రేప్ కేసులో క్రికెటర్ పోరెల్ అరెస్ట్
ABN , Publish Date - Aug 12 , 2026 | 05:18 AM
లైంగిక వేధింపుల కేసులో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించే 23 ఏళ్ల పోరెల్‌పై...
కోల్‌కతా: లైంగిక వేధింపుల కేసులో బెంగాల్ క్రికెటర్ అభిషేక్ పోరెల్‌ను స్థానిక పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించే 23 ఏళ్ల పోరెల్‌పై జూన్‌లోనే కర్ణాటకకు చెందిన వైద్య విద్యార్ధిని ఫిర్యాదు చేసింది. మూడేళ్లుగా తామిద్దరం రిలేషన్‌షి్‌పలో ఉన్నట్టు, పెళ్లి పేరుతో లైంగికంగా వాడుకుని ముఖం చాటేయడంతో పాటు బెదిరింపులకు దిగాడని హుగ్లీ లోని మోగ్రా పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొంది. అలాగే అక్రమంగా నిర్బంధించి ఆహారం ఇవ్వకుండా ఒంటరిగా ఉంచాడని, దీంతో బలహీనపడి నడవలేని స్థితికి చేరినట్టు ఆవేదన చెందింది. ఇదే విషయమై న్యాయం చేయాలని ఆమె కలకత్తా హైకోర్టును ఆశ్రయించగా, వెంటనే క్రికెటర్‌ను అరెస్ట్ చేయాలని కోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో హుగ్లీ పోలీసులు సోమవారం రాత్రి అభిషేక్‌ను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపర్చారు.
ఎవరీ పోరెల్?
వికెట్ కీపర్ అభిషేక్ పోరెల్ 2023 నుంచి ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఆడుతున్నాడు. 35 మ్యాచ్‌ల్లో 765 పరుగులు చేసిన తను డీసీ తరఫున కీలక బ్యాటర్‌గా రాణిస్తున్నాడు. ఇక స్వరాష్ట్రం బెంగాల్ తరఫున 2021-22 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్ అరంగేట్రం చేసిన పోరెల్, 23 లిస్ట్ ‘ఎ’ మ్యాచ్‌లు ఆడాడు. గతంలో భారత్ ‘ఎ’ తరఫున ఇంగ్లండ్, ఆసీస్ పర్యటనకు వెళ్లాడు.