Share News

సౌదీలో దసరా, బతుకమ్మ సంబరాలు

ABN , Publish Date - Oct 22 , 2026 | 07:18 AM

సౌదీలో ఎన్నారైలు దసరా, బతుకమ్మ వేడుకలను వైభవంగా జరుపుకున్నారు.

సౌదీలో దసరా, బతుకమ్మ సంబరాలు
Dasara, Bathukamma Celebrations in Saudi

ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి ఇర్ఫాన్: పరాయి దేశంలో పరభాష, సంస్కృతి మధ్యలో కూడా భారతీయ సంస్కృతి, పండుగలను జరుపుకోవడం ఒక ప్రత్యేక వినూత్న అనుభూతిని కలిగిస్తుంది. అందునా సంస్కృతి, సంప్రదాయాలను ప్రాణంగా భావించే ప్రవాసీ తెలుగు కుటుంబాలలో పండుగలు, సామూహిక వేడుకలు ప్రత్యేకమైన భావోద్వేగాలను పంచుతూ ఒంటరితనం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పరాయి గడ్డపై కూడా తమ సంస్కృతిని కాపాడుకుంటూ తెలుగు ప్రవాసీ కుటుంబాలు సామూహిక వేడుకల్లో ఐక్యతను చాటుకుంటాయి.

భౌగోళికంగా మొత్తం గల్ఫ్ దేశాలలో సగానికి కంటే ఎక్కువ ఉన్న సౌదీ అరేబియాలోని విభిన్న ప్రాంతాలలో తెలుగు ప్రవాసీయులు నివసిస్తుండగా వారందరూ స్థానిక నియమాలు, ఆచార వ్యవహారాలను గౌరవిస్తూ తమ తమ ఆచారాలను, పండుగలను వైభవంగా జరుపుకుంటున్నారు. భారతీయులు ఎక్కడ ఉన్నా కోలాహలంగా జరుపుకునే పండుగలలో దసరా ప్రప్రథమం.

3.jpg


దసరాకు ముందుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకోవడం తెలంగాణలో అనాదిగా ఉన్న సంప్రదాయమైనప్పటికీ దీన్ని గత కొంతకాలంగా విదేశాలలో ప్రత్యేకించి గల్ఫ్ దేశాలలో సామూహికంగా జరుపుకుంటున్నారు. అమావాస్య మరుసటి రోజు నుంచి తొమ్మిది రోజుల పాటు సమాంతరంగా స్త్రీ శక్తిని పూజించడమే పరమార్థంగా ఆనందోత్సాహాలతో సౌదీలోని తెలుగు ప్రవాసీ కుటుంబాలు తమ ఆచారాలకు అనుగుణంగా జరుపుకున్నాయి.

దసరా నవరాత్రుల సంప్రదాయంలో భాగంగా దుర్గా దేవిని ఒక్కొక్క అలంకారంలో ఒక్కో రోజు పూజిస్తే, బతుకమ్మలో గౌరమ్మను పూజిస్తూ తమకు వీలయిన విధంగా తమ తమ ఇళ్లలలో వంతులవారీగా ఆత్మీయుల సమక్షంలో ఆరాధిస్తూ తెలుగు కుటుంబాలు భక్తిపారవశ్యంతో మునిగితేలాయి.

అటు ఎర్ర సముద్ర తీరంలోని యాన్బూ నుండి ఇటు అరేబియా సముద్రంలో అల్ ఖోబర్ వరకూ, ఇటు రియాధ్ నగరం నుండి అటు యమన్ సరిహద్దుకు అనుకుని ఉన్న అభా వరకూ తెలుగు కుటుంబాల ఆత్మీయత కలయికగా పండుగను జరుపుకున్నారు.

5.jpg


సౌదీ అరేబియా స్విట్జర్లాండ్‌గా పేరొందిన అభా నగరంలో దసరా, సద్దుల బతుకమ్మ, దుర్గాష్టమి వేడుకలను తెలుగు ప్రముఖుడు డాక్టర్ జయశంకర్ తేడ్ల, స్వాతి దంపతుల నేతృత్వంలో భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. దుర్గా అష్టోత్తర శతనామ అర్చనలతో ప్రారంభమయి సామూహిక దుర్గా హారతితో ముగిసిన ఈ వేడుకలలో తెలుగు వారితో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ప్రవాసీయులు కూడా పాల్గొని భక్తిపారవశ్యంతో పులకించిపోయారు. దుర్గాపూజ అనంతరం మహిళలు రంగురంగుల పూలతో ఆకర్షణీయంగా అమర్చిన బతుకమ్మల చుట్టూ పాడుతూ ఆనందించారు. జెన్నీ కొమ్మినేని, శ్రావణి, సుజిత్, గణేష్‌లు బతుకమ్మ అలంకరణ పూలను స్థానిక పర్వత ప్రాంతాల నుంచి సేకరించారు.

తెలుగు వారి ఆహార రుచులకు అనుగుణంగా, సద్దుల బతుకమ్మ వాయినంగా అచ్చం తెలంగాణ సంప్రదాయరీతిలో అయిదు రకాల సద్దులను గుంటూరు జిల్లాకు చెందిన అబ్దుల్ రషీద్ వండిన తీరుకు అతిథులు ముచ్చటపడ్డారు. పెరుగన్నం, చింతపండు పులిహోర, నిమ్మకాయ, కొబ్బరి, నువ్వుల సద్దులను రషీద్ .. బిర్యానీ డైన్ హోటల్‌లో తయారు చేసి అరటి ఆకులలో వడ్డించడం ఆకర్షణగా నిలిచింది. బతుకమ్మ సద్దులతో పాటు పలు రకాల పండుగ వంటకాలను కూడా వడ్డించినట్లుగా డాక్టర్ జయశంకర్, స్వాతిలు తెలిపారు. సునీల్, రఘు, కళ్యాణ్, కృష్ణ, జాఫర్‌లతో పాటు ఇతరులు వేడుకలను సమన్వయం చేసినట్లుగా వారు వెల్లడించారు.

7.jpg


సహజంగా తెలుగు కుటుంబాల సంఖ్య ఎక్కువగా ఉన్న రియాధ్ నగరంలో ఉత్సాహంగా దీన్ని జరుపుకున్నారు. తెలుగు మహిళ ప్రముఖురాలు ప్రియాంక బిళ్ళా ఆధ్వర్యంలో జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. ప్రియాంకతో పాటు శ్వేత, భారతీ దాసరి, సుచరిత కందుల, సంధ్య తేకుమల్ల, నిహారిక బెసర్ల, లావణ్యలు సంప్రదాయకంగా సంస్కృతికి, ప్రకృతి ఆరాధనకు ప్రతీకగా బతుకమ్మ సంబరాలను జరుపుకున్నారు. దసరా వేడుకలను కూడా వీరు వేరుగా ఘనంగా జరుపుకున్నారు. మరికొన్ని కుటుంబాలు దుర్గాదేవి నవరాత్రులను భక్తిశ్రద్ధలతో జరుపుకోగా, మరికొందరు సంయుక్తంగా కూడా భక్తిశ్రద్ధలతో జరుపుకోన్నారు.

అదే విధంగా, అల్ ఖోబర్, దమ్మాం నగరాలలోని అనేక కుటుంబాలు వేర్వేరుగా వేడుకలను జరుపుకున్నాయి. వ్యక్తిగతంగా కాకుండా, సామూహికంగా 23 అక్టోబర్ శుక్రవారం తెలుగు కుటుంబాలతో దసరా-బతుకమ్మ వేడుకలను తెలుగు ప్రముఖుడు పల్లెం తేజ ఆధ్వర్యంలో ఘనంగా జరపడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. జెద్ధా నగరంలో కూడా తెలుగు కుటుంబాలు ఈ వేడుకలను తమ తమ ఆచారాలకు అనుగుణంగా జరుపుకున్నాయి.

4.jpg6.jpg2.jpg8.jpg


ఈ వార్తలనూ చదవండి:

హాంకాంగ్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు

ఫ్రిస్కోలో వేడుకగా ‘టీప్యాడ్’ బతుకమ్మ సంబరాలు.. నవీన్ పోలిశెట్టి సందడి

Updated Date - Oct 22 , 2026 | 07:20 AM