అడుగేస్తే అద్భుతమే..
ABN , Publish Date - Jul 17 , 2026 | 05:17 AM
వివాదాస్పద ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ లేదు.. పక్షపాత వైఖరి అంటూ గగ్గోలు పెడుతున్న వారికి కించిత్ అవకాశం కూడా ఇవ్వలేదు. అంతా మెస్సీ మాయ.. అలుపెరుగని పోరాటమే...
2-1తో ఇంగ్లండ్‌పై గెలుపు
స్పెయిన్‌తో అమీతుమీకి సై
ఫైనల్లో అర్జెంటీనా
వివాదాస్పద ‘హ్యాండ్ ఆఫ్ గాడ్’ గోల్ లేదు.. పక్షపాత వైఖరి అంటూ గగ్గోలు పెడుతున్న వారికి కించిత్ అవకాశం కూడా ఇవ్వలేదు. అంతా మెస్సీ మాయ.. అలుపెరుగని పోరాటమే డిఫెండింగ్ చాంప్ అర్జెంటీనాను వరుసగా రెండో వరల్డ్‌కప్ టైటిల్‌కు అడుగుదూరంలో నిలబెట్టింది. అంతేకాదు తనకు అనుకూలంగా రెఫరీ నిర్ణయాలు అంటూ చేస్తున్న విమర్శలకు మెస్సీ తన ‘బూటు’తోనే సమాధానం చెప్పాడు.
అట్లాంటా: ఇది ఆటకాదు.. సమరం అన్నట్టుగా బుధవారం రాత్రి జరిగిన హైవోల్టేజ్ సెమీఫైనల్లో అర్జెంటీనా 2-1తో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. ఆటలో 85 నిమిషాల వరకు 0-1తో వెనుకబడినా.. 7 నిమిషాల వ్యవధిలో రెండు మెరుపు గోల్స్‌కు బాటలు వేసిన మెస్సీ.. ఓటమి తప్పదనుకొన్న మ్యాచ్‌లో జట్టుకు థ్రిల్లింగ్ విజయాన్ని అందించాడు. ఎంజో ఫెర్నాండెజ్ (85వ నిమిషం), లాటరో మార్టినెజ్ (90+2వ) చెరో గోల్‌తో ఇంగ్లండ్‌కు షాకిచ్చారు. ఆధిక్యం సాధించిన తర్వాత ఇంగ్లండ్ దాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించగా.. పోరాడితే పోయేదేమీ లేదన్నట్టుగా ఆడిన అర్జెంటీనా చిరస్మరణీయ విజయంతో ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఆదివారం రాత్రి జరిగే టైటిల్ ఫైట్‌లో స్పెయిన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. కాగా, సెమీ్‌సలో ఓడిన ఇంగ్లండ్.. శనివారం రాత్రి జరిగే కాంస్య పోరులో ఫ్రాన్స్‌తో తలపడనుంది.
థ్రిల్లింగ్ ఫైట్..
ఆటకంటే భావోద్వేగాలే ఈ మ్యాచ్‌లో ఎక్కువగా కనిపించాయి. ఆరంభం నుంచే ప్లేయర్లు నెట్టుకోవడం, వాగ్వాదానికి దిగడంతో వాతావరణం హాట్‌హాట్‌గా మారింది. అయితే, ఫస్టాఫ్ పేలవంగా సాగింది. తొలి 30 నిమిషాల్లో ఒక్కసారిగా కూడా ఇరుజట్ల గోల్ పోస్టులపై ఒక్కదాడి కూడా జరగలేదు. అయితే, 33వ నిమిషంలో ఇంగ్లండ్ మొదటిసారి ప్రత్యర్థి డిఫెన్స్‌ను ఛేదించే ప్రయత్నం చేసింది. రైస్ క్రాస్‌ను స్టోన్ తలతో కొట్టే ప్రయత్నం చేయగా.. అది బయటకు పోయింది. అనంతరం గోర్డాన్ ప్రయత్నాన్ని అర్జెంటీనా తిప్పికొట్టింది. ఆ తర్వాత మెస్సీ సేన ప్రత్యర్థి గోల్ పోస్టుపై దాడి చేసింది. అయితే, మెస్సీని అండర్సన్ అభ్యంతరకరంగా అడ్డుకోవడంతో 39వ నిమిషంలో అర్జెంటీనాకు ఫ్రీకిక్ లభించింది. కానీ, ఫెర్నాండెజ్ దాన్ని బయటకు కొట్టాడు. దీంతో ఫస్టాఫ్ గోల్ లెస్‌గా ముగిసింది. సెకండాఫ్ మొదలైన వెంటనే మెస్సీ, అల్వరెజ్ వేగంగా కదులుతూ ప్రత్యర్థి శిబిరంలో కలకలం సృష్టించాడు. ఇక 55వ నిమిషంలో ఆంథోనీ గోర్డాన్ గోల్‌తో ఇంగ్లండ్ ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అర్జెంటీనా పెనాల్టీ ఏరియాలో రోజర్స్ పాస్‌ను గోర్డాన్ గోల్‌లోకి పంపాడు. 65వ నిమిషంలో సబ్‌స్టిట్యూట్‌గా వచ్చిన గోంజాలెజ్ చక్కని అవకాశాన్ని సృష్టించినా.. ఇంగ్లండ్ అడ్డుకొంది. కానీ, వాటర్ బ్రేక్ తర్వాత సబ్‌స్టిట్యూట్‌లుగా అటాకింగ్ ప్లేయర్లను బరిలోకి దించిన అర్జెంటీనా..
ఉధృతంగా దాడులు చేస్తూ ఇంగ్లండ్ డిఫెన్స్‌ను ఒత్తిడిలోకి నెట్టింది. ఈ క్రమంలో 85వ నిమిషంలో తగిన ఫలం దక్కింది. బాక్స్ బయట మెస్సీ పాస్‌ను అందుకొన్న ఫెర్నాండెజ్.. 25 గజాల దూరం నుంచి కొట్టిన కిక్ సుడులు తిరుగుతూ వెళ్లి గోల్‌లో పడడంతో అర్జెంటీనా 1-1తో సమం చేసింది. విస్తుపోయిన కేన్ సేన తేరుకోకముందే.. స్టాపేజ్ టైమ్‌లో మెస్సీ క్రాస్‌ను మార్టినెజ్ హెడర్‌తో గోల్‌లోకి కొట్టి.. ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు.

మిన్నంటిన సంబరాలు
బ్యూనస్ ఎయిర్స్: ఫిఫా వరల్డ్‌కప్‌లో వరుసగా రెండోసారి ఫైనల్లో ప్రవేశించడంతో అర్జెంటీనా అభిమానుల సంబరాలు మిన్నంటాయి. ముఖ్యంగా చిరకాల శత్రువు ఇంగ్లండ్‌పై ఈ అద్భుత విజయం లభించడంతో వారి ఆనందానికి హద్దుల్లేకుండా పోయింది. వేలాదిమంది వీధుల్లోకి వచ్చి తమ జాతీయ పతాకాలను చేతబూని కేరింతలు కొట్టారు. ఎటు చూసినా కోలాహలంగా కనిపించడంతో పాటు, భావోద్వేగ వాతావరణం నెలకొంది. అలాగే బాణసంచా వెలుగులతో రాజధాని నగరం జిగేల్‌మంది. ‘ఈ సంబరాలు కేవలం ఫుట్‌బాల్ మ్యాచ్ విజయం కోసమే కాదు. మా హృదయాలను భగ్నం చేసిన దేశాన్ని ఓడించినందుకు’ అంటూ ఓ అభిమాని ఉద్వేగంతో స్పందించాడు. మరోవైపు కొందరు అభిమానులు ఇంగ్లండ్ జాతీయ పతాకాలను దహనం చేయడంతో పాటు శవపేటికలను వాటితో కప్పి వీధుల్లో ఊరేగించడం కనిపించింది.

మైదానంలో వివాదాస్పద బ్యానర్
అట్లాంటా: అర్జెంటీనా జట్టు వివాదంలో చిక్కుకుంది. సెమీ్‌సలో ఇంగ్లండ్‌పై గెలిచాక ఆ జట్టు ఆటగాళ్లు ఫాక్‌లాండ్స్ దీవులకు మద్దతుగా ‘లాస్ మాల్వినాస్ సన్ అర్జెంటీనాస్’ అని రాసి ఉన్న బ్యానర్‌ను ప్రదర్శించారు. అర్జెంటీనాకే లాస్ మాల్వినాస్ (ఫాక్‌లాండ్స్) దీవులు అని అర్థం వచ్చేలా ఉన్న ఆ బ్యానర్ వివాదానికి దారి తీసింది. అట్లాంటిక్ సముద్రంలోని ఈ దీవు లు బ్రిటన్ అధీనంలో ఉన్నాయి. అయితే ఆ దీవులు తమ దేశానికే చెందుతాయని దశాబ్దాల నుంచి అర్జెంటీనా పోరాడుతోంది. దీనికోసం 1982లో ఇరుదేశాల మధ్య యుద్ధం కూడా జరిగింది. వాస్తవానికి ఫిఫా టోర్నీల్లో రాజకీయ, వ్యక్తి గతమైన, మతపరమైన ప్రకటనలు, నిరసనలు నిషేధం. దీంతో ఈ సంఘటనపై త్వరలోనే అర్జెంటీనాపై క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశం ఉంది.
ఈ వార్తలనూ చదవండి:
న్యూజిలాండ్‌లో 6.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ..
ట్రంప్‌ను అంతం చేస్తాం.. ఇరాన్‌లో హోర్డింగ్‌పై హెచ్చరిక