బుమ్రా.. ఇక వన్డేల్లోనే?
ABN , Publish Date - Mar 11 , 2026 | 03:36 AM
టీ20 వరల్డ్‌క్‌పను వరుసగా రెండోసారి దక్కించుకోవడంలో భారత స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రాది కీలక పాత్ర. ఇక వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరులో వన్డే వరల్డ్‌కప్ జరుగబోతోంది. 2011 తర్వాత...
పని ఒత్తిడే కారణం
వరల్డ్‌కప్‌పై దృష్టి
న్యూఢిల్లీ: టీ20 వరల్డ్‌క్‌పను వరుసగా రెండోసారి దక్కించుకోవడంలో భారత స్టార్ పేసర్ జస్ర్పీత్ బుమ్రాది కీలక పాత్ర. ఇక వచ్చే ఏడాది అక్టోబరు-నవంబరులో వన్డే వరల్డ్‌కప్ జరుగబోతోంది. 2011 తర్వాత టీమిండియా ఆ మెగా టోర్నీని అందుకోలేకపోయింది. ఈనేపథ్యంలో జట్టుకు ప్రధాన బలంగా ఉన్న బుమ్రాపై పనిఒత్తిడి పడకూడదన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. ఇందుకోసం వచ్చే 18 నెలల పాటు బుమ్రాను టీ20 మ్యాచ్‌ల్లో కాకుండా ఎక్కువగా వన్డేల్లోనే ఆడించాలనుకుంటోంది. అయితే ఐపీఎల్‌లో తను ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగడం ఖాయమే. ఆ లీగ్ ముగిశాక భారత్ తమ ప్రపంచకప్ సన్నాహకాలను ఆరంభించనుంది. మరోవైపు ఐపీఎల్ ముగిసే సమయానికి సెలెక్షన్ కమిటీ, కోచ్ గంభీర్, కెప్టెన్ గిల్, సెంటర్ ఆఫ్ ఎక్సెలెన్సీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలో జట్టు వరల్డ్‌కప్ ప్రణాళికల గురించి బ్లూప్రింట్ సిద్ధం చేయనున్నారు. ఇందులో బుమ్రాపై వర్క్‌లోడ్ పడకుండా చూడడమే ప్రముఖంగా ఉండనుంది. ‘ఐసీసీ టోర్నీల్లో బుమ్రా ఫిట్‌నెస్ జట్టుకు అత్యంత కీలకం. అందుకే అతడిని తాజాగా ఉంచేందుకు టీమ్ మేనేజ్‌మెంట్ ప్రయత్నిస్తుంటుంది. టెస్టుల్లో తను ప్రధాన బౌలర్‌గా ఆడే అవకాశం ఉన్నా.. టీ20లను తగ్గించి వన్డేలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది’ అని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. మెగా టోర్నీ ఆరంభ సమయానికి భారత్ 35 వరకు వన్డేలు ఆడబోతోంది. ఇక 2027, అక్టోబరు లోపు టీ20లకు తక్కువ ప్రాధాన్యతే ఉంటుంది. ఆసియా గేమ్స్, లాస్‌ఏంజిల్స్ ఒలింపిక్స్‌లో పొట్టి ఫార్మాట్‌లోనే క్రికెట్ ఆడనున్నప్పటికీ అందులో సీనియర్లను కాకుండా ద్వితీయ శ్రేణి జట్టునే పంపే అవకాశం ఉంది.