చెన్నై చిత్తు
ABN , Publish Date - Apr 27 , 2026 | 02:30 AM
ఓపెనర్ సాయి సుదర్శన్ (46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) అర్ధ శతకంతో అదరగొట్టగా, పేసర్ రబాడ (3/25) టాపార్డర్ పనిబట్టడంతో.. గుజరాత్ టైటాన్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. ఐపీఎల్‌లో...
దెబ్బతీసిన రబాడ
సత్తా చాటిన సుదర్శన్
గుజరాత్ అలవోక గెలుపు
చెన్నై: ఓపెనర్ సాయి సుదర్శన్ (46 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌లతో 87) అర్ధ శతకంతో అదరగొట్టగా, పేసర్ రబాడ (3/25) టాపార్డర్ పనిబట్టడంతో.. గుజరాత్ టైటాన్స్ మళ్లీ గెలుపుబాట పట్టింది. ఐపీఎల్‌లో ఆదివారం జరిగిన మ్యాచ్‌లో గుజరాత్ 8 వికెట్ల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే)ను చిత్తు చేసింది. తొలుత చెన్నై 20 ఓవర్లలో 158/7 స్కోరు చేసింది. రుతురాజ్ గైక్వాడ్ (74 నాటౌట్), శివం దూబే (22) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. అర్షద్ ఖాన్ రెండు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో గుజరాత్ 16.4 ఓవర్లలో 162/2 స్కోరు చేసి గెలిచింది. జోష్ బట్లర్ (39 నాటౌట్), శుభ్‌మన్ గిల్ (33) రాణించారు. అకీల్ హొస్సేన్, నూర్ అహ్మద్ చెరో వికెట్ దక్కించుకొన్నారు. రబాడ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
అలవోకగా..: సుదర్శన్‌తోపాటు టాపార్డర్ బ్యాటర్లు రాణించడంతో.. స్వల్ప లక్ష్యాన్ని గుజరాత్ సునాయాసంగా ఛేదించింది. ఓపెనర్లు సుదర్శన్, గిల్ తొలి వికెట్‌కు 58 పరుగుల భాగస్వామ్యంతో శుభారంభాన్ని అందించారు. అయితే, నూర్ బౌలింగ్‌లో గిల్ స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన బట్లర్‌తో కలసి సుదర్శన్ రెండో వికెట్‌కు 97 పరుగులు జోడించడంతో.. గుజరాత్ గెలుపు దిశగా దూసుకెళ్లింది. విజయానికి 4 పరుగులు కావాల్సి ఉండగా.. సుదర్శన్‌ను అకీల్ అవుట్ చేశాడు. కానీ, సిక్స్ బాదిన బట్లర్.. మరో 20 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు.
బ్యాటర్లు విఫలం..: జీవం ఉన్న పిచ్‌పై గుజరాత్ బౌలర్ల దెబ్బకు చెన్నై ఆరంభంలో విలవిల్లాడినా.. డెత్ ఓవర్లలో ఓపెనర్ రుతురాజ్ బ్యాట్ ఝుళిపించడంతో ఓ మాదిరి స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నై.. చక్కని బౌన్స్, వేగం ఉన్న పిచ్‌పై తడబడింది. మూడో ఓవర్‌లో ఓపెనర్ శాంసన్ (11), ఉర్విల్ పటేల్ (4)ను రబాడ అవుట్ చేయగా.. సర్ఫరాజ్ (0)ను సిరాజ్ డకౌట్ చేశాడు. డెవాల్డ్ బ్రెవిస్ (2)ను మానవ్ స్వల్ప స్కోరుకే అవుట్ చేయడంతో చెన్నై 37/4తో పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ దశలో దూబే, రుతురాజ్ ఐదో వికెట్‌కు 59 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొనే ప్రయత్నం చేశారు. స్కోరు వేగం పుంజుకొంటున్న సమయంలో దూబేను అర్షద్ బౌల్డ్ చేశాడు. కానీ, డెత్ ఓవర్లలో దూకుడు పెంచిన గైక్వాడ్.. కార్తీక్ శర్మ (15), ఓవర్టన్ (18) అండతో జట్టును స్కోరును 150 మార్క్ దాటించాడు.
స్కోరుబోర్డు
చెన్నై: శాంసన్ (సి) బట్లర్ (బి) రబాడ 11, గైక్వాడ్ (నాటౌట్) 74, ఉర్విల్ పటేల్ (సి) హోల్డర్ (బి) రబాడ 4, సర్ఫరాజ్ (సి) బట్లర్ (బి) సిరాజ్ 0, బ్రెవిస్ (సి) గిల్ (బి) సుతార్ 2, దూబే (బి) అర్షద్ 22, కార్తీక్ (సి) హోల్డర్ (బి) రబాడ 15, ఓవర్టన్ (సి) షారుక్ (బి) అర్షద్ 18, అకీల్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు: 12; మొత్తం: 20 ఓవర్లలో 158/7; వికెట్ల పతనం: 1-21, 2-25, 3-26, 4-37, 5-96, 6-122, 7-143; బౌలింగ్: సిరాజ్ 4-0-23-1, రబాడ 4-0- 25-3, సుతార్ 3-0-22-1, హోల్డర్ 4-0-22- 0, అర్షద్ 4-0-43-2, రషీద్ 1-0-21-0.
గుజరాత్: సుదర్శన్ (సి) బ్రెవిస్ (బి) అకీల్ 87, గిల్ (స్టంప్డ్) సంజూ (బి) నూర్ 33, బట్లర్ (నాటౌట్) 39, సుందర్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు: 2; మొత్తం: 16.4 ఓవర్లలో 162/2; వికెట్ల పతనం: 1-58, 2-155; బౌలింగ్: అకీల్ హొస్సేన్ 3.4-0-46-1, అన్షుల్ 3-0-16-0, ఓవర్టన్ 2-0-28-0, గుర్జన్‌ప్రీత్ 3-0-36-0, నూర్ 4-0-29-1, దూబే 1-0-7-0.
ఇవి కూడా చదవండి:
అభిషేక్ శర్మ చేతిని లాగిన లేడీ ఫ్యాన్.. వీడియో వైరల్