రైజర్స్‌కు ఝలక్
ABN , Publish Date - Apr 06 , 2026 | 02:22 AM
రిషభ్ పంత్ (50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అర్ధ శతకంతో అదరగొట్టగా.. షమి (2/9) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) బోణీ...
లఖ్‌నవూ ఉత్కంఠ విజయం
చాముండేశ్వర్‌నాథ్‌నుంచి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు అందుకుంటున్న షమి
మెరిసిన పంత్.. వణికించిన షమి
5 వికెట్లతో హైదరాబాద్ చిత్తు
క్లాసెన్, నితీశ్ పోరాటం వృథా
హైదరాబాద్ : రిషభ్ పంత్ (50 బంతుల్లో 9 ఫోర్లతో 68 నాటౌట్) అర్ధ శతకంతో అదరగొట్టగా.. షమి (2/9) నిప్పులు చెరగడంతో.. ఐపీఎల్‌లో లఖ్‌నవూ సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జీ) బోణీ చేసింది. ఆదివారం ఉత్కంఠభరితంగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ 5 వికెట్ల తేడాతో లఖ్‌నవూ చేతిలో పరాజయం పాలైంది. తొలుత హైదరాబాద్ 20 ఓవర్లలో 156/9 స్కోరు చేసింది. క్లాసెన్ (41 బంతుల్లో 62), నితీశ్ కుమార్ (33 బంతుల్లో 56) అర్ధ శతకాలు వృథా అయ్యాయి. షమి, ప్రిన్స్, అవేశ్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో లఖ్‌నవూ 19.5 ఓవర్లలో 160/5 స్కోరు చేసి గెలిచింది. మార్‌క్రమ్ (45) రాణించాడు. హర్ష్ దూబే రెండు వికెట్లు పడగొట్టాడు. సన్‌రైజర్స్ పతనాన్ని శాసించిన షమి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఒడిదొడుకులు ఎదురైనా..: లక్ష్యం కోసం బరిలోకి దిగిన లఖ్‌నవూకు ఓపెనర్లు మార్‌క్రమ్, మార్ష్ (14) తొలి వికెట్‌కు 37 పరుగుల భాగస్వామ్యంతో మెరుగైన ఆరంభాన్నిచ్చారు. మార్ష్‌ను మలింగ అవుట్ చేయడంతో.. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్ పంత్ చిన్నచిన్న భాగస్వామ్యాలతో జట్టును గెలిపించాడు. రెండో వికెట్‌కు మార్‌క్రమ్‌తో కలసి 40 పరుగులు జోడించిన పంత్.. ఆయుష్ బదోని (12)తో మూడో వికెట్‌కు 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. పూరన్ (1) రనౌట్ కాగా.. సమద్ (16), ముకుల్ (2 నాటౌట్) సహకారంతో పంత్ జట్టును గెలుపు గీత దాటించాడు. ఆఖరి ఓవర్‌లో విజయానికి 9 పరుగులు కావాల్సి ఉండగా.. రిషభ్ మూడు బౌండ్రీలతో మ్యాచ్‌ను ముగించాడు.
టాప్ ఢమాల్..: టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్.. షమి దెబ్బకు విలవిల్లాడింది. ఓపెనర్లు అభిషేక్ (0), హెడ్ (7)ను అవుట్ చేసిన షమి ఆరంభంలోనే షాకిచ్చాడు. కెప్టెన్ ఇషాన్ కిషన్ (1)ను ప్రిన్స్ బౌల్డ్ చేయగా.. లివింగ్‌స్టోన్ (14)ను దిగ్వేష్ అవుట్ చేయడంతో హైదరాబాద్ 26/4తో పీకల్లోతు కష్టాల్లో కూరుకుపోయింది. ఈ దశలో క్లాసెన్, నితీశ్ ఐదో వికెట్‌కు 116 పరుగుల భాగస్వామ్యంతో జట్టుకు గౌరవప్రద స్కోరు అందించారు. సన్‌రైజర్స్‌కు ఐదోవికెట్ లేదా అంతకంటే లోయర్ ఆర్డర్‌లో ఇదే అత్యధిక భాగస్వామ్యం. 2025లో మనోహర్-క్లాసెన్ జోడీ ఆరో వికెట్‌కు 99 పరుగులు చేసింది.
స్కోరుబోర్డు
సన్‌రైజర్స్: హెడ్ (సి) మార్‌క్రమ్ (బి) షమి 7, అభిషేక్ (సి) సిద్దార్థ్ (బి) షమి 0, ఇషాన్ (బి) ప్రిన్స్ 1, లివింగ్‌స్టోన్ (సి) పంత్ (బి) దిగ్వేష్ 14, క్లాసెన్ (సి) పంత్ (బి) అవేశ్ 62, నితీశ్ (సి) ప్రిన్స్ (బి) సిద్దార్థ్ 56, అనికేత్ (నాటౌట్) 2, హర్ష్ దూబే (బి) అవేశ్ 0, శివాంగ్ (బి) ప్రిన్స్ 5, హర్షల్ (రనౌట్/పంత్) 4; ఎక్స్‌ట్రాలు: 5; మొత్తం: 20 ఓవర్లలో 156/9; వికెట్ల పతనం: 1-1, 2-8, 3-11, 4-26, 5-142, 6-144, 7-144, 8-151, 9-156; బౌలింగ్: షమి 4-0-9-2, దిగ్వేష్ రాఠీ 4-0-46-1, ప్రిన్స్ 4-0-34-2, సిద్దార్థ్ 4-0-29-1, అవేశ్ ఖాన్ 4-0-36-2.
లఖ్‌నవూ: మార్‌క్రమ్ (సి) లివింగ్‌స్టోన్ (బి) శివాంగ్ 45, మార్ష్ (సి) నితీశ్ (బి) మలింగ 14, పంత్ (నాటౌట్) 68, ఆయుష్ (స్టంప్) ఇషాన్ (బి) దూబే 12, పూరన్ (రనౌట్/ఇషాన్) 1, సమద్ (సి) లివింగ్‌స్టోన్ (బి) దూబే 16, ముకుల్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 19.5 ఓవర్లలో 160/5; వికెట్ల పతనం: 1-37, 2-77, 3-102, 4-105, 5-139; బౌలింగ్: హర్ష్ దూబే 4-0-18-2, నితీశ్ 1-0-14-0, ఉనాద్కట్ 3.5-0-50-0, ఎషాన్ మలింగ 4-0-30-1, హర్షల్ పటేల్ 3-0-16-0, శివాంగ్ 4-0-30-1.
6
ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో ఆరుసార్లు డకౌటైన అభిషేక్.. రోహిత్ (2018), శాంసన్ (2024) సరసన చేరాడు.