ప్రవాసంలో ప్రసవం.. సంస్కృతి, సంప్రదాయాల మధ్య నవజాత శిశువు
ABN , Publish Date - Jun 20 , 2026 | 10:11 PM
సౌదీలో తెలుగు దంపతుల నవజాత శిశువుకు సంప్రదాయ స్నానం చేయించారు. వీరపల్లి భారతి సహకారంతో జరిగిన ఈ కార్యక్రమం ఆ తెలుగు కుటుంబాన్ని ఆనందంలో ముంచెత్తింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఒక మహిళకు తాను అమ్మ కావడం కంటే మరో ఆనందం మరొకటి ఉండదు. నవజాత శిశువును ఇంటికి తీసుకురావడం ఒక ఉత్తేజకరమైన, జీవితాన్ని మార్చే అనుభవం. ఇంటికి తీసుకువచ్చిన తర్వాత శిశువుకు స్నానం చేయించడం ఒక మధుర అనుభూతి, ఆనందాయకమైన అనుభవం అంతకు మించి బిడ్డతో అనుబంధం.
లాలీ..లాలీ.. వటపత్ర సాయికి, వరహాల లాలి.. రాజీవ నేత్రునికి, రతనాల లాలీ.. మురిపాల కృష్ణునికి .. ముత్యాల లాలి జగమేలు స్వామికి, పగడాల లాలి అంటూ స్వాతిముత్యం సినిమాలో బిడ్డకు స్నానం చేయించే సన్నివేశం తరహాలో ప్రతి తల్లి తన బిడ్డను స్నానం చేయించాలని అభిలాషిస్తుంది. అయితే మెట్టినిల్లు, పుట్టినిల్లుకు దూరంగా ఎక్కడో పరాయి దేశంలో ప్రవాస ప్రస్థానంలో అధునిక వైద్య సదుపాయాలన్నీ అందుబాటులో ఉన్నా సంప్రదాయంగా స్నానం చేయించే స్వప్నం మాత్రం ఒక సవాల్‌గా మిగిలిపోతుంది. చంటి పిల్లలన్ని కాళ్ల మీద పడుకోబెట్టి స్నానం చేయించే తెలుగింటి సంప్రదాయం అనేక మంది దంపతులకు ఒక కలగా మిగిలిపోతోంది. ముక్కులో నీళ్ళు పోవడం, బొడ్డు తాడును కాపాడడం అనే భయంతో శిశువుకు సంప్రదాయక స్నానాన్ని చేయించలేకపోతున్నారు.
చిత్తూరు జిల్లాకు చెందిన దినేష్ ఉద్యోగరీత్యా సౌదీ అరేబియాలో పని చేస్తున్నారు. మొత్తం అరబ్బు ప్రపంచంలో నిండు నిఖార్సైన అరబ్బు నేల సౌదీ అరేబియాలోని రియాధ్‌లో పని చేస్తున్న వేలాది మంది తెలుగు ఉద్యోగులలో అతనూ ఒకరు. సంవత్సరం క్రితం పెళ్లయిన దినేష్ కుటుంబ సమేతంగా సౌదీలో కాపురం ఉంటున్నాడు. ఇటీవల అతని భార్య సంధ్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అత్యంత అధునిక వైద్య సదుపాయాలు అందుబాటులలో ఉండడంతో ప్రసవం జరిగినందుకు కుటుంబం సంతోషించింది. పుట్టిన బిడ్డతో ఆసుపత్రి నుండి ఇంట్లో అడుగుపెట్టినప్పుడు సంతోషం పరవళ్లు తొక్కింది.
కొద్ది రోజుల అనంతరం శిశువుకు స్నానం అందునా తెలుగు సంప్రదాయకంగా స్నానం చేయించడానికి కుటుంబం దిగులు పడింది. మొదటి కాన్పు అందునా పరాయి దేశంలో జరగడంతో మమకారంతో మార్గదర్శకం చేసే వారు లేకపోవడంతో అందరు ఎదుర్కొనే మానసిక అయోమయ స్థితినీ ఈ కుటుంబం కూడా ఎదుర్కొంది. అయినా, తమ ఆచారాలు, సంస్కృతిపై అమిత ఆసక్తి కల్గిన దినేష్ కుటుంబం తమ బిడ్డకు సంప్రదాయంగా స్నానం చేయించడానికి ప్రయత్నించింది. నవజాత శిశువు పరిస్థితిని తెలుసుకొన్న వీరపల్లి భారతి అనే ప్రముఖురాలు ముందుకొచ్చి ఒక అక్కగా అండగా నిలిచింది. తన కాళ్లపై పడుకోబెట్టి పిండి రుద్దీ సంప్రదాయ రీతిలో స్నానం చేయించడంతో కుటుంబం పులకించిపోయింది.
పెద్ద భారతిగా రియాధ్ నగరంలోని తెలుగు కుటుంబాలలో సుపరిచతమైన ఆమె స్వస్థలం సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామం. సౌదీ అరేబియాలో అగ్రగామి తెలుగు ప్రవాసీ సంఘమైన సాటా సెంట్రల్‌లో ముఖ్య భూమిక వహించే భారతి తెలుగు వారు ఎక్కడ ఎలా ఉన్నా తమ సంస్కృతికి పెద్ద పీట వేస్తారని, అందులో ప్రతి ఒక్కరు తమకు వీలైన విధంగా చేయూతను ఇవ్వాలని చెబుతారు.
ఈ కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న ఒకరు సాటా సెంట్రల్ గ్రూప్‌లో చేసిన పోస్ట్‌కు స్పందించి ..పెద్ద భారతి తన పేరుకు తగినట్లుగా పెద్ద మనస్సుతో సకాలంలో స్పందించారు.
తెలుగు భాష, సంస్కృతి పరమావధిగా సాటా సెంట్రల్ పని చేస్తోందని సాటా ప్రతినిధులు సత్తి బాబు, ముజ్జమీల్ శేఖ్, ఆనందరాజులు తెలిపారు. క్షేత్రస్థాయిలో తెలుగు వారికి అన్ని విధాలుగా అండగా నిలవడం అనేది కూడా తెలుగు సంస్కృతిలో భాగమమని వారన్నారు.
సీమంతం నుండి మొదలు చంటి పిల్ల స్నానం వరకూ ప్రతిదీ తేట తెలుగు సంప్రదాయంలో చేయడానికి నూతన తరాన్ని ప్రొత్సహించాలని సత్తి బాబు, ముజ్జమీల్ షేక్, ఆనందరాజులు అభిప్రాయపడ్డారు.
ఈ వార్తలనూ చదవండి:
2029 ఎన్నికల్లో విజయమే లక్ష్యం: ఎమ్మెల్యే భాను ప్రకాశ్
అమెరికాలో వైభవంగా భారతీయత–2026 మహోత్సవం