ఆరోసారైనా.. అందలమెక్కేనా!
ABN , Publish Date - Jun 03 , 2026 | 05:15 AM
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్.. ఫుట్‌బాల్‌లో రికార్డులు అతడికి దాసోహం. ఫీల్డ్‌లో ముందుకు కదులుతున్నాడంటే.. అంతటా కరెంట్ ప్రసరిస్తున్నంత అనుభూతి.. అతడే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో...
8 రోజుల్లో ప్రపంచకప్
ట్రోఫీపై రొనాల్డో భారీ ఆశలు
ప్రపంచ వ్యాప్తంగా అత్యంత క్రేజ్.. ఫుట్‌బాల్‌లో రికార్డులు అతడికి దాసోహం. ఫీల్డ్‌లో ముందుకు కదులుతున్నాడంటే.. అంతటా కరెంట్ ప్రసరిస్తున్నంత అనుభూతి.. అతడే పోర్చుగల్ దిగ్గజం క్రిస్టియానో రొనాల్డో. గోల్ పోస్టు ముందు అతడు చేసే విన్యాసాలు.. మ్యాజిక్‌కు ప్రపంచమే ఫిదా! సుదీర్ఘ కెరీర్‌లో ఎన్నో అవార్డులు.. రివార్డులు సాధించినా.. ‘ఫిఫా వరల్డ్‌కప్’ లేని శూన్యత అతడి కెరీర్‌లో పెద్ద లోటు! రొనాల్డోకు ఇదే ఆఖరి మెగా టోర్నీగా భావిస్తున్న నేపథ్యంలో.. అతడి చిరకాల కోరిక నెరవేరేనా?
ఆధునిక ఫుట్‌బాల్‌లో రొనాల్డోకు ఎవరైనా సాటి ఉన్నారంటే.. బహుశా మెస్సీ ఒక్కడేనేమో. ఫుట్‌బాల్ ప్రపంచంలో పీలే, మారడోనా తరహాలో తనపేరును కూడా సార్థకం చేసుకోవాలనుకొంటున్న 41 ఏళ్ల రొనాల్డో.. ఆరోసారి ఫుట్‌బాల్ వరల్డ్‌కప్ బరిలోకి దిగుతున్నాడు. క్లబ్ లెవెల్‌లో రొనాల్డో ఎదురులేని ఆటగాడు. కానీ, పుట్‌బాల్ ప్రపంచక్‌పలో మాత్రం తనదైన స్థాయి ప్రదర్శన చేయలేక పోవడం.. రొనాల్డోను వెంటాడుతున్న తెలియని బాధ.
రొనాల్డో తన తొలి ప్రపంచకప్‌ను 2006లో జర్మనీ వేదికగా ఆడాడు. ఆ టోర్నీలో సెమీస్ చేరిన పోర్చుగల్.. ఫ్రాన్స్ చేతిలో ఓడింది. అప్పటి నుంచి వరల్డ్‌కప్‌ను ముద్దాడాలని రొనాల్డో పరితపిస్తున్నా.. నెరవేరడం లేదు. రెండుసార్లు ప్రీక్వార్టర్స్‌లో, ఓసారి క్వార్టర్స్‌లో పోర్చుగల్ ఇంటిముఖం పట్టింది. 2014లో బ్రెజిల్‌లో జరిగిన కప్‌లో గ్రూప్ దశలోనే అవుటైంది.
లోపించిన ఆ మ్యాజిక్..
జర్మనీ, దక్షిణాఫ్రికా, బ్రెజిల్, రష్యా, కతార్‌లో జరిగిన టోర్నీల్లో బరిలోకి దిగిన రొనాల్డో.. 22 మ్యాచ్‌ల్లో 8 గోల్స్ మాత్రమే చేశాడు. క్లబ్ స్థాయిలో క్రిస్టియానో ప్రదర్శనతో పోల్చితే.. ఇది ఏమాత్రం సరితూగదు. 2022 టోర్నీతోనే రొనాల్డో గుడ్‌బై చెప్పేస్తాడని భావించారు. మాంచెస్టర్ యునైటెడ్ నుంచి బయటకు వచ్చిన క్రిస్టియానో తనదైన స్థాయి ప్రదర్శన చేయలేక పోయాడు. స్విట్జర్లాండ్‌తో నాకౌట్ మ్యాచ్‌లో ఏకంగా తుది జట్టు నుంచే అవుటయ్యాడు. కానీ, కోచ్ రాబర్టో మార్టినెజ్ కారణంగా మళ్లీ జాతీయ జట్టులోకి వచ్చాడు.
ఆశావహంగా..
ప్రస్తుతం పోర్చుగల్ జట్టులో విటిన్హా, జావో నీవ్స్, బ్రూనో ఫెర్నాండెజ్, నూనో మెండిస్ లాంటి మెరికలు ఉన్నా.. ప్రధాన ఆకర్షణ మాత్రం రొనాల్డోనే! 2024 యూరో క్వార్టర్స్‌లో ఓడిన పోర్చుగల్.. గతేడాది నేషన్స్ లీగ్ ఫైనల్లో స్పెయిన్‌ను ఓడించి సత్తా చాటింది. జట్టు బలంగా పుంజుకోవడానికి రొనాల్డోనే కారణమని కోచ్ అంటెన్నాడు. ఈ వరల్డ్‌కప్ గ్రూప్-కెలో కాంగో, ఉజ్బెకిస్థాన్, కొలంబియాతో పోర్చుగల్ తలపడనుంది. కసిమీదున్న రొనాల్డో.. ఈసారి కచ్చితంగా కప్ కొట్టాలన్న సంకల్పంతో ఉన్నాడు. అందుకేనేమో.. ప్రాక్టీస్ క్యాంప్‌లో చేరేముందు ‘ద వరల్డ్ మిషన్ బిగిన్స్’ అంటూ ఎక్స్‌లో పోస్టు చేశాడు.
(ఆంధ్రజ్యోతి క్రీడా విభాగం)
ఇవి కూడా చదవండి:
జమ్మూకశ్మీర్ పేసర్ ఆకిబ్ నబీ భారత టెస్ట్ జట్టుకు ఎంపికలో ట్విస్ట్!
లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ యజమానిపై లలిత్ మోదీ సంచలన వ్యాఖ్యలు
ప్రేమానంద్ మహరాజ్ ఆశ్రమాన్ని సందర్శించిన విరాట్ జంట