Share News

అథ్లెట్ల జోరు పతక హోరు!

ABN , Publish Date - Sep 28 , 2026 | 05:49 AM

అథ్లెటిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగించినా.. స్వర్ణం మాత్రం అందినట్టే అంది.. చేజారింది. హై జంప్‌లో సర్వేశ్‌, లాంగ్‌ జంప్‌లో అన్సీ సోజన్‌ త్రుటిలో పసిడి పతకాలను కోల్పోగా.. స్క్వాష్‌ సింగిల్స్‌లో....

అథ్లెట్ల జోరు పతక హోరు!

ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌లో ఐదు.. స్క్వాష్‌లో రెండు పతకాలు

  • త్రుటిలో పసిడి చేజార్చుకొన్న సర్వేశ్‌, అన్సీ

  • అభయ్‌, అనాహత్‌కు రజతాలు

అథ్లెటిక్స్‌లో భారత్‌ జోరు కొనసాగించినా.. స్వర్ణం మాత్రం అందినట్టే అంది.. చేజారింది. హై జంప్‌లో సర్వేశ్‌, లాంగ్‌ జంప్‌లో అన్సీ సోజన్‌ త్రుటిలో పసిడి పతకాలను కోల్పోగా.. స్క్వాష్‌ సింగిల్స్‌లో రజతాలకే పరిమితమైన అభయ్‌, అనాహత్‌లు ఒలింపిక్‌ బెర్త్‌లను మిస్‌ చేసుకొన్నారు. పారుల్‌, తేజిస్విన్‌, హరిత కంచుమోత మోగించారు. ఒక్కరోజే అథ్లెట్లు ఐదు పతకాలు అందించారు.

నగోయ: ఆసియాడ్‌ ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌ స్వర్ణం భారత్‌ను ఊరిస్తూనే ఉంది. ఆదివారం జరిగిన ఈవెంట్లలో జంపర్లు సర్వేశ్‌ కుషారే, అన్సీ సోజన్‌ పసిడి ఖాయమనుకున్న తరుణంలో రజతాలతో సరిపెట్టుకొన్నారు. స్క్వాష్‌లో చరిత్ర సృష్టిస్తారని భావించిన అభయ్‌, అనహత్‌ సింగ్‌ ఫైనల్లో ఓటములు చవిచూడగా.. హెప్టాథ్లాన్‌లో తేజస్విని శంకర్‌, స్టీఫుల్‌ చేజ్‌లో పారుల్‌ చౌదరి, 200 మీ. రేస్‌లో హరిత భద్ర కాంస్యాలు సాధించారు. మొత్తంగా క్రీడలకు ఎనిమిదో రోజు భారత్‌ నాలుగు రజతాలు సహా ఏడు పతకాలు సొంతం చేసుకొంది. బాక్సర్లు నరేందర్‌, పర్వీన్‌ హుడా, అంకుష్‌ సెమీస్‌ చేరి పతకాలు ఖాయం చేసుకొన్నారు.


అయ్యో.. సర్వేశ్‌!

పురుషుల హై జంప్‌లో సర్వేశ్‌ కొద్దిలో స్వర్ణం చేజార్చుకొన్నా.. 56 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో భారత్‌కు పతకం అందించాడు. ఒక దశలో అగ్రస్థానంలో కొనసాగిన సర్వేశ్‌.. తొలి ప్రయత్నంలో 2.25 మీటర్ల ఎత్తు దూకడంలో విఫలం కావడంతో రెండో స్థానానికి పడిపోయాడు. చైనీస్‌ తైపీ జంపర్‌ చావ్‌ సువాన్‌ ఫు కూడా అత్యుత్తమంగా 2.25 మీటర్లే దూకి సర్వేశ్‌తో సమంగా నిలిచాడు. కానీ, అతడు తొలి ప్రయత్నంలోనే ఈ మార్క్‌ను అందుకోవడంతో.. స్వర్ణం సువాన్‌ సొంతమైంది. ఆఖరి ప్రయత్నంలో సర్వేశ్‌, సువాన్‌ 2.28 మీటర్లు దూకేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. కొరియా అథ్లెట్‌ సంగ్‌యోక్‌ వు (2.22 మీ.) కాంస్యం దక్కించుకొన్నాడు.

2 సెం.మీ. దూరంతో..

లాంగ్‌ జంపర్‌ అన్సీ సోజన్‌ కేవలం 2 సెం.మీ. దూరంలో స్వర్ణాన్ని కోల్పోయింది. ఫైనల్లో ఐదో ప్రయత్నంలో సోజన్‌ అత్యుత్తమంగా 6.53 మీటర్ల దూరం లంఘించింది. అయితే, చివరి ప్రయత్నంలో చైనా అథ్లెట్‌ హుయాంగ్‌ యిగ్యింగ్‌ 6.55 మీ. దూకి పసిడిని ఎగరేసుకుపోగా.. అన్సీ రజతంతో సరిపెట్టుకొంది. చైనాకే చెందిన మెంగ్యీ టాన్‌ 6.49 మీ. దూకి కాంస్యం సాధించింది. మరో భారత జంపర్‌ షైలీ సింగ్‌ 6.42 మీ. దూకి నాలుగో స్థానంలో నిలిచింది.

మెరిసిన హరిత...

మహిళల 200 మీటర్ల రేసులో హరిత భద్ర కాంస్యంతో సత్తాచాటింది. ఫైనల్లో హరిత 23.30 సెకన్ల టైమింగ్‌లో మూడో స్థానంలో నిలిచింది. ఉన్నతి అయ్యప్ప (23.46 సె) ఆరో స్థానం దక్కించుకొంది. సింగపూర్‌ రేసర్‌ శాంతి పెరీరా (22.78 సె) స్వర్ణం, చైనా రేసర్‌ యూజీ చెన్‌ (22.93 సె) రజతం సొంతం చేసుకొన్నారు. మహిళల 3000 మీ. స్టీపుల్‌ చేజ్‌లో కాంస్యం దక్కించుకొన్న పారుల్‌ 9 నిమిషాల 8.67 సెకన్ల టైమింగ్‌తో తన జాతీయ రికార్డును తానే సవరించుకొంది. డెకాథ్లాన్‌లో తేజస్విన్‌ శంకర్‌ 7934 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కంచు పతకం సాధించాడు.

12-sports.jpg

ఒలింపిక్‌ బెర్త్‌లు మిస్‌..

స్క్వాష్‌లో స్వర్ణ పతకాలు ఖాయంగా తెస్తారనుకున్న మన ప్లేయర్లు నిరాశపరిచారు. సంచలన రీతిలో స్క్వాష్‌ సింగిల్స్‌ ఫైనల్‌ చేరిన అభయ్‌, అనాహత్‌ సింగ్‌లు అదే జోరును కొనసాగించలేక రజతాలకే పరిమితమయ్యారు. పురుషుల ఫైనల్లో అభయ్‌ 0-3 (9-11, 5-11, 5-11)తో డిఫెండింగ్‌ చాంప్‌ ఇయాన్‌ (మలేసియా) చేతిలో చిత్తయ్యాడు. మహిళల తుది పోరులో అనాహత్‌ 0-3 (4-11, 4-11, 7-11)తో డిఫెండింగ్‌ చాంప్‌ శివసంగరి (మలేసియా) చేతిలో పరాజయం పాలైంది. ఈ ఓటములతో అభయ్‌, అనాహత్‌లు 2028 ఒలింపిక్స్‌కు నేరుగా అర్హత సాధించే చాన్స్‌ని చేజార్చుకొన్నారు.

13-sports.jpg

ఇవి కూడా చదవండి:

అభయ్ సింగ్‌కు రూ.50 లక్షల నజరానా.. ప్రకటించిన సీఎం విజయ్

Updated Date - Sep 28 , 2026 | 05:50 AM