కప్పు లేకుండానే కథ ముగిసె..
ABN , Publish Date - Jul 08 , 2026 | 02:34 AM
క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా పరిచయం అక్కర్లేని పేరు. అంతలా సాకర్ ఆటపై చెరగని ముద్ర వేసిన ఆటగాడు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్లలో...
ప్రపంచ కప్‌కు గుడ్‌బై చెప్పిన రొనాల్డో
క్రిస్టియానో రొనాల్డో.. ప్రపంచంలోని ఏ మూలకు వెళ్లినా పరిచయం అక్కర్లేని పేరు. అంతలా సాకర్ ఆటపై చెరగని ముద్ర వేసిన ఆటగాడు. ఆల్‌టైమ్ గ్రేట్ ఫుట్‌బాలర్లలో ఒకడిగా వినుతికెక్కిన చరిత్ర. కానీ ఏం లాభం.. తన దేశానికి ఒక్క వరల్డ్‌కప్ కూడా అందించకుండానే మెగా టోర్నీకి గుడ్‌బై చెబుతున్నట్టు ప్రకటించాడు. మంగళవారం స్పెయిన్ చేతిలో పోర్చుగల్ ఓటమితో తన కల నెరవేర్చుకోలేకపోయాననే ఆవేదన వెంటాడుతుండగా.. రొనాల్డో భారంగా మైదానం వీడాడు. ఇక ఫిఫా ప్రపంచ క్‌పలో నెంబర్ 7 విన్యాసాలు కనిపించకపోవడం క్రీడాభిమానులకు మింగుడుపడని అంశమే.
(ఆంధ్రజ్యోతి క్రీడావిభాగం)
పోర్చుగల్ సూపర్‌స్టార్ క్రిస్టియానో రొనాల్డో తన కెరీర్‌లో చివరి వరల్డ్‌కప్ ఆడేశాడు. స్పెయిన్‌తో జరిగిన మ్యాచ్‌లో పోర్చుగల్ ఒక్క గోల్ కూడా చేయలేకపోయింది. అటు ప్రత్యర్థి స్టాపేజ్ సమయంలో చేసిన ఆ ఒక్క గోల్ రొనాల్డో వరల్డ్‌కప్ కెరీర్‌కు ముగింపు పలికింది. అందుకే రెఫరీ ఆఖరి విజిల్ వినగానే 41 ఏళ్ల క్రిస్టియానో కన్నీటిపర్యంతమయ్యాడు. ఎర్లింగ్టన్‌లోని డాలస్ స్టేడియంలోని అభిమానులు సైతం అతడిని చూసి భావోద్వేగానికి గురయ్యారు. కెరీర్‌లో ఆరు వరల్డ్‌కప్‌లలో బరిలోకి దిగిన రొనాల్డో.. 27 మ్యాచ్‌ల్లో 11 గోల్స్ సాధించాడు. ‘వరల్డ్‌కప్‌ను ఇలా వీడుతున్నందుకు విచారంగా ఉంది. చెప్పినట్టుగానే నా సర్వస్వం ధారపోశాను. ఇప్పుడు ప్రశాంత చిత్తంతో వెళుతున్నాను. ఫుట్‌బాల్ క్రీడాకారుడి జీవితమంటే ఇంతే. ముందుకు సాగాల్సిందే’ అని రొనాల్డో వ్యాఖ్యానించాడు.
ఒకే ఒక్కడు..
రొనాల్డో సాధించిన ఘనతలు మరే ఆటగాడి ఖాతాలోనూ ఉండవేమో. ఆడిన ఆరు వరల్డ్‌క్‌పల్లోనూ గోల్స్ సాధించిన ఏకైక ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు. తాజా టోర్నీలోనూ మూడు గోల్స్ అందించాడు. ఐదు బాలన్ డిఓర్ అవార్డులు, 2016లో యూరోపియన్ చాంపియన్‌షి్‌ప, రెండు యూఈఎ్‌ఫఏ నేషన్స్ లీగ్ తన ఖాతాలో ఉన్నా కానీ ఒక్క ప్రపంచకప్ ట్రోఫీ మాత్రం అతడిని కెరీర్ ఆద్యంతం ఊరించింది. తొలిసారి బరిలోకి దిగిన 2006 టోర్నీలో పోర్చుగల్ జట్టు సెమీస్ వరకు వెళ్లగలిగింది. అలాగే జట్టు అతడిపైనే అతిగా ఆధారపడడం కూడా సమస్యగా మారింది. ఏదిఏమైనా ఆటగాడిగా ఎవరెస్ట్ శిఖరాగ్రాన నిలిచిన రొనాల్డో.. తన ప్రతిభతో పోర్చుగల్‌ను మాత్రం చాంపియన్‌గా నిలబెట్టలేకపోవడం తన కెరీర్‌లో ఎప్పటికీ వెలితిగానే ఉంటుంది.
ఇవి కూడా చదవండి:
45వ పడిలోకి ‘తలా’.. ప్రపంచకప్ వేదికగా ఫిఫా వినూత్న శుభాకాంక్షలు!
తప్పుడు వార్తలపై సూర్యకుమార్ యాదవ్ ఫైర్!