ఖతర్‌లో తెలంగాణ జాగృతి ‘అలయ్ బలయ్’ వేడుక
ABN , Publish Date - Oct 22 , 2026 | 07:37 AM
ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీ సంఘమైన తెలంగాణ జాగృతి అలయ్, బలయ్ వేడుకను ఘనంగా నిర్వహించింది.
ఆంధ్రజ్యోతి గల్ఫ్ ప్రతినిధి: భారతీయ పండుగలలో మహోన్నతమైనది దసరా. అదే సందర్భంగా తెలంగాణ వైభవానికి ప్రతీక అయిన బతుకమ్మ వేడుకలు, అందరూ కలిసిమెలిసి ఘనంగా నిర్వహించుకునే ‘అలయ్ బలయ్’ వేడుకలు కొద్దికాలం క్రితం హైదరాబాద్ నుండి మొదలై ఇప్పుడు అరబ్బునాటకు చేరుకున్నాయి.
దసరా, బతుకమ్మ రెండు పండుగల ఔన్నత్యాన్ని అస్వాదించడమే అలయ్ బలయ్‌గా బలపడుతుండగా ఖతర్‌లోని తెలంగాణ ప్రవాసీ సంఘమైన తెలంగాణ జాగృతి దీన్ని ఈసారి ఘనంగా నిర్వహించింది. భారతీయ రాయబారి సతీమణి, తెలంగాణ ఆడబిడ్డ అయిన ప్రణితరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈ కార్యక్రమంలో సంప్రదాయక మూలాలను మరువకుండా, ఆధునిక పోకడలను జోడించి సమాజానికి కొత్త శైలిని పరిచయం చేసే విధంగా నిర్వహించిన ఫ్యాషన్ షో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
వివిధ రకాల పూలతో పేర్చిన బతుకమ్మల చుట్టూ ప్రణితరెడ్డి, ఇతర మహిళలు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ఈ సందర్భంగా చిన్నారులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు కూడా ఆకట్టుకున్నాయి. దాండియా, కొలటాల ప్రదర్శనలో మహిళలు ఆసక్తిగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి పరిరక్షణతో పాటూ విలక్షణంగా దీన్ని ఇతరులకు వివరించే దిశగా తెలంగాణ జాగృతి పని చేస్తుందని సంస్థ నాయకుడు శ్రీధర్ అబ్బగోని వివరించారు.
పండుగల ఔన్నత్యాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలి నందిని అతిథులకు వివరించారు. గౌరవ అతిథిగా ఐ.సి.సి అధ్యక్షులు మణికంఠన్ పాల్గొనగా తెలుగు ప్రముఖులు కె.యస్.ప్రసాద్, కె.కుమార్, వెంకప్ప తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలనూ చదవండి:
హాంకాంగ్‌లో వైభవంగా బతుకమ్మ సంబరాలు
ఫ్రిస్కోలో వేడుకగా ‘టీప్యాడ్’ బతుకమ్మ సంబరాలు.. నవీన్ పోలిశెట్టి సందడి