నేపాల్‌లో తెలుగు ఎన్నారైల ఆచూకీ తెలియక అల్లాడుతున్న కుటుంబాలు
ABN , Publish Date - Aug 28 , 2026 | 09:08 PM
నేపాల్‌లో సంభవించిన జలప్రళయంలో ఇరుక్కుపోయిన, గల్లంతైన వారిలో తెలుగు ప్రవాసీయులు కూడా ఉన్నారు. అక్కడ సెల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో వారి బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: నేపాల్‌లో జరిగిన జలప్రళయంలో ఇరుక్కుపోయిన, గల్లంతైన వారిలో తెలుగు ప్రవాసీయులు కూడా ఉన్నారు. నేపాల్ – టిబెట్ సరిహద్దులో వీరి సెల్ ఫోన్లు కూడా పని చేయకపోవడంతో ప్రవాసీయుల బంధుమిత్రులు ఆందోళన చెందుతున్నారు.
ఖతర్‌లో పని చేసే సి. రమేశ్ బాబు జలప్రళయానికి కొన్ని గంటల ముందు చైనా–నేపాల్ సరిహద్దులోని రసువాలో చైనా వైపు ఇమ్మిగ్రేషన్ కార్యాలయం వద్ద కనిపించారు. ఆ తర్వాత ఆయన జాడ తెలియకపోవడంతో ఖతర్‌లోని బంధుమిత్రులతో పాటు స్వస్థలమైన కృష్ణా జిల్లాలో ఆయన కుటుంబం ఆందోళన చెందుతోంది.
దుబాయిలో నివాసముండే మూడు తెలుగు కుటుంబాలకు చెందిన ఐదుగురు ప్రవాసీయులు కైలాస మానస సరోవర పరిక్రమ యాత్ర ముగించుకుని తిరిగి వస్తుండగా వరదల కారణంగా వారి ప్రయాణానికి తాత్కాలిక అడ్డంకి ఏర్పడింది. గత మూడు రోజులుగా వరద కారణాన చైనా భూభాగం వైపు రాకపోకలు ఆగిపోవడంతో పాటు సెల్ ఫోన్ సంబంధాలు కూడా తెగిపోయి దుబాయిలోని వారి కుటుంబాలు తీవ్ర ఆందోళన చెందాయి.
అదృష్టవశాత్తూ శుక్రవారం టిబెట్ నుండి వీరు సురక్షితంగా నేపాల్‌కు చేరుకోవడంతో కుటుంబసభ్యుల మానసిక క్షోభకు తెరపడింది. 5 వేల అడుగుల ఎత్తున మానస సరోవర పర్వత ప్రాంతంలో వీరి సెల్ ఫోన్లు పని చేయకపోవడంతో అప్పుడప్పుడు వీరు వాట్సప్ మీద పంపుతున్న సందేశాల కోసం కుటుంబాలు ఎదురు చేశాయి. తాము చేరుకునే సమయానికి రుసువా చెక్ పోస్ట్ వరదలలో కొట్టుకుపోయిందని ఈ బృందంలోని గుంటూరు జిల్లాకు చెందిన సౌజన్య రెడ్డి దుబాయిలోని తన బంధుమిత్రులకు సమాచారమందించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మొత్తం 10 మంది ప్రవాసీయుల ఆచూకీ తెలియడం లేదని తెలుస్తోంది. వీరిలో కొందరు అమెరికాలో స్థిరపడిన వారని తెలిసింది. మంగళగిరిలోని ఏపీ ఎన్నార్టీఎస్ సంస్థ అధికారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో వీరి యోగక్షేమ సమాచారాల గురించి రేయింబవళ్ళు విచారిస్తున్నారు.
తెలంగాణకు చెందిన మొత్తం 23 మంది ప్రవాసీయులు యాత్రకు వెళ్లగా అందులో అత్యధికులు అమెరికాకు చెందిన వారే ఉన్నారు. దుబాయిలోని రెండు తెలంగాణ కుటుంబాలు కూడా యాత్రకు వెళ్లగా వారు క్షేమంగా ఉన్నట్లుగా సమాచారం.
ఈ వార్తలనూ చదవండి:
అమెరికాలో తెలుగు యువతి హత్య.. ఆగ్రాలో నిందితుడి అరెస్ట్..
న్యూజెర్సీలో తానా ఆధ్వర్యంలో చిన్నారులకు 100 బ్యాక్‌ప్యాక్‌లు, పాఠశాల సామగ్రి పంపిణీ