ఖతర్‌లో ఏపీ అవతరణ దినోత్సవం.. పేద విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలు
ABN , Publish Date - Nov 09 , 2026 | 06:44 PM
తమ పిల్లలైనా ఉన్నతస్థానాల్లో ఉండాలని ఆశపడే పేద ప్రవాసీ తల్లిదండ్రులకు ఖతర్‌లోని అంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అండగా ఉంటోంది. ప్రతిభావంతులైన విద్యార్థులను నగదు బహుమతులతో ప్రోత్సహిస్తోంది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: ఖతర్, ఇతర గల్ఫ్ దేశాలలో అనేక మంది తెలుగు ప్రవాసీ కార్మికులు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్నారు. అయినప్పటికీ వారు తమ పిల్లలు చదువుకుని సమాజంలో ఉన్నత స్థానాల్లో నిలబడాలని, తాము పడుతున్న కష్టాలు తమ పిల్లలు పడకూడదని తపిస్తుంటారు. ఈ రకమైన ఆశాజీవులకు అండగా ఉండడానికి ఖతర్‌లోని అంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ ముందుకు వస్తోంది.
పేద ప్రవాసీ కార్మికులకు, వారి పిల్లల విద్య సంబంధిత విషయాలపై విదేశంలో పని చేస్తున్న తల్లిదండ్రులకు మార్గదర్శకత్వం చేయడంతో పాటు వారిని ప్రోత్సహించడానికి నగదు పారితోషికాన్ని కూడా అందిస్తోంది.
ఈ మేరకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా మాతృభూమిలో ఈ విద్యా సంవత్సరంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణులయిన ఆరుగురు విద్యార్ధుల తల్లిదండ్రులను సత్కరించింది. వారి పిల్లల కోసం నగదు ప్రోత్సాహక బహుమతులను ప్రదానం చేసింది. వీరిలో అత్యధికులు బాలికల తల్లిదండ్రులు కావడం విశేషం.

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయిన భారతీయ రాయబారి డాక్టర్ కె. శ్రీకర్ రెడ్డి వీరందర్నీ సత్కరించి ఈ రకమైన చేయూత నిజమైన వికసిత్ భారత్ యోజన అని అభివర్ణించారు.
ఖతర్‌లోని తెలుగు ప్రవాసీయుల సంక్షేమం, సాంస్కృతిక కార్యక్రమాలను రాయబారి అభినందిస్తూ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకట నరసింహం జోశ్యుల మాట్లాడుతూ తమ సంఘ కార్యకలాపాలను వివరించారు. ఆర్థికంగా వెనుకబడిన కార్మికుల సంక్షేమం కోసం తమ సంఘం అత్యవసర నిధిని నెలకొల్పిందని చెప్పారు. దురదృష్టవశాత్తూ మరణించిన వారి కుటుంబాలకు అందులోంచి తక్షణ సహాయంగా 50 వేల రూపాయాలను అందిస్తామని ఆయన వెల్లడించారు.

తెలుగు కార్మికుల సంక్షేమం కోసం ఇండియన్ కమ్యూనిటీ బెనెవెలంట్ ఫోరం నిరంతర కాలం ఉంటుందని దాని అధ్యక్షుడు షానవాస్ బావా అన్నారు.
ఈ సందర్భంగా ప్రముఖ గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ కుమార్తె సంస్కృతి మానవీయ విలువలు, మాతృభూమిపై మమకారం, ఔన్నత్యం గురించి ఆలపించిన గజల్స్ సభికులను ఆకట్టుకోన్నాయి. చిన్నారుల సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్య ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి.
లయోలా ఇంటర్నేషనల్ స్కూల్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో తెలుగు ప్రవాసీ ప్రముఖులు కె.యస్.ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణను ఉపాధ్యక్షురాలు ఉమా సమన్వయం చేయగా కార్యదర్శి వర్జీల్ బాబు ప్రారంభోపన్యాసం ఇచ్చారు. కార్యదర్శి సీతాపతి రావు వందన సమర్పణ చేసినట్లుగా నిర్వహకులు ఒక ప్రకటనలో తెలిపారు.


ఈ వార్తలనూ చదవండి:
చార్లెట్‌లో తానా ఆధ్వర్యంలో ‘అడాప్ట్ ఏ స్ట్రీట్’ కార్యక్రమం విజయవంతం
పరిషత్ ఎన్నికల్లో ఓటేసిన ప్రవాసాంధ్రులు