Share News

జీవితమంతా సౌదీలో గడిపి చివర్లో సోంత ఊరు నర్సాపురానికి..

ABN , Publish Date - Nov 09 , 2026 | 08:40 PM

అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని సౌదీ అరేబియాలో అడుగిడిన ఆ నర్సాపూరం నవ యువకుడు ఇటీవల వృద్ధాప్య సమీప దశలో స్వదేశానికి తిరిగి వెళ్లగా ఆయనకు తోటి తెలుగు ప్రవాసీయులందరూ కలిసి ఆత్మీయ విడ్కోలు పలికారు.

జీవితమంతా సౌదీలో గడిపి చివర్లో సోంత ఊరు నర్సాపురానికి..
John Sundar Returns to AP

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: ఉద్యోగ రీత్యా ఒక ప్రదేశానికి వెళ్లి అక్కడే ఎక్కువ కాలం గడపడంతో ఉద్యోగ విరమణ తర్వాత కూడా ఆ కర్మభూమితో అనుబంధం ఏర్పడి అక్కడే స్ధిరపడతారు. విశాఖపట్టణం, సింగరేణి గనుల ప్రాంతం లేదా హైదరాబాద్‌కు చెందిన చాలా మంది ఈ రకంగా స్థిరపడ్డారు. గల్ఫ్ దేశాలలో ఉద్యోగ విరమణ తర్వాత కూడా అక్కడే ఉండాలనే అభిలాష కొందరికి ఉన్నా అక్కడి నియమాల వలన కుదరదు.


ఎడారి నాట దశాబ్దాల పాటు నిబద్ధతతో, నిజాయతీగా పని చేసి ఉద్యోగ విరమణ అనంతరం స్వదేశానికి తిరిగి వెళ్లే సందర్భం ఎన్నారైల జీవితాల్లో అత్యంత భావోద్వేగభరితమైనది. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకుని సౌదీ అరేబియాలో అడుగిడిన ఆ నర్సాపూరం నవ యువకుడు ఇటీవల వృద్ధాప్య సమీప దశలో స్వదేశానికి తిరిగి వెళ్లగా ఆయనకు తోటి తెలుగు ప్రవాసీయులందరూ కలిసి ఆత్మీయ విడ్కోలు పలికారు. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురానికి చెందిన శీలా జాన్ సుందర్ తన బిఎస్సీ డిగ్రీ పూర్తి అయిన వెంటనే 1989లో సౌదీ అరేబియాలోని యాన్బూ పారిశ్రామిక పట్టణానికి వెళ్లి అక్కడే 37 ఏళ్ళ పాటు పని చేశారు. బిఎస్సీ కెమిస్ట్రీలో పట్టభద్రుడైన ఆయన లాబోరేటరి టెక్నీషియన్‌గా ఉద్యోగం మొదలు పెట్టి ఒక ప్రముఖ కంపెనీలో పర్యావరణ నిపుణుడిగా ఎదిగారు.


సమాచార వ్యవస్థ అంతంత మాత్రంగా ఉన్న ఆ కాలంలో ఆయన యాన్బూలోని తెలుగు ప్రవాసీయులను కలిసి సేవ చేయడానికి ప్రాధ్యానం ఇచ్చే వారు. కరోనా మహమ్మరి కాలంలో తెలుగు కార్మికులకు ఆహార సామగ్రి అందించడంలో అగ్రభాగాన నిలిచి వారిగా ఆయన పేరొందారు. సగటు తెలుగు వారి సాధకబాధకాలను తనకు వీలైన విధంగా పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఆయన మొదట తాజ్ యాన్బూ అనే తెలుగు ప్రవాసీ సంఘంతో, ఆ తర్వాత సాటాతో కలిసి వివిధ సేవ కార్యక్రమాలలో పాల్గొన్నట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి.


ఇటీవల జరిగిన జాన్ సుందర్ ఆత్మీయ విడ్కోలు సభలో యాన్బూ తెలుగు సమాజం అధ్యక్షుడు కాశీరాం మాట్లాడుతూ జాన్ సుందర్ చేసిన సేవలను గుర్తుకు చేసుకున్నారు. యాన్బూలోని తెలుగు సమాజం ఒక అమూల్య రత్నాన్ని కోల్పోతోందని అన్నారు. సాటా అధ్యక్షుడు మల్లేశన్ మాట్లాడుతూ జాన్ సుందర్ ప్రవాసంలో ఉన్న ప్రతి తెలుగువ్యక్తికీ ఆదర్శమని అన్నారు.


ఈ వార్తలనూ చదవండి:

చార్లెట్‌లో తానా ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్’ కార్యక్రమం విజయవంతం

ఖతర్‌లో ఏపీ అవతరణ దినోత్సవం.. పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు

Updated Date - Nov 09 , 2026 | 08:42 PM