Share News

అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం

ABN , Publish Date - Sep 05 , 2026 | 09:13 PM

అమెరికాలోని బోస్టన్ స్టేట్ హౌస్‌లో తెలుగు వ్యక్తి కృష్ణ ప్రసాద్ సోంపల్లికి అరుదైన గౌరవం లభించింది. కమ్యూనిటీ సేవల్లో ఆయన అందించిన విశేష సేవలను గుర్తించిన మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆయనను ప్రశంసించింది.

అమెరికాలో తెలుగు వ్యక్తికి అరుదైన గౌరవం
Krishna Prasad Sompalli

బోస్టన్, మసాచుసెట్స్ అమెరికా: కమ్యూనిటీ నాయకుడిగా, సేవా కార్యక్రమాల్లో చురుకైన వాలంటీర్‌గా పనిచేస్తున్న కృష్ణ ప్రసాద్ సోంపల్లికి అరుదైన గౌరవం లభించింది. సమాజ సేవ పట్ల ఆయన చూపుతున్న అసాధారణ నిబద్ధతను గుర్తించిన మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని అందజేసింది. మసాచుసెట్స్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ స్పీకర్ రొనాల్డ్ మరియానో జారీ చేసిన ఈ ప్రశంసా పత్రంలో కృష్ణ ప్రసాద్ సోంపల్లి అందిస్తున్న కమ్యూనిటీ సేవలను ప్రత్యేకంగా అభినందించారు. వివిధ సేవా, సామాజిక కార్యక్రమాల ద్వారా ఆయన అందించిన వాలంటీర్ సేవలు అనేక మంది వ్యక్తులు, కుటుంబాలపై సానుకూల ప్రభావం చూపాయని ప్రశంసా పత్రంలో పేర్కొన్నారు.


ఈ గౌరవప్రదమైన ప్రశంసా పత్రాన్ని స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్ సెప్టెంబర్ 3, 2026న బోస్టన్‌లోని మసాచుసెట్స్ స్టేట్ హౌస్‌లో కృష్ణ ప్రసాద్ సోంపల్లికి అందజేశారు. కృష్ణ ప్రసాద్ సోంపల్లి అనేక సంవత్సరాలుగా కమ్యూనిటీ సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు. అవసరంలో ఉన్న కుటుంబాలు, పిల్లలు, విద్యార్థులు, ఇతరులకు వివిధ రూపాల్లో సహాయం అందిస్తున్నారు. విద్యా, యువత, చారిటబుల్ కార్యక్రమాలతో పాటు పాఠశాల సామగ్రి, ఆహార పంపిణీ, ఆరోగ్య అవగాహన, సాంస్కృతిక, ఇతర సామాజిక సేవా కార్యక్రమాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. తన సేవా కార్యక్రమాల్లో భాగంగా వివిధ కమ్యూనిటీ సంస్థలు, వాలంటీర్లు, పాఠశాలలు, నాయకులు, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పనిచేస్తున్నారు. అవసరంలో ఉన్న వారికి అండగా నిలుస్తూ, సమాజ సేవలో తన వంతు కృషి చేస్తున్నారు.

Untitled-5.jpg


ఈ సందర్భంగా కృష్ణ ప్రసాద్ సోంపల్లి మాట్లాడుతూ.. 'మసాచుసెట్స్ స్టేట్ హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ నుంచి ఈ గౌరవం అందుకోవడం నాకు ఎంతో ఆనందంగా, గర్వంగా, వినయంగా అనిపిస్తోంది. కమ్యూనిటీ సేవ అనేది గుర్తింపు కోసం చేసేది కాదు. అవసరంలో ఉన్న వారికి సహాయం చేయడం, సమాజానికి తిరిగి ఇవ్వడం, కనీసం ఒక్కరి జీవితంలోనైనా మంచి మార్పు తీసుకురావడమే నా ఉద్దేశం. ఈ ప్రశంసా పత్రాన్ని అందించిన స్పీకర్ రొనాల్డ్ మరియానో, స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్‌లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే నా సేవా కార్యక్రమాల్లో నాతో కలిసి పనిచేసిన ప్రతి వాలంటీర్, తానా సంస్థ, మిత్రుడు, కమ్యూనిటీ సభ్యుడితో ఈ గౌరవాన్ని పంచుకుంటున్నాను' అని తెలిపారు.

తనకు లభించిన ఈ గుర్తింపు మరింత ఉత్సాహంతో కమ్యూనిటీ సేవను కొనసాగించేందుకు ప్రేరణనిస్తుందని కృష్ణ ప్రసాద్ సోంపల్లి చెప్పారు. సమాజంలో సేవా భావాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైన విధంగా ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. కృష్ణ ప్రసాద్ సోంపల్లికి లభించిన ఈ ప్రశంసా పత్రం ఆయన ఎన్నో ఏళ్లుగా కొనసాగిస్తున్న సేవా కార్యక్రమాలకు దక్కిన గౌరవంగా కమ్యూనిటీ సభ్యులు అభినందిస్తున్నారు. అలాగే వాలంటీర్లు, వివిధ సంస్థలు అందిస్తున్న సేవలకు కూడా ఇది గుర్తింపుగా నిలుస్తుందని పేర్కొన్నారు. సెప్టెంబర్ 3, 2026న బోస్టన్‌లోని మసాచుసెట్స్ స్టేట్ హౌస్‌లో స్టేట్ రిప్రజెంటేటివ్ జెఫ్ రాయ్ చేతుల మీదుగా ఈ ప్రశంసా పత్రాన్ని అందజేశారు.


Also Read:

TANA (తానా) ఆధ్వర్యంలో మిన్నియాపోలిస్‌లో విద్యార్థులకు బ్యాక్ ప్యాక్స్ పంపిణీ

అట్లాంటాలో కాన్సుల్ జనరల్ రమేశ్ బాబు లక్ష్మణన్‌కు ఆత్మీయ వీడ్కోలు సభ

Updated Date - Sep 05 , 2026 | 09:13 PM