రియాధ్‌లో ఉయ్యాల తాడుకు చిక్కుకుపోయి తెలుగు చిన్నారి మృతి
ABN , Publish Date - Sep 28 , 2026 | 06:04 PM
ఉయ్యాల తాడుకు చిక్కుకుని ఓ తెలుగు చిన్నారి మరణించిన ఘటన రియాధ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: విధిని ఎవరూ మార్చలేరు అంటారు. సరదాగా హాయిగా ఆడుకుంటున్న ఓ బాలిక అకస్మాత్తుగా ఊహించని పరిణామంతో మృత్యువాత పడుతుందని చిన్నారి తల్లిదండ్రులు అనుకోలేదు. ఉయ్యాలే ఉరితాడై చిన్నారి ప్రాణం తీస్తుందని వారు కలలో కూడా ఉహించలేదు. ఇంట్లో ఆడుకునే పాప హఠాత్తుగా విగత జీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల శోకానికి అవధులు లేకుండాపోయాయి.
విశాఖపట్టణానికి చెందిన దంపతులు రియాధ్ నగరంలో బ్యాంకింగ్ రంగంలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులుగా పని చేస్తున్నారు. వీరికి అయిదు, పది సంవత్సరాల వయస్సు కల్గిన ఇద్దరు ఆడ పిల్లలు. ఉద్యోగాలు చేస్తూ కూడా ఆ దంపతులు తమ పిల్లలిద్దర్నీ అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు. ఆఫీసు వేళల మధ్యలో ఒకసారి వచ్చి వెళ్తుంటారు కూడా.
తల్లిదండ్రులు ఇద్దరు ఆదివారం సాయంత్రం ఆఫీసు పనులు ముగించుకుని మాములుగా ఇంటికి తిరిగి వచ్చే సరికి, ఉయ్యాల తాడు గొంతుకు బిగుసుకుపోయి అచేతనంగా పడి ఉన్న తమ పదేళ్ల గారాలపట్టిని హుటాహుటిన ఆసుపత్రికు తీసుకెళ్లినా ప్రయోజనం దక్కలేదు. మృతిపై పోలీసు విచారిస్తున్నారు.
ఆకాశంలో సగం.. అవకాశాల్లో సగమంటూ.. మహిళలు తమ శక్తి సామర్థ్యాలతో అన్ని రంగాల్లో పురుషులతో సమానంగా దూసుకుపోతున్నారు. గతంలో అమెరికా, ఐరోపా దేశాలలో మాత్రమే పరిమితమైన ప్రవాసీ భారతీయ మహిళ ఉద్యోగ ప్రస్థానం ఇప్పుడు గల్ఫ్ దేశాలలో కూడా పెరిగిపోతోంది.
పెళ్లి తర్వాత ఉద్యోగం చేయడం సమస్య కాకున్నా పిల్లలు పుట్టాక వారి ఆలనాపాలనా చూసుకుంటూ కూడా ఉద్యోగం చేయడం కొంచెం కష్టతరం. అయినప్పటికీ ఒక వైపు కుటుంబం, పిల్లల బాధ్యత మరోవైపు ఉద్యోగ బాధ్యతలను కూడా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. సాఫ్ట్‌వేర్ రంగంలో పురుషులతో పాటు ప్రతిభను కనబరుస్తున్న తెలుగు మహిళలు తమకంటూ ఒక విశిష్ఠతను సొంతం చేసుకుంటున్నారు. కొందరు ఇన్ఫోసిస్, టీసీయస్, కాగ్నిజెంట్ మొదలగు దిగ్గజ సంస్థల్లో పని చేసి వచ్చి ఆ అనుభవంతో ఇక్కడ సునాయసంగా ఉద్యోగాలు పొందేఅవకాశాలున్నా పిల్లలకు ప్రాధాన్యాన్ని ఇచ్చి గృహిణులుగా ఉండిపోతున్నారు.
మరికొందరు భర్తకు తోడుగా తన సంపద కూడా తమ పిల్లల భవిష్యత్తు కోసం పనికొస్తుందని ఆశిస్తూ ఉద్యోగాలు చేస్తున్నారు. ప్రతి తల్లి తనకంటే అద్భుతమైన జీవితాన్ని బిడ్డ పొందాలని కోరుకుంటుంది కాబట్టి, ఉద్యోగాలు చేయడాన్ని స్వాగతించాలి కానీ ఈ క్రమంలో కొన్ని సార్లు తమ బిడ్డల ఆలనాపాలనల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పరాయి దేశంలో చిన్నారులు ఇంట్లో ఏకాకిగా యాంత్రికంగా గడుపుతున్నారు. ఆనందంగా గడపవల్సిన బాల్యం భారంగా సాగుతోంది. ఆప్యాయత, ఆత్మీయత కరువైన పిల్లలు మొబైల్‌కు అలవాటుపడటం కూడా ఒక సవాల్‌గా మారుతోంది. కొందరు మానసిక రుగ్మతలతో బాధపడుతుండగా మరికొందరు ఆటిజం, మాటలు రాకపోవడం మొదలగు సమస్యలతో సతమతమవుతున్నారు.
వివిధ సమావేశాలు, భాషా దినోత్సవాలు, పండుగల పేరిట పెద్దలు కాలక్షేపం చేస్తున్నా చిన్నారులకు సముచిత ప్రాధాన్యం దక్కడం లేదు. వారిని డ్యాన్సులకు మాత్రమే పరిమితం చేస్తున్నారు. టీనేజీ (కౌమార దశ) బాలబాలికలు తమ తల్లిదండ్రుల వెంట ఈ జాతరలకు వచ్చి వెళ్తున్నారు. వారు ఓ మూలలో కూర్చుని మొబైల్ చూసుకుంటున్నారు తప్ప పెద్దల తరహాలో ఆసాద్వించడం లేదు. విభిన్న వయస్సులు, వృత్తుల వారీగా తమకు నచ్చిన విధంగా వారితో మమేకమయ్యే అవకాశాల కల్పనలో విఫలమవుతూ సోకాల్డ్ సంఘాలు పాటలు, డ్యాన్సుల గ్రూపులుగా మాత్రమే మిగిలిపోతున్నాయి. డ్యాన్సుల మినహా సమాజానికి సందేశం ఇవ్వలేకపోతున్నాయి. కొద్ది మాసాల క్రితం రియాధ్ నగరంలో రాజమండ్రికి చెందిన ఒక బాలుడు తన తల్లిదండ్రులను కిరాతకంగా చంపి తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
ఈ వార్తలను చదవండి:
తానా క్లీవ్‌ల్యాండ్ ఆధ్వర్యంలో టీమ్ స్క్వేర్ 5కే రన్
సేవలో ముందడుగు.. మానవత్వంలో ఆదర్శం..TSN యువత