Share News

పతక బోణీ

ABN , Publish Date - Jul 26 , 2026 | 03:59 AM

కామన్వెల్త్‌ క్రీడల మూడోరోజు భారత్‌ పతక బోణీ చేసింది. పారా పవర్‌ లిఫ్టింగ్‌లో ఝండు కుమార్‌ కాంస్యం సాధించి భారత్‌ను పాయింట్ల పట్టికలోకి చేర్చాడు. కాగా, మహిళల బాక్సింగ్‌లో...

పతక బోణీ

నేటి భారత షెడ్యూల్‌

లాన్‌బౌల్స్‌: మహిళల పెయిర్స్‌- రూపారాణి, పింకీ

(మ. 1); పురుషుల సింగిల్స్‌- పుతుల్‌ (రా.7.15).

వెయిట్‌లిఫ్టింగ్‌: పురుషుల 60 కిలోలు- రిషికాంత సింగ్‌ (మ. 2.15), మహిళల 48 కిలోలు- మీరాబాయి చాను

(సా. 6.45), పురుషుల 65 కిలోలు- రాజ (రా. 11.15).

జిమ్నాస్టిక్స్‌: పురుషుల ఆల్‌రౌండ్‌ ఫైనల్‌ - యోగేశ్వర్‌, తపన్‌ (సా. 4.30).

బాక్సింగ్‌ (ప్రీక్వార్టర్స్‌): మహిళల 54 కిలోలు - ప్రీతి (రా. 10.45), పురుషుల 55 కిలోలు - జాదూమణి సింగ్‌

(రా. 11.45), 65 కిలోలు - ఆదిత్య (రా. 12.45).

స్విమ్మింగ్‌: పురుషుల 4 గీ 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలే హీట్స్‌- శ్రీహరి నటరాజ్‌, ఆర్యన్‌, అనీష్‌, దక్షణ్‌ (సా. 4.30).

పారా లిఫ్టింగ్‌లో ఝండూ

కుమార్‌కు కాంస్యం

కామన్వెల్త్‌ క్రీడలు

గ్లాస్గో: కామన్వెల్త్‌ క్రీడల మూడోరోజు భారత్‌ పతక బోణీ చేసింది. పారా పవర్‌ లిఫ్టింగ్‌లో ఝండు కుమార్‌ కాంస్యం సాధించి భారత్‌ను పాయింట్ల పట్టికలోకి చేర్చాడు. కాగా, మహిళల బాక్సింగ్‌లో లవ్లీనా బోర్గొహెయిన్‌ (75 కిలోలు)కు ఒక్క బౌట్‌ కూడా ఆడకుండానే సెమీఫైనల్‌కు బై లభించడంతో భారత్‌కుఇదివరకే ఓ పతకం ఖరారైన సంగతి తెలిసిందే. శనివారం జరిగిన పోటీలలో పురుషుల హెవీ వెయిట్‌ విభాగంలో బిహార్‌కు చెందిన ఝండూ కుమార్‌ మొత్తం 130.9 పాయింట్లతో మూడోస్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నాడు. తొలి రెండు ప్రయత్నాల్లో వరుసగా 181, 190 కిలోలు ఎత్తిన ఝండూ..మూడో యత్నంలో 196 కిలోలు లిఫ్ట్‌ చేయడంలో విఫలమయ్యాడు. నైజీరియాకు చెందిన ఇద్రిస్‌ రిలువన్‌ (132.8 పాయింట్లు) స్వర్ణం, ఇంగ్లండ్‌ లిఫ్టర్‌ మాథ్యూ హార్డింగ్‌ (131) రజతం అందుకున్నారు. మరో భారత లిఫ్టర్‌ సుధీర్‌ (114.1) ఆరో స్థానంలో నిలిచాడు.

లాన్‌బౌల్స్‌లో రూప ద్వయం హ్యాట్రిక్‌: మహిళల లాన్‌బౌల్స్‌ పెయిర్స్‌ విభాగం సెక్షన్‌-బిలో భారత ద్వయం రూపారాణి, పింకీసింగ్‌ టై బ్రేకర్‌లో 2-0తో టోంగా జోడీ బేకర్‌, మిల్కాను ఓడించి హ్యాట్రిక్‌ విజయాన్ని నమోదు చేసింది. దాంతో రూప జంట గ్రూప్‌లో అగ్రస్థానాన్ని పటిష్టం చేసుకొని సెమీస్‌కు చేరువైంది. పురుషుల లాన్‌బౌల్స్‌ సింగిల్స్‌ సెక్షన్‌-డి మూడో రౌండ్‌లో పుతుల్‌ సోనోవాల్‌ 0-2తో ఇజ్జత్‌ షమీర్‌ (మలేసియా) చేతిలో ఓడాడు.

జిమ్నాస్టిక్స్‌లో మహిళల జట్టుకు నిరాశ: మహిళల టీమ్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌లో తెలుగమ్మాయి నిష్కా అగర్వాల్‌, ప్రణతి నాయక్‌, సమంత, ఇషితా రేవాలేతో కూడిన భారత జట్టు పతక రేసు నుంచి నిష్క్రమించింది. క్వాలిఫికేషన్‌ సబ్‌ డివిజన్‌-3లో పోటీ పడిన మన జట్టు మొత్తం 123 పాయింట్లతో ఐదో స్థానంలో నిలిచింది. కాగా.. తపన్‌ మొహంతి, యోగేశ్వర్‌ ఆర్టిస్టిక్‌ జిమ్నాస్టిక్స్‌ పురుషుల ఆల్‌రౌండ్‌ ఫైనల్స్‌కు అర్హత సాధించారు. మొహంతి 71.700 పాయింట్లతో 17వ, యోగేశ్వర్‌ 71.400 పాయింట్లతో 18వ స్థానంలో నిలిచారు. 24మంది జిమ్నా్‌స్టలు ఫైనల్లో తలపడతారు.


బాస్కెట్‌బాల్‌లో ఓటమి: వీల్‌చైర్‌ మహిళల 3గీ3 బాస్కెట్‌బాల్‌ గ్రూప్‌-బి పోరులో భారత మహిళలు 1-16తో వేల్స్‌ చేతిలో ఓడిపోయారు. స్విమ్మింగ్‌లో పురుషుల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌ హీట్స్‌లో దక్షణ్‌ కుమార్‌ 15వ, ఆర్యన్‌ 16వ స్థానాల్లో నిలిచి ఫైనల్స్‌కు ముందే నిష్క్రమించారు.

ప్రీక్వార్టర్స్‌కు సచిన్‌

కామన్వెల్త్‌ క్రీడల బాక్సింగ్‌లో భారత ఆటగాడు సచిన్‌ సివాచ్‌ పతకానికి చేరువయ్యాడు. పురుషుల 60 కిలోల విభాగం రౌండ్‌-32 బౌట్‌లో సివాచ్‌ 4-1తో కెమా అలీ (కెనడా)పై గెలిచి ప్రీక్వార్టర్స్‌ చేరాడు.

19 పతకాలతో చరిత్ర

దక్షిణాఫ్రికా స్విమ్మర్‌ చాడ్లె లె క్లోజ్‌ కామన్వెల్త్‌లో అత్యధిక పతకాలు సాధించిన అథ్లెట్‌గా సరికొత్త చరిత్ర లిఖించాడు. పురుషుల 4గీ 100 మీటర్ల ఫ్రీస్టయిల్‌ రిలేలో క్లోజ్‌ కాంస్యం దక్కించుకొన్నాడు. దీంతో ఈ టోర్నీలో అత్యధికంగా 19 పతకాలు నెగ్గిన అథ్లెట్‌గా రికార్డుల కెక్కాడు. ఆస్ట్రేలియా షూటర్‌ ఫిల్‌ ఆడమ్స్‌, ఇంగ్లండ్‌ షూటర్‌ మిక్‌ గాల్డ్‌ల 18 పతకాల రికార్డును క్లోజ్‌ అధిగమించాడు.

ఇవి కూడా చదవండి:

భారత్‌తో రెండో టీ20: టాస్ నెగ్గిన జింబాబ్వే

వైభవ్ సూర్యవంశీకి బౌలింగ్‌లో కూడా శిక్షణ.. కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు

Updated Date - Jul 26 , 2026 | 03:59 AM