Share News

అఫ్గానిస్థాన్ క్రికెట్ ప్రోమో కలకలం.. భారత్ మ్యాప్‌పై చెలరేగిన వివాదం!

ABN , Publish Date - Sep 08 , 2026 | 09:37 PM

భారత్‌తో జరగనున్న టీ20 సిరీస్ కోసం అఫ్గానిస్థాన్ క్రికెట్ బోర్డు (ACB) ఓ ప్రచార వీడియోను రూపొందించింది. దీని కారణంగా పాకిస్థాన్, అఫ్గాన్ మధ్య కొత్త దౌత్యపరమైన వివాదానికి తెరలేచింది.

అఫ్గానిస్థాన్ క్రికెట్ ప్రోమో కలకలం.. భారత్ మ్యాప్‌పై చెలరేగిన వివాదం!
India Afghanistan T20 series 2026

స్పోర్ట్స్ డెస్క్: భారత్‌తో త్వరలో జరగనున్న టీ20 సిరీస్ కోసం ఆఫ్ఘనిస్థాన్ క్రికెట్ బోర్డు (ఏసీబీ) విడుదల చేసిన ప్రచార వీడియో సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. ఏసీబీ ఈ వీడియోలో ఇండియా మ్యాప్‌లో పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే), గిల్గిత్-బల్టిస్థాన్ ప్రాంతాలను భారత్‌లో భాగంగా చూపించింది. దీనిపై పాకిస్థాన్ నెటిజన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వీడియోలో దాదాపు 40వ సెకను వద్ద ప్రదర్శించిన గ్రాఫిక్‌లో ఈ వివాదాస్పద ప్రాంతాలు భారత సరిహద్దుల్లో స్పష్టంగా కనిపించాయి.


ఈ విషయంపై పాకిస్థాన్ విదేశాంగ శాఖ ఆందోళన వ్యక్తం చేసినట్లు తెలిసింది. అయితే ఇప్పటివరకు ఎలాంటి అధికారిక చర్యలకు దిగలేదు. ఇప్పటికే సరిహద్దు ఘర్షణలు, వైమానిక దాడులతో ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్రమవుతోన్న తరుణంలో ఈ తాజా వివాదం చర్చనీయాంశంగా మారింది. తమ దేశంలో జరుగుతోన్న దాడులకు తెహ్రిక్-ఎ-తాలిబన్ పాకిస్థాన్ (TTP) కారణమని పాకిస్థాన్ ఆరోపిస్తోంది. అలానే టీటీపీకీ అఫ్గాన్ తాలిబన్లు ఆశ్రయం కల్పిస్తున్నారని పాక్ ఆరోపిస్తోంది.


ఇది ఇలా ఉంటే. అఫ్గాన్, భారత్ మధ్య సెప్టెంబరు 13 నుంచి ఢిల్లీ వేదికగా మూడు టీ20ల సిరీస్ ప్రారంభంకానుంది. ఈ సిరీస్‌కు అఫ్గానిస్థాన్ ఆతిథ్య దేశంగా వ్యవహరిస్తోంది. అఫ్గాన్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు జరిగే పరిస్థితులు లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా విడుదల చేసిన ప్రోమోలో రెండు దేశాల మధ్య ఉన్న సుదీర్ఘ చరిత్ర, సంస్కృతి, క్రీడాభిమానాన్ని ఈ సిరీస్ పునరుద్ధరిస్తుందని ఏసీబీ పేర్కొంది.


టీ20 సిరీస్ షెడ్యూల్ (అరుణ్ జైట్లీ స్టేడియం):

సెప్టెంబరు 13: మొదటి టీ20, రాత్రి 7 గంటలకు

సెప్టెంబరు 15: రెండో టీ20, రాత్రి 7 గంటలకు

సెప్టెంబరు 17: మూడో టీ20, రాత్రి 7 గంటలకు

Updated Date - Sep 08 , 2026 | 09:52 PM