పరిషత్ ఎన్నికల ఓటింగులో పాల్గొన్న ప్రవాసాంధ్రులు
ABN , Publish Date - Nov 05 , 2026 | 06:18 PM
గల్ఫ్ ప్రవాసాంధ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. గల్ఫ్ నుండి స్వదేశానికి చేరుకున్నా భారీ వర్షాలు, వరదల కారణంగా కొందరు తమ స్వస్థలాలకు చేరుకోలేకపోయారు.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసీ అంటున్నారు ప్రవాసాంధ్రులు. పరదేశం కాదు పల్లె ముద్దంటూ అనేక మంది గల్ఫ్ ప్రవాసాంధ్రులు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓటు వేయడానికి ఆసక్తి ప్రదర్శించారు. గల్ఫ్ నుండి స్వదేశానికి చేరుకున్నా భారీ వర్షాలు, వరదల కారణంగా కొందరు తమ స్వస్థలాలకు చేరుకోలేకపోయారు.
శాసన సభ, లోక్ సభ ఎన్నికలలో గతంలో ఓటు వేసినప్పటికీ ఈసారి సొంత ఊరి ఎన్నికలలో ఓటు వేయడం ఒక గొప్ప అనుభూతి కల్గించిందని సౌదీ అరేబియాలో పని చేసే కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలోని ఈడుపుగల్లు గ్రామానికి చెందిన రాజశేఖర్ చెన్నుపాటి అన్నారు. గురువారం ఉదయం తమ స్వగ్రామంలో ఓటు వేసిన అనంతరం గల్ఫ్ ప్రవాసాంధ్రులకు ఒక వీడియో సందేశం పంపుతూ ప్రతి ఒక్కరూ తమ తమ ప్రాంతాలలోని స్థానిక సంస్థల ఎన్నికలలో విధిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. అందుకు ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకుని స్వదేశానికి రావాలని కోరారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి చేస్తున్న కృషికి కృతజ్ఞతగా తెలుగుదేశం మద్దతుదారులను గెలిపించాలని కూడా ఆయన కోరారు.
బతుకుదెరువు కోసం ఒమాన్‌లో ఉంటున్నా తమ మనస్సు మొత్తం గ్రామంలో నివసిస్తుందని ఒమాన్‌లో ఆయిల్ గ్యాస్ రంగంలో పని చేసే చిత్తూరు జిల్లా ఐరాల మండలం భీమనేనివారి పల్లి గ్రామానికి చెందిన వడ్లపట్ల మురళి అన్నారు. ఒమాన్‌లో ఉండే మరో ముగ్గురు సంపతి పయ్యాల, యౌశిక చౌదరి, ఢిల్లీ బాబులతో కలిసి వెళ్లి ఆయన గురువారం తమ స్వగ్రామంలో ఓటు వేశారు.
ఓటు హక్కును వినియోగించుకోవడానికి తాను స్వదేశానికి చేరుకున్నప్పటికీ, తుఫాను కారణంగా బెంగుళూరు నుంచి మార్కపురంలోని తమ ఊరికి వెళ్లలేకపోయానని సౌదీ అరేబియాలో నివసిస్తున్న ప్రవాసాంధ్రురాలు శిల్పా గడ్డం అన్నారు.
అన్నమయ్య జిల్లాలోని అన్ని పురపాలక ఎన్నికలలో క్రియాశీలకంగా వ్యవహరించిన గల్ఫ్‌లోని ప్రవాసీయులు గురువారం గాలివీడు, సండుపల్లి, పుల్లంపేట మండలాలో పరిషత్ ఎన్నికలలో హడావుడి చేశారు. కువైత్‌లో తమ ఉద్యోగాలకు సెలువు పెట్టి గొర్లముదివీడు గణేశ్, ఖాద్రూన్ షేఖ్‌లు గాలివీడులో మకాం వేశారు.
తెలుగుదేశం పార్టీని మూడంచెల వరకూ స్థానిక స్థాయిలో బలోపేతం చేయడం నిజమైన అభివృధ్ధి అని తెలుగుదేశం పార్టీ గల్ఫ్ ప్రవాసాంధ్ర నాయకుడు జానీ బాషా అన్నారు.
ఖతర్ నుంచి తన భార్య శ్రీలక్ష్మి, కూతురు శ్రావ్యలు ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలలో ప్రత్యేకించి ఓటు వేయడానికి వెళ్లివచ్చారని తెలుగుదేశం పార్టీ నాయకుడు గొట్టిపాటి రమణ వెల్లడించారు.
ఉద్యోగం రీత్యా తాము ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లలేకపోయినా వీలయిన విధంగా అన్ని రకాలుగా కూటమి అభ్యర్థులకు మద్దతు ఇచ్చామని సౌదీ అరేబియాలోని జనసేన పార్టీ నాయకులు దుగ్గరపు ఎర్రన్న, యాఖూబ్ ఖాన్‌లు వివరించారు. కూటమి ధర్మకర్తవ్యాన్ని తాము నిజాయతీగా నిర్వర్తించామని జనసేన నాయకులు కేసరి త్రిమూర్తులు, చందక రాందాస్‌లు చెప్పారు.
ఈ వార్తలనూ చదవండి:
లండన్‌లో జరిగిన డబ్ల్యూటీఎం 2026లో.. ఏపీ పర్యాటక శాఖకు ప్రత్యేక గుర్తింపు
శంకర నేత్రాలయ, డెన్వర్ ఆధ్వర్యంలో ‘మ్యూజిక్ & డాన్స్ ఫర్ విజన్’