Share News

బాదేసి.. కూల్చేసి

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:51 AM

అటు బ్యాట్‌తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్‌ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది..

బాదేసి.. కూల్చేసి

ఆల్‌రౌండ్‌ షోతో

అదరగొట్టిన భారత్‌

శ్రేయాస్‌ సేనదే సిరీస్‌

రెండో మ్యాచ్‌లో జింబాబ్వే చిత్తు

సత్తా చాటిన ఇషాన్‌, తిలక్‌

ఆఖరి టీ20 నేడే

హరారే: అటు బ్యాట్‌తో.. ఇటు బంతితోనూ ఆతిథ్య జింబాబ్వేపై టీమిండియా విరుచుకుపడింది. ఫలితంగా..రెండో టీ20లో భారత్‌ ఏకంగా 90 పరుగుల భారీ తేడాతో ఘనవిజయం సాధించింది. దీంతో మూడు టీ20ల ఈ సిరీ్‌సను మరో మ్యాచ్‌ ఉండగానే 2-0తో దక్కించుకుంది. ఆఖరిదైన మూడో మ్యాచ్‌ ఆదివారం జరుగుతుంది. శ్రేయాస్‌ అయ్యర్‌కు కెప్టెన్‌గా ఇదే తొలి సిరీస్‌ కావడం విశేషం. శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా భారత్‌ 20 ఓవర్లలో 5 వికెట్లకు 219 పరుగులు చేసింది. ఇషాన్‌ కిషన్‌ (44 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 81), తిలక్‌ వర్మ (29 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 నాటౌట్‌) అర్ధసెంచరీలతో అదరగొట్టారు. భారీ ఛేదనలో భారత బౌలింగ్‌ ధాటికి.. జింబాబ్వే 17.5 ఓవర్లలో 129 పరుగులకే కుప్పకూలింది. ఆరంభంలో బెనెట్‌ (32) ధనాధన్‌ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. కానీ తను నాలుగో ఓవర్‌లోనే వెనుదిరగడంతో వికెట్ల పతనం మొదలైంది. ప్రిన్స్‌ యాదవ్‌ (2/10), అరంగేట్ర పేసర్‌ యష్‌ ఠాకూర్‌ (2/30) వారినే మాత్రం కుదురుకోనీయలేదు. ఆ తర్వాత తడివనషె (24) మాత్రమే రాణించాడు. ప్రిన్స్‌ ఆట మధ్యలోనే గాయంతో పెవిలియన్‌ చేరాడు. మూడు వికెట్లతో అభిషేక్‌ టెయిలెండర్ల పనిబట్టాడు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా ఇషాన్‌ నిలిచాడు.

ఇషాన్‌-తిలక్‌ జోరు: టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ ఇన్నింగ్స్‌లో ఇషాన్‌, తిలక్‌ హాఫ్‌ సెంచరీలతో ఆకట్టుకున్నారు. 29 పరుగులకే ఓపెనర్లు అభిషేక్‌ (8), వైభవ్‌ సూర్యవంశీ (9 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్సర్‌తో 20) వెనుదిరగడంతో భారత్‌ కష్టాల్లో పడినట్టనిపించింది. కానీ ఇషాన్‌ అద్భుత బ్యాటింగ్‌తో పరిస్థితిని చక్కదిద్దాడు. సారథి శ్రేయాస్‌ (25)తో కలిసి మూడో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించాడు. పదో ఓవర్‌లో శ్రేయాస్‌ వెనుదిరిగాక తిలక్‌తో కలిసి ఇషాన్‌ కదం తొక్కాడు. ఈ జోడీ నాలుగో వికెట్‌కు 94 పరుగులు అందించింది. ఇక తిలక్‌, రింకూ (12) చెరో సిక్సర్‌తో 18వ ఓవర్‌లో జట్టు స్కోరు 200 దాటింది.


స్కోరుబోర్డు

భారత్‌: వైభవ్‌ (సి) ముజరబాని (బి) ఎన్‌గరవ 20, అభిషేక్‌ (సి) బర్ల్‌ (బి) ముజరబాని 8, ఇషాన్‌ (సి) బెనెట్‌ (బి) న్యూమన్‌ 81, శ్రేయాస్‌ (సి) ఇవాన్స్‌ (బి) బెనెట్‌ 25, తిలక్‌ (నాటౌట్‌) 60, రింకూ (సి) బర్ల్‌ (బి) ఇవాన్స్‌ 12, శివమ్‌ దూబే (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు: 7; మొత్తం: 20 ఓవర్లలో 219/5; వికెట్ల పతనం: 1-10, 2-29, 3-95, 4-189, 5-213; బౌలింగ్‌: రజా 4-0-47-0, ముజరబాని 4-0-36-1, ఎన్‌గరవ 3-0-43-1, ఇవాన్స్‌ 4-0-44-1, న్యూమన్‌ 3-0-25-1, బెనెట్‌ 2-0-22-1.

జింబాబ్వే: బెనెట్‌ (సి) ఇషాన్‌ (బి) యష్‌ 32, బెన్‌ కర్రాన్‌ (సి) దూబే (బి) ప్రిన్స్‌ 1, మైర్స్‌ (బి) బిష్ణోయ్‌ 12, బర్ల్‌ (సి) రింకూ (బి) తిలక్‌ 20, రజా (సి) ఇషాన్‌ (బి) ప్రిన్స్‌ 0, మధెవెరె (సి) శ్రేయాస్‌ (బి) దూబే 2, తడివనషె (బి) యష్‌ 24; ఇవాన్స్‌ (బి) అభిషేక్‌ 19, న్యూమన్‌ (బి) అభిషేక్‌ 3, ఎన్‌గరవ (సి) రింకూ (బి) అభిషేక్‌ 1, ముజరబాని (నాటౌట్‌) 7; ఎక్స్‌ట్రాలు: 8; మొత్తం: 17.5 ఓవర్లలో 129 ఆలౌట్‌; వికెట్ల పతనం: 1-34, 2-34, 3-48, 4-49, 5-65, 6-82, 7-105, 8-119, 9-121, 10-129; బౌలింగ్‌: మయాంక్‌ 3-0-25-0, యష్‌ 4-0-30-2, ప్రిన్స్‌ 1.2-0-10-2, బిష్ణోయ్‌ 4-0-20-1, దూబే 1.4-0-13-1, తిలక్‌ 1-0-9-1, అభిషేక్‌ 2.5-0-17-3

1

ఒక క్యాలెండర్‌ ఏడాదిలో ఎక్కువసార్లు (9) 200+ స్కోర్లు సాధించిన జట్టుగా భారత్‌. 2024లోనూ టీమిండియా 9 సార్లు 200 స్కోరు దాటింది.

ఇవి కూడా చదవండి:

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 26 , 2026 | 03:51 AM