స్ అందించాడు. అటు ఉర్విల్ ఉన్న కాసేపు బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. ఐదో ఓవర్‌లో 6,4,6తో 18 రన్స్ సమకూర్చాడు. కానీ ఆరో ఓవర్‌లో ఉర్విల్‌ను ఘజన్‌ఫర్ బౌల్డ్ చేయడంతో పవర్‌ప్లేలో చెన్నై 62/2తో నిలిచింది. ఈ దశలో రుతురాజ్‌కు జత కలిసిన కార్తీక్ సమన్వయంతో బ్యాటింగ్ సాగించాడు. స్ట్రయిక్‌ను రొటేట్ చేస్తూ కెప్టెన్‌కు అండగా నిలిచాడు. 34 బంతుల్లో రుతురాజ్ వరుసగా రెండో ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. కార్తీక్ 17వ ఓవర్‌లో 4,6,4తో విజృంభించాడు. అదే ఊపులో కార్తీక్ తొలి ఫిఫ్టీ పూర్తి చేయడమే కాకుండా ఓ ఫోర్‌తో 11 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించాడు. మూడో వికెట్‌కు ఈ జోడీ అజేయంగా 98 రన్స్ జోడించింది.
నత్తనడకగా..: టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇన్నింగ్స్‌లో నమన్, ఓపెనర్ రికెల్టన్ మాత్రమే జోరు చూపారు. వీరి ధాటికి తొలి 10 ఓవర్లలో 90 పరుగులిచ్చిన చెన్నై బౌలర్లు ఆ తర్వాత ప్రత్యర్థిని మరో 69 రన్స్‌కే పరిమితం చేశారు. దీంతో ముంబై అతికష్టమ్మీద 150 రన్స్ దాటగలిగింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్ విల్ జాక్స్ (1) రెండో ఓవర్‌లోనే వెనుదిరిగాడు. ఈ స్థితిలో వన్‌డౌన్‌లో బరిలోకి దిగిన నమన్‌తో కలిసి రికెల్టన్ బాధ్యత తీసుకున్నాడు. ముకేశ్ ఓవర్‌లో రెండు, ప్రశాంత్ ఓవర్‌లో మూడు సిక్సర్లతో రికెల్టన్ వేగం చూపాడు. అటు నమన్ సిక్సర్‌తో జట్టు పవర్‌ప్లేలో 57/1 రన్స్ సాధించింది. ఆ తర్వాత చెన్నై బౌలర్లు పట్టు సాధించారు. నూర్ ఓవర్‌లో నమన్ 11 పరుగుల వద్ద ఇచ్చిన సులువైన క్యాచ్‌ను దూబే వదిలేయగా.. అదే ఓవర్‌లో రికెల్టన్ అవుటయ్యాడు. దీంతో రెండో వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. అనంతరం సూర్య(21) ఓ ఫోర్, సిక్స్‌తో టచ్‌లోకి వచ్చినట్టు కనిపించాడు. కానీ అతను స్వల్ప స్కోరుకే వెనుదిరిగాడు. తిలక్ (5) విఫలం కాగా.. హార్దిక్ (18) షాట్లు ఆడలేకపోయాడు. మధ్య ఓవర్లలో సీఎస్‌కే బౌలర్లు పరుగులను నియంత్రించారు. 34 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాక నమన్‌ను ఒవర్టన్ అవుట్ చేశాడు. అయితే డెత్ ఓవర్లలోనూ హార్దిక్ హిట్టింగ్ చేయలేకపోయాడు. చివరి ఐదు ఓవర్లలో ముంబై చేసింది 39 పరుగులే కాగా.. మూడు వికెట్లు కూడా కోల్పోయింది.
2 సీఎస్‌కే తరఫున ఎక్కువ హాఫ్ సెంచరీ (24)లు చేసిన రెండో బ్యాటర్‌గా రుతురాజ్. రైనా (34) ముందున్నాడు.