కోహ్లీ ఒంటిచేత్తో..
ABN , Publish Date - May 14 , 2026 | 02:27 AM
ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 నాటౌట్) శతకంతో విజృంభించడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్లీ...
నేటి మ్యాచ్
పంజాబ్ X ముంబై
వేదిక: ధర్మశాల, రా.7.30
శతకం బాదిన విరాట్
టాప్‌నకు బెంగళూరు
6 వికెట్లతో కోల్‌కతా చిత్తు
రఘువంశీ హాఫ్ సెంచరీ వృథా
రాయ్‌పూర్: ఛేజ్ మాస్టర్ విరాట్ కోహ్లీ (60 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్స్‌లతో 105 నాటౌట్) శతకంతో విజృంభించడంతో.. రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్లీ అగ్రస్థానానికి చేరుకొంది. ఐపీఎల్‌లో బుధవారం జరిగిన వర్ష ప్రభావిత మ్యాచ్‌లో బెంగళూరు 6 వికెట్ల తేడాతో కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్)ను చిత్తు చేసింది. తొలుత కోల్‌కతా 20 ఓవర్లలో 192/4 స్కోరు చేసింది. అంగ్‌క్రిష్ రఘువంశీ (46 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71), రింకూ సింగ్ (29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 49 నాటౌట్) రాణించారు. భువనేశ్వర్, హాజెల్‌వుడ్, రసిక్ సలామ్ తలో వికెట్ పడగొట్టారు. ఛేదనలో బెంగళూరు 19.1 ఓవర్లలో 194/4 స్కోరు చేసి గెలిచింది. దేవ్‌దత్ పడిక్కల్ (39) ఫర్వాలేదనిపించాడు. కార్తీక్ త్యాగి మూడు వికెట్లు దక్కించుకొన్నాడు. కాగా, వర్షం కారణంగా 75 నిమిషాలపాటు ఆట ఆలస్యంగా ఆరంభమైంది. కోహ్లీ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
సునాయాసంగా..: రెండు మ్యాచ్‌ల్లో వరుసగా డకౌట్ అయిన విరాట్.. అద్భుత ప్రదర్శనతో జట్టును అలవోకగా గెలిపించాడు. ఛేదనను బెంగళూరు ఓపెనర్లు జాకబ్ బెథల్ (15), కోహ్లీ ధాటిగా ఆరంభించారు. రెండో ఓవర్‌లో వైభవ్ బౌలింగ్‌లో కోహ్లీ నాలుగు బౌండ్రీలతో 18 పరుగులు రాబట్టగా.. ఆ తర్వాతి ఓవర్‌లో బెథల్ 6,4,4తో దూకుడు కనబర్చాడు. అయితే, బెథల్‌ను కార్తీక్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేసినా.. వన్‌డౌన్‌లో వచ్చిన పడిక్కల్ నాలుగు ఫోర్లతో జోరు చూపాడు. ఆరో ఓవర్‌లో కోహ్లీ సిక్స్ బాదడంతో.. బెంగళూరు 66/1తో పవర్‌ప్లేను ముగించింది. అయితే, గ్రీన్ బౌలింగ్‌లో పడిక్కల్ ఇచ్చిన క్యాచ్‌ను వైభవ్ చేజార్చాడు. మరోవైపు 10వ ఓవర్‌లో కోహ్లీ డబుల్‌తో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకోగా.. టీమ్ స్కోరు సెంచరీ మార్క్ దాటింది. అయితే, 14వ ఓవర్‌లో పడిక్కల్‌ను కార్తీక్ క్యాచవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 92 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఈ దశలో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ పటీదార్(11)తో మూడో వికెట్‌కు 28 పరుగులు జోడించిన కోహ్లీ.. జట్టును గెలిపించే బాధ్యత తీసుకొన్నాడు. చివరి 5 ఓవర్లలో 48 పరుగులు కావాల్సి ఉండగా.. నరైన్ బౌలింగ్‌లో సిక్స్ బాదిన పటీదార్ ఆ తర్వాతి బంతికి పెవిలియన్ చేరాడు. కానీ, రాయ్ వేసిన 17వ ఓవర్‌లో కోహ్లీ 15 పరుగులు రాబట్టాడు. టిమ్ డేవిడ్ (2)ను కార్తీక్ క్యాచవుట్ చేసే సమయానికి ఆర్సీబీ విజయానికి 13 పరుగుల దూరంలో ఉంది. 19వ ఓవర్‌లో సింగిల్‌తో సెంచరీ సాధించిన కోహ్లీ.. మరో ఫోర్ కొట్టాడు. చివరి ఓవర్‌లో 3 పరుగులు అవసరం కాగా.. బౌండ్రీ బాదిన జితేశ్ శర్మ (8 నాటౌట్) మరో 5 బంతులు మిగిలుండగానే జట్టును విజయతీరాలకు చేర్చాడు.

నడిపించిన రఘువంశీ..: రఘువంశీ బాధ్యతాయుత అర్ధ శతకంతో ఆదుకోవడంతో.. కోల్‌కతా సవాల్ విసరగలిగే స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా.. పవర్‌ప్లేలోనే ఓపెనర్లు ఆలెన్ (18), రహానె (19) వికెట్లను చేజార్చుకొంది. మూడు ఫోర్లు, సిక్స్ బాదిన ఆలెన్‌ను భువీ వెనక్కిపంపగా.. ఐదో ఓవర్‌లో రహానెను హాజెల్‌వుడ్ రిటర్న్ క్యాచ్‌తో అవుట్ చేశాడు. అయితే, వన్‌డౌన్ బ్యాటర్ రఘువంశీ.. గ్రీన్‌తో కలసి మూడో వికెట్‌కు 68 పరుగులతో ఆదుకొనే ప్రయత్నం చేశాడు. గ్రీన్‌ను 13వ ఓవర్లో రసిక్ అవుట్ చేసినా.. అనంతరం క్రీజులోకి వచ్చిన రింకూతో కలసి రఘువంశీ స్కోరు బోర్డును నడిపించాడు. నాలుగో వికెట్ వీరిద్దరి 76 పరుగుల భాగస్వామ్యంతో.. కోల్‌కతా స్కోరు 190 మార్క్ దాటింది. ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న రఘువంశీ ఆఖరి బంతికి రనౌటయ్యాడు.
స్కోరుబోర్డు
కోల్‌కతా: రహానె (సి అండ్ బి) హాజెల్‌వుడ్ 19, ఆలెన్ (సి) జితేశ్ (బి) భువీ 18, రఘువంశీ (రనౌట్) 71, గ్రీన్ (బి) రసిక్ 32, రింకూ (నాటౌట్) 49; ఎక్స్‌ట్రాలు: 3; మొత్తం: 20 ఓవర్లలో 192/4; వికెట్ల పతనం: 1-23, 2-48, 3-116, 4-192; బౌలింగ్: భువనేశ్వర్ 4-0-34-1, డఫీ 4-0-48-0, హాజెల్‌వుడ్ 4-0-35-1, రసిక్ సలామ్ 4-0-35-1, క్రునాల్ 4-0-39-0.
బెంగళూరు: బెథల్ (సి అండ్ బి) కార్తీక్ 15, కోహ్లీ (నాటౌట్) 105, పడిక్కల్ (సి) రహానె (బి) కార్తీక్ 39, పటీదార్ (సి) రహానె (బి) నరైన్ 11, డేవిడ్ (సి) పాండే (బి) కార్తీక్ 2, జితేష్ (నాటౌట్) 8, ఎక్స్‌ట్రాలు:14, మొత్తం:19.1 ఓవర్లలో 194/4; వికెట్ల పతనం: 1-37, 2-129, 3-157, 4-180; బౌలింగ్: సౌరభ్ దూబే 2.1-0-21-0,వైభవ్ 4-0-48-0, కార్తీక్ 4-0-32-3, నరైన్ 4-0-31-1, గ్రీన్ 2-0-22-0, అనుకూల్ 3-0-36-0.
9
ఐపీఎల్‌లో అత్యధికంగా తొమ్మిది శతకాలు బాదిన ఆటగాడిగా కోహ్లీ. జోష్ బట్లర్ (7), క్రిస్ గేల్ (8), కేఎల్ రాహుల్ (6) తర్వాతి స్థానాల్లో ఉన్నారు. కాగా, ఓవరాల్‌గా టీ20ల్లో విరాట్‌కు ఇది 10వ సెంచరీ.

ఈ వార్తలు కూడా చదవండి
ఎయిర్ ఇండియా సంస్థ కీలక నిర్ణయం.. ఆ మార్గాల్లో విమానాల రద్దు..
నీట్ యూజీ పేపర్ లీక్ కేసులో సీబీఐ దూకుడు.. ఐదుగురి అరెస్ట్