Share News

సింగపూర్‌లో వద్దిపర్తి పద్మాకర్ భాగవత సప్తాహం

ABN , Publish Date - May 07 , 2026 | 09:43 PM

మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పరమార్థ సింగపూర్‌లో 2026 ఏప్రిల్ 18 నుండి 24 వరకు 409వ భాగవత సప్తాహాన్ని ఘనంగా నిర్వహించారు.

సింగపూర్‌లో వద్దిపర్తి పద్మాకర్ భాగవత సప్తాహం
Vaddiparthi Padmakar Bhagavatha Sapthaham

శ్రీ ప్రణవపీఠాధీశులు, అభినవశుక, ప్రవచననిధి, త్రిభాషా మహాసహస్రావధాని బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ పరమార్థ, క్రాఫ్ట్ వోయేజెస్ సంస్థల ఆహ్వానం మేరకు సింగపూర్ విచ్చేసి, 2026 ఏప్రిల్ 18 నుండి 24 వరకు 409వ భాగవత సప్తాహాన్ని ఘనంగా నిర్వహించారు.

అష్టాదశ పురాణాలలో మకుటాయమానమైన శ్రీమద్భాగవతం, వేదవ్యాస మహర్షి రచించిన 18,000 శ్లోకాలతో, 12 స్కంధాలతో కూడిన మహాగ్రంథం. వేదమనే కల్పవృక్షం నుండి పండిన ఫలంగా దీనిని వర్ణిస్తారు. యోగేశ్వరుడైన శ్రీకృష్ణుని స్వరూపమే భాగవతమని, ‘కృష్ణుడే భాగవతం.. భాగవతమే కృష్ణుడు’ అని పెద్దలు పేర్కొంటారు. భాగవత మహిమను అన్ని పురాణాలు కొనియాడాయి. ‘భాగవతం వినగానే బాగవుతాం’ అనే ఆర్యోక్తి ప్రసిద్ధి.

సప్తాహం అనగా ఏడు రోజులపాటు దీక్షతో ఋత్వికులు, పండితులు పాల్గొన్న వారి గోత్రనామాలతో భాగవత పారాయణం నిర్వహించడం. ప్రతిరోజూ గురువుగారి ప్రవచనాలు భక్తులను ఆధ్యాత్మికానందంలో ముంచెత్తాయి. సప్తాహంలో భాగంగా రుక్మిణీ కళ్యాణం, లక్ష్మీనారాయణ హోమం వంటి వైభవోపేత కార్యక్రమాలు కూడా జరిగాయి. చివరి రోజున సప్తాహ ఫలితాన్ని పాల్గొన్న వారికి సమర్పించారు.

Sapthaham.jpg


ఇప్పటివరకూ శుకస్థల్, కాశీ, అయోధ్య, మధుర, బృందావనం వంటి సప్తమోక్షపురాలతో పాటు అమెరికా, దుబాయి, ఇంగ్లాండ్, స్విట్జర్లాండ్, నెదర్లాండ్స్, జర్మనీ, డెన్మార్క్ తదితర దేశాల్లో 408 సార్లు భాగవత సప్తాహాలు నిర్వహించిన ధార్మిక వరేణ్యులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్.. 409వ సప్తాహాన్ని సింగపూర్‌లో ప్రప్రథమంగా నిర్వహించడం విశేషం. ఈ సందర్భంగా అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వచ్చి ప్రవచనాలు విని, ఆశీస్సులు అందుకొని భక్తిభావంతో పులకించిపోయారు.

ఈ సప్తాహంలో భాగంగా అక్షయ తృతీయ నాడు (మూడవ రోజు), భగవద్కృపా గురుకటాక్షాలతో శ్రీ ప్రణవపీఠం శిష్యబృందం ద్వారా గురువుగారు అష్టాదశ పురాణాల నుండి సంకలనం చేసిన 100 స్తోత్రాల గ్రంథం “స్తోత్ర పద్మాకరము”, అలాగే స్నిగ్ధ ఆకుండి రచించిన “అర్జున అండ్ అభిరామి – ద సెలెస్టియల్ థెఫ్ట్” పుస్తకాలను అమృతహస్తాలతో ఆవిష్కరించారు.

Sapthaham 2.jpg


ప్రతిరోజూ భక్తులు ప్రవచనాలను ఆస్వాదించి దివ్యానుభూతిని పొందారు. ఈ కార్యక్రమానికి మద్దతు అందించిన హోస్టులు శ్రావంతి, వల్లీ జాహ్నవి, ప్రసన్న, శ్రీదేవి, రాంసుధ, అపర్ణ, పావని గార్లకు హృదయపూర్వక కృతజ్ఞతలు.

వారం రోజులపాటు వైభవంగా, భక్తిశ్రద్ధలతో ఈ భాగవత సప్తాహాన్ని విజయవంతంగా నిర్వహించిన పరమార్థ, క్రాఫ్ట్ వోయేజెస్ సంస్థలకు మరియు పాల్గొన్న భక్తులందరికీ శ్రీ ప్రణవపీఠాధీశులు అనేక మంగళాశాసనాలు అందించారు.


ఈ వార్తలనూ చదవండి:

తెలుగు కళా సమితి ఆధ్వర్యంలో ఘ‌నంగా ఉగాది పుర‌స్కారాల ప్రదానం

తానా మిడ్ అట్లాంటిక్ విల్ అండ్ ట్రస్ట్ విజయవంతం

Updated Date - May 08 , 2026 | 03:00 PM